రూ.43వేల కోట్ల రెవెన్యూ సాధిస్తాం
♦ ఈ ఏడాది ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటాం: తలసాని
♦ వాణిజ్య పన్నుల శాఖలో సమూల మార్పులు
♦ జీరో దందాపై కఠినంగా వ్యవహరిస్తున్నాం
♦ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన రెవెన్యూను సమకూర్చడంలో వాణిజ్య పన్నుల శాఖ మెరుగైన పనితీరు కనబరుస్తోందని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ఆదాయ లక్ష్యం, ప్రణాళికలు, జీరో దందా నివారణకు తీసుకోనున్న చర్యలను ఆయన బుధవారం ‘సాక్షి’కి వివరించారు. తమ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.43,115 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించారని.. నెలకు సగటున రూ.3,500 కోట్ల రెవెన్యూ సాధించాల్సి ఉందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని... ప్రజలపై పన్నుల భారం మోపకుండానే సంస్కరణల ద్వారా లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జీరో దందాపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ‘పన్నులు చెల్లించండి- దర్జాగా వ్యాపారం చేసుకోండి’ అనే నినాదాన్ని వ్యాపార వర్గాల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. కొత్తగా వ్యాట్, టీవోటీ డీలర్ల రిజిస్ట్రేషన్‌కు మేళాలు నిర్వహించామని తెలిపారు. పన్ను ఎగవేత సమాచారం ఇచ్చిన వారికి పారితోషికం ఇచ్చేందుకు రూ.10లక్షల నిధి (సీక్రెట్ సర్వీస్ ఫండ్)ని సమకూర్చామని వెల్లడించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమం కింద చట్టాలలో కొన్ని సవరణలు చేసి వ్యాపార వర్గాలకు పన్ను సేవలను సులభతరం చేశామని వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని పటిష్టం చేసి రూ.115 కోట్ల మేర పన్ను నోటీసులు జారీ చేశామన్నారు.
తనిఖీలు చేపడుతున్నాం..
రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేసే ‘మహా చెక్’ కార్యక్రమాన్ని చేపట్టి రూ.9.70 కోట్లు ఆదాయాన్ని సమకూర్చామని తలసాని తెలిపారు. పన్ను ఎగవేత కు ఆస్కారమున్న ఐరన్, స్టీల్, ప్లైవుడ్, టైల్స్, బియ్యం, నిత్యావసర వస్తువులను గుర్తించి లీకేజీని అరికట్టే చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 14 చెక్‌పోస్టులను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఏర్పాటు ద్వారా అక్రమ సరుకు రవాణాను పూర్తిగా అరికట్టే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.12 కోట్లు విడుదల చేశామని, ఆధునీకరణ ద్వారా భారీ ఆదాయాన్ని సమీకరిస్తామని తెలిపారు.