రూ.4.73 కోట్లు
ఇదీ దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యం ఖరీదు
2012-13 ఆడిట్‌లో వెలుగుచూసిన వాస్తవాలు
దేవస్థాన ఆదాయంతో సమానంగా ఖర్చు
విజయవాడ : రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అధికారులు నిర్లక్ష్యం ఖరీదు రూ.4,73,25,868గా ఆడిట్ అధికారులు నిర్ధారించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం రికార్డులను పరిశీలించిన అధికారులు 64 రకాల అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అధికారులు జాగ్రత్తలు తీసుకుంటే అమ్మవారి ఆదాయం మరో రూ.4.73 కోట్లు పెరిగి ఉండేదని తమ నివేదికలో పేర్కొన్నారు. దేవస్థానానికి వచ్చే ఆదాయం మొత్తం అధికారులు ఖర్చు చేసేస్తున్నారే తప్ప మిగిల్చేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదంటూ అందులో తెలిపారు. 2012-13లో దేవస్థానానికి రూ.78 కోట్లు ఆదాయంవస్తే ఇంచుమించుగా అంతే ఖర్చు చూపించడం గమనార్హం.
నిదర్శనాలు ఇవిగో...
► జిల్లాలోని చిన్నచిన్న దేవాలయాలకు అమ్మవారి దేవస్థానం ప్రోనోట్లు రాయించుకుని అప్పుగా ఇస్తుంది. ఈ విధంగా కొన్నేళ్లుగా రూ.2.01 కోట్లు అప్పుగా ఇచ్చారు. వీటిని తిరిగి వసూలు చేయడంపై అధికారులు శ్రద్ధ చూపలేదు.
► నగరపాలక సంస్థకు రోడ్ల మరమ్మతుల నిమిత్తం రూ.50 లక్షల అమ్మవారి సొమ్ము ఇచ్చారు. మరమ్మతుల్లేవు. బకాయి చెల్లింపులూ లేవు. కనీసం కార్పొరేషన్‌కు కట్టే పన్నుల్లో నుంచైనా ఈ సొమ్మును మినహాయించేందుకు దేవస్థానం అధికారులు ప్రయత్నించలేదు.
► దేవస్థానం లడ్డూ ప్రసాదాలను గతంలో ఆంధ్రా బ్యాంకు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహించేది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బును ఆంధ్రాబ్యాంకులోని దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. 2012 అక్టోబర్ ఒకటి నుంచి 31 మార్చి 2013 వరకు రూ.20,65,134 యూనియన్ సభ్యులు వాడేసుకున్నారు. అధికారులు అప్రమత్తమై దీన్ని రికవరీ చేశారు. ఈ డబ్బుకు సుమారు రూ.5 లక్షలు వరకు వడ్డీ వసూలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.
►దేవస్థానం బస్సు కింద పడి ఒక పాపకు గాయం అయితే ఆమెకు అమ్మవారి సొమ్ము రూ.2,03,643 వెచ్చించి వైద్యం చేయించారు. ఈ సొమ్మును బీమా శాఖ నుంచి రికవరీ చేసుకునే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నాలు జరగలేదు.
► ఘాట్ రోడ్డు, దుర్గాఘాట్‌లో ఉండే చిరు వ్యాపారుల నుంచి రూ.55,15,979 వసూలు చేశారు. వారికి రసీదులు కూడా ఇస్తున్నారు. ఈ సొమ్మును రికార్డుల్లో సరిగా నమోదు చేయడం లేదని ఆడిట్ అధికారులు గుర్తించారు.
► దేవస్థానానికి ఎస్‌బీఐ, ఆంధ్రా, సిండికేట్, ఐసీఐసీఐ, బ్యాంకు ఆఫ్ బరోడాల్లో డిపాజిట్లు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో అకౌంట్లను, దేవస్థానం క్యాష్ బుక్‌ను పరిశీలిస్తే సుమారు రూ.1,88,75,935 మేర తేడాలు ఉన్నట్లు గుర్తించారు.
► దేవస్థానం పనులు చేసే కాంట్రాక్టర్ వద్ద ఇన్‌కం ట్యాక్స్, ఇసుక సీనరేజీలు, లేబర్ సెస్‌లు వసూలు చేసి ఆయా శాఖలకు చెల్లించాలి. ఈ విధంగా చెల్లించనందుకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ దేవస్థానం నుంచి రూ.66,069 జరిమానా వసూలు చేసింది.
►దేవస్థానానికి చెందిన చెప్పుల స్టాండ్, కొబ్బరి చిప్పలు, చీరలు, టోల్‌గేట్ కాంట్రాక్టులు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లు ముందుగా చె ల్లించిన ఈఎండీ డిపాజిట్‌ను కాంట్రాక్టు పూర్తయిన తరువాత ఇవ్వాలి. అధికారులు ఆఖరు వాయిదాకు ఈ సొమ్మును జమ చేసుకోవడం గమనార్హం. కాంట్రాక్టర్ల వద్ద లీజు సొమ్మును సకాలంలో వసూలు చేయకపోవడం వల్ల దేవస్థానం ఆదాయానికి గండి పడుతోంది.
► ఇవేగాక ఇంకా అనేక లోపాలను ఆడిట్ అధికారులు గుర్తించారు. కొత్తగా వచ్చే పాలకవర్గం, ఈవోలు వీటిపై దృష్టి పెట్టి లోపాలను సరిదిద్దాలని భక్తులు కోరుతున్నారు.