
అక్రమార్కులకు పండుగే..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : దీపావళి పండుగ.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం దేవుడెరుగు.. ఈ దీపావళి పటాకులు మాత్రం అధికారుల జేబులు నింపుతున్నాయి. యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ వ్యాపారంతో సర్కారు ఆ దాయానికి వ్యాట్ రూపంలో రూ.కోట్లలో గండి పడుతుండటం ఒకెత్తయితే.. అక్రమ నిల్వలతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. దీపావళి పండుగ అంటేనే పటాకలకు ఎంతో ప్రాధాన్యం. పేద, ధనిక తారతమ్యం లేకుండా ఈ పండుగను ఆనందంగా జరుపుకోవడం సంప్రదాయం.
అయితే జిల్లాలో బాంబుల వ్యాపారం జోరోగా కొనసాగుతోంది. వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లు ఇచ్చి కొందరు బడా వ్యాపారులు రూ.లక్షల్లో వ్యాట్‌ను ఎగవేస్తున్నారు. పండుగ సీజన్‌లో జిల్లాలో సుమారు రూ.ఐదు కోట్ల వరకు ఈ వ్యాపారం జరుగుతుందని అంచనా. అధికారికంగానే సుమారు 500 వరకు క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు మంజూరవుతుండగా, అనధికారికంగా మరో 500 వరకు రిటైల్ షాపులు వివిధ పట్టణాల్లో వెలుస్తాయి. ఒక్కో షాపులో సగటున కనీసం రూ.80 వేల వ్యాపారం జరుగుతుంది. ఈ లెక్కన రూ.ఎనిమిది నుంచి రూ.పది కోట్ల వరకు బాంబుల టర్నోవర్ అవుతోంది.
పటాకలపై 14.5 శాతం వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.1.40 కోట్లు వ్యాట్ రూపంలో జమ కావాల్సి ఉంటుంది. కానీ.. వ్యాట్ పన్ను రాబడి రూ.25 లక్షలకు మించడం లేదు. గతేడాది అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఈ పటాకలపై కేవలం రూ.22 లక్షలు మాత్రమే వ్యాట్ ఆదాయం వచ్చిందంటే ఏ మేరకు జీరో దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంటే.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం తమ అక్రమ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ శాఖలో రిజిస్ట్రేషన్ అయిన డీలర్లు జిల్లాలో సుమారు 20 మంది వరకు ఉంటారు. శివకాశి, తమళనాడు, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తుంటారు. ఈ డీలర్లు తీరా దీపావళి అయిపోయాక, సరుకంతా విక్రయించుకున్నాక రిటర్న్ (అమ్మకం వివరాలు) దాఖలు చేస్తారు. డీలర్లు కట్టిందే పన్ను.. వచ్చిందే ఆదాయం అనుకుని అధికారులు రిటర్న్ ఎంత అమ్మినట్లు పేర్కొంటే అంతే మొత్తంలో పన్ను వసూలు చేసుకుంటారు. పండగకు ముందు ఈ శాఖ అధికారులు ఒక్క డీలరు గోదాములపై ఆకస్మిక దాడులు చేసి, స్టాకు వివరాలు తీసుకున్న దాఖలాల్లేవంటే వ్యాపారులతో వాణిజ్య పన్నుల అధికారులకు ఉన్న ‘సన్నిహిత’ సంబంధాలను అర్థం చేసుకోవచ్చు.
ఆ మూడు శాఖల్లో కూడా..
బాంబుల విక్రయాల కోసం రెవెన్యూ శాఖ జారీ చేస్తున్న క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు ఆ మూడు శాఖల అధికారులకు కూడా కాసుల వర్షం కురుస్తోంది. క్యాజువల్ ట్రేడ్ లెసైన్సు మంజూరు కావాలంటే అగ్నిమాపక, మున్సిపల్, పోలీసు శాఖల నుంచి ఎన్‌వోసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్లు) తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు శాఖల నుంచి ఎన్‌వోసీ వస్తేనే రెవెన్యూ అధికారులు ఈ లెసైన్సులు జారీ చేస్తున్నారు. ఈ ఎన్‌వోసీలు ఆయా శాఖల అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎన్‌వోసీ కోసం రూ.500 చొప్పున చాలాన్ రూపంలో ఆయా శాఖలకు చెల్లించాల్సి ఉంటుంది.
అంటే ఈ లెసైన్స్ మంజూరుకు నిబంధనల ప్రకారం రూ.రెండు వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ.. మరో రూ.12 నుంచి రూ.15 వేల వరకు అధికారులకు సమర్పించుకోనిదే ఎన్‌వోసీ మంజూరు కాదనేది బహిరంగ రహస్యం. ఒక్కో శాఖకు ఒక్కో రేటు.. ఒక్క ఎన్‌వోసీ కోసం మున్సిపల్ అధికారులకు అదనంగా రూ.రెండు నుంచి రూ.మూడు వేల చొప్పున ముట్టజెప్పాల్సిందే. పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి ఇంకా ఎక్కువే. ఒక్కో ఎన్‌వోసీ ఈ శాఖల అధికారులు రూ.ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగ రహస్యంగా తయారైంది. ఇక లెసైన్స్ మంజూరు చేసే రెవెన్యూ శాఖలో కూడా చేయి తడపనిదే పని జరగడం లేదు.
మొత్తం మీదా ఒక్క క్యాజువల్ ట్రేడ్ లెసైన్స్ మంజూరు కావాలంటే కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధికారుల చేతులు తడపాల్సి వస్తోంది. ఇదంతా ఏటా జరుగుతున్న తంతే. ఈ లెసైన్సుల జారీకి కొందరు వ్యాపారులు దళారులుగా అవతారమెత్తారు. ఈ లెసైన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వద్ద ఈ దళారులు వసూలు చేసి ఏక మొత్తంగా సంబంధిత అధికారులకు ముట్టజెప్పడం పరిపాటిగా తయారైంది. ఈ మామూళ్ల దందా ఒకెత్తయితే.. పటాకలకు సంబంధించిన గిఫ్ట్ ప్యాక్‌లు అదనం. ఏరియా కౌన్సిలర్లు, చోటామొటా నాయకుల నుంచి మొదలు.. ఫైర్ మెన్‌లు, కానిస్టేబుళ్లు, ఆయా కార్యాలయాల సిబ్బందికి ఈ గిఫ్ట్ ప్యాక్‌లు ముట్టజెప్పాల్సిందే.