వాణిజ్య రాబడి భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకు నిధులు సమకూర్చేందుకు వాణిజ్యపన్నుల శాఖ కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ శాఖ 2015-16 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో లక్ష్యానికి అనుగుణంగానే రాబడి సాధించింది. ఈ కాలంలో రూ.7,406 కోట్ల ఆదాయం సాధించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏ నెలలోనూ రూ. 2,400 కోట్లకు తగ్గకుండా ఆదాయం సమకూరింది. జూన్‌లో రూ. 2,577 కోట్లు సాధించి, కొత్త రికార్డు సాధించింది. ఈ నెలలో అంచనా మొత్తానికన్నా రూ. 177 కోట్లు అధికంగా వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.36 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, దీన్ని సాధించేందుకు ఆ శాఖ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. రూ.కోటికి పైగా బకాయిపడి కోర్టుల్లో ఉన్న వందలాది కేసులను పరిష్కరించేందుకు పేరున్న అడ్వొకేట్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే పన్ను చెల్లించకుండా జీరో దందాలు సాగించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే వారి ఆస్తుల అటాచ్‌మెంట్‌కూ వెనకాడవద్దని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందిన కమిషనర్ వి.అనిల్‌కుమార్ కిందిస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కాగా, ఈ శాఖ 2014-15లో రూ. 27,777 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, రూ.23,727.15 కోట్లు సాధించింది.
పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి
వ్యాట్ ద్వారా మద్యం, పెట్రోల్, డీజిల్, సిగరెట్ల మీద వచ్చే పన్నుపైనే ప్రధానంగా ఆధారపడుతున్న వాణిజ్యపన్నుల శాఖ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఉద్యోగ విభజన పూర్తయితే సిబ్బంది కొరతను పూడ్చుకొని కొత్త నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. ఈలోపు క్లరికల్ పోస్టుల కోసం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకునే ప్రయత్నాల్లో ఉంది. సీటీవో, డీసీటీవో స్థాయిలో యంత్రాంగాన్ని పరిపుష్టం చేయడం ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను రాబట్టాలని చూస్తోంది. సీఎస్‌టీ, వినోద పన్ను, విలాసపన్ను, గుర్రపు పందాల బెట్టింగ్ పన్నులను క్రమబద్ధీకరించి, పూర్తిస్థాయిలో పన్ను వసూలయ్యేలా కృషి చేయాలని భావిస్తున్నారు.