‘ఉపాధి’కి అండగా ఉంటాం
రాహుల్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు రఘువీరా. ఉత్తమ్ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమర్థంగా అమలయ్యేందుకు కూలీల తరఫున పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో సమావేశం జరిపి ఈ పథకం అమలుతీరుపై సమీక్షించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. ముందుగా పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ యూపీఏ హయాంలో తెచ్చిన అనేక పథకాలు.. ముఖ్యంగా హక్కుతో కూడుకున్న పథకాలు సమర్థంగా అమలయ్యేలా లబ్ధిదారులతో కలిసి పోరాడాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు చెప్పారు.
అనంతరం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలకు హక్కుగా ఇచ్చిన పథకాలను బీజేపీ, దాని మిత్రపక్షాలు నీరుగార్చుతున్నాయని ఆరోపించారు. ఏపీలో కూడా ఉపాధి హామీ పథకం ద్వారా 2013-14లో 60 లక్షల మంది ఉపాధి పొందితే గతేడాది 55 లక్షల మంది మాత్రమే ఉపాధి పొందినట్లు చెప్పారు. 2013-14లో రూ. 4,700 కోట్లు ఖర్చు చేస్తే.. పోయిన సంవత్సరం రూ. 2,300 కోట్లు మాత్రమే వ్యయం చేశారని.. పథకాన్ని నీరు గార్చుతున్న తీరు ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతుందని దుయ్యబట్టారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందని, అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రశ్నిస్తే అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
‘ఉపాధిహామీ’ బలోపేతానికి పోరాటం: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
‘ఉపాధి హామీ పథకం బలహీన పడిన తీరు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడకుండా పోవడాన్ని రాష్ట్రాల వారీగా రాహుల్ సమీక్షించారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం బలోపేతం కోసం పోరాటం చేయాలని ఆదేశించారు. ఇంత కరువు కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన తీరును చర్చించారు. కూలీల తరపున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారులకు అండగా ఉంటూ నిరుపేదలకు వ్యతిరేకంగా పనిచేస్తుందో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా పోరాడుతాం.. ప్రతి మూడు నెలలకోసారి ఇకపై అన్ని విషయాలపై సమీక్ష జరుపుతారు.’ అని వివరించారు. అక్బరుద్దీన్ పదజాలంపై స్పందిస్తూ అసభ్య పదజాలాన్ని ఖండిస్తున్నామని, ముందు ముందు జరిగే పరిణామాలను మీరే చూస్తారని పేర్కొన్నారు.