నాటి రైతు.. నేటి కూలీ
♦ అన్నదాత బతుకును కాటేసిన కరువు..
♦ అడుగంటిన బోరుబావులు.. నెర్రెలువారిన భూములు
♦ 90 శాతం రైతులు ‘ఉపాధి’కే.. పిల్లాపాపలతో పనులకు..
♦ పరిగి నియోజకవర్గంలో 27వేలు దాటిన కూలీల సంఖ్య
♦ ఎండలను సైతం లెక్కచేయకుండా పనులకు..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది పరిగి మండలం మిట్టకోడూరుకు చెందిన మహిళలు.. వారి చంకలో పాలుతాగే చిన్నారులు.. వీరివి ఒకప్పుడు రైతు కుటుంబాలే.. ఇప్పుడు కరువు కాటేయడంతో భూగర్భజలాలు అడుగంటి చేలన్నీ బీళ్లుగా మారాయి. కుటుంబ పోషణ కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధి బాట పట్టారు. చిన్నారులను చంకనెత్తుకొని పనులకు వెళ్తున్నారు. ఇది వీరొక్కరి పరిస్థితే కాదు. ఈ గ్రామంలో మొత్తం 450 రైతు కుటుంబాలున్నాయి. వీరిలో 435మంది ఇప్పుడు ఉపాధి కూలిపనులతో కడుపు నింపుకుంటున్నారు. ఈ పరిస్థితి పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొంది. ఎప్పుడూ బయటకు రాని పసిపిల్లలున్న తల్లులు మొదలుకుని వృద్ధులు, స్కూల్ పిల్లలు సైతం పనులకు వెళుతున్నారు.
కూలీలైన రైతులు..
ఇక్కడ జనసంద్రంలా కనిపిస్తున్నది పరిగి మండలంలోని మిట్టకోడూర్ చెరువు.. ప్రతి సంవత్సరం ఈ సీజన్‌లో అది నీళ్లతో కళకళలాడేది. రబీ సమయంలో సైతం ఈ చెరువు కింద వరి పంట సాగయ్యేది. ప్రస్తుతం అది పూర్తిగా ఎండిపోయింది. నెర్రెలు వారి దర్శనమిస్తోంది. దీంతో ఆ చెరువులో ఉపాధిహామీ అధికారులు పూడికతీత పనులు ప్రారంభించారు. దీంతో బతుకు భారమై ఎప్పుడూ చెరువు నీటితో పంటలు సాగు చేసుకునే రైతులు ఇప్పుడు కూలీల అవతారమెత్తారు. అదే చెరువులో వారు పూడికతీత పనులకు వెళుతున్నారు. వచ్చిన కూలితో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
పరిగి: కరువు రైతన్న బతుకు దెరువును కాటేసింది. గడిచిన ఖరీఫ్ మొదలు రబీ వరకు నెలకొన్న వర్షాభావ పరిస్థితులు.. విపరీతమైన ఎండలు రైతును పూర్తిగా కుంగదీస్తున్నాయి. వ్యవసాయ బావులు, బారుబావులు, చెరువులు పూర్తిగా అడుగంటాయి. చేలు బీళ్లుగా మారియి. చివరకు అన్నం పెట్టే రైతన్న రోడ్డున పడ్డాడు. నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచడంతో కాడిని వదిలేసి గడ్డపార గంప చేతబట్టాడు. రైతన్న కాస్త కూలీగా మారాడు. కొందరు ముంబై, పూణేలకు వలసలు వెళ్లగా మరికొందరు ఉన్న ఊరిని వదిలేయలేక ఉపాధి కూలీలుగా మారారు. ఏకంగా గ్రామాల్లో 90నుంచి 95శాతం మంది రైతులు ప్రస్తుతం ఉపాధి పనులకు వె ళుతున్నారు.
పరిగి నియోజకవర్గంలో గత సంవత్సరం ఈ సీజన్‌లో 15వేల మంది కూలీలు పనులకు వెళ్లగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 27 వేలు దాటింది. నెల రోజుల క్రితం వరకు ఒక్కో మండలంలో 2వేల నుంచి 2500 మంది కూలీలు మాత్రమే పనులకు రాగా ప్రస్తుతం ఆ కూలీల సంఖ్య రెట్టింపయ్యింది. కరువు నేపథ్యంలో ఎండలను సైతం లెక్క చేయకుండా పెద్ద రైతులు మొదలుకుని చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలలు సైతం ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు.
ప్రస్తుతం పరిగి మండల పరిధిలోని 22 జీపీల్లో 5334మంది కూలీలు పనులు చేస్తున్నారు. దోమ మండలంలో 4500 నుంచి 5000 మంది కూలీలు పనులకు వస్తున్నారు. గండేడ్ మండలంలో 5500 మంది కూలీలు, కుల్కచర్ల మం డలంలో 6200 మంది, పూడూరు మండలంలో 5400 మంది కూలీల చొప్పు మొత్తం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో సగటున 25వేల నుం చి 27వేల మంది కూలీలు పనులకు వెళుతున్నారు.