ఏసీబీ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలు (ఇన్‌సెట్‌లో) ఏడుకొండలు
సాక్షి, విజయవాడ: వాణిజ్యపన్నుల శాఖలో భారీ తిమింగలం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు చిక్కింది. ఈడ్పుగల్లులోని ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (స్టేట్ ట్యాక్స్) ఏడుకొండలును ఆయన కార్యాలయంలోనే ఐటీడీ సిమెంటేషన్స్ ప్రతినిధుల వద్ద లంచం తీసుకుంటుండగా శుక్రవారం అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ.27 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కటంతో వాణిజ్యపన్నుల శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఉన్నతస్థాయి అధికారి చిక్కడం ఇదే ప్రథమమని చర్చించుకుంటున్నారు.
గతంలో డెప్యూటీ కమిషనర్‌గా..
2004–05లో విజయవాడ ఒకటో డివిజన్ డెప్యూటీ కమిషనర్‌గా ఏడుకొండలు పనిచేశారు. అంతకుముందు ఇక్కడే అసిస్టెంట్ కమిషనర్ (ఇంటెలిజెన్స్)లో పనిచేశారు. అప్పట్లోనే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. నిజామాబాద్‌లో డెప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడ జరిగిన భారీ కుంభకోణంలో ఏడుకొండలు హస్తం ఉందని ప్రచారం జరిగింది. అప్పుడే ఆయన కారు బహుమతిగా పొందినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. జాయింట్ కమిషనర్‌గా వెళ్లినా ఆయన పద్ధతులు మార్చకోలేదు. వాణిజ్యపన్నుల ఖలో పనిచేసే ఇతర అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే ఏసీబీ అధికారులు దాడులు చేసి ఏడుకొండలును అరెస్ట్ చేశారు.
రిఫండ్స్ ఇవ్వాలంటే లంచాలు ముట్టజెప్పాల్సిందే..
కమిషనర్ కార్యాలయంలో రిఫండ్ ఫైల్ వచ్చిందంటే అధికారులకు పండగేనన్న ఆరోపణలు ఉన్నాయి. డీలర్లకు కోట్లలో రిఫండ్ ఇవ్వాల్సి రావడంతో లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్నారు. కార్యాలయంలోని ముఖ్య అధికారులందరికీ ఇందులో వాటాలు ఉంటాయి. ఐటీడీ సిమెంటేషన్స్ రూ.4.6 కోట్ల వరకూ చెల్లించాల్సి రావడంతో ఏడుకొండలు రూ.23.2 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఈ సొమ్ము ఇవ్వడానికి ఆ సంస్థ ప్రతినిధులు సిద్ధపడ్డారు. అయితే, ఆ శాఖలోని అధికారుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఏసీబీకి సమాచారం అందినట్లు తెలిసింది. కాగా, రూ.10 లక్షలలోపు రిఫండ్స్ డెప్యూటీ కమిషనర్, ఆపైన కమిషనర్ కార్యాలయానికి వెళ్తాయి. అయితే, పెద్ద మొత్తాల కేసులు కూడా సీటీవో స్థాయిలో పరిశీలించాకే ఉన్నతాధికారులకు పంపుతారు. దీంతో అందరినీ చేతులు తడపాలంటే కష్టంగానే ఉందని డీలర్లు వాపోతున్నారు.
అంతాఅవినీతి
వాణిజ్య సంస్థలపై సీటీవో స్థాయి అధికారులు దాడులు చేసి జరిమానాలు వేసినప్పుడు డీలర్లు సంతృప్తి చెందకపోతే డెప్యూటీ కమిషనర్ అపెలెంట్స్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. అక్కడ అపెలెంట్ డెప్యూటీ కమిషనర్ జరిమానా వేసిన కేసులను కూడా కమిషనర్ కార్యాలయం అధికారులు తిరగదోడి చిన్నచిన్న తప్పుల్ని చూపించి భారీగా లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ శాఖలో ఉన్నతాధికారుల అవినీతి గురించి కథలుకథలుగా చెబుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖలోని ఒక ముఖ్య అధికారి విజయవాడలో సుమారు రూ.3.5 కోట్ల విలువైన ఇంటిని బినామీతో రూ.90లక్షలకు కొనిపించారు. ఆ ఇంట్లో తానే అద్దెకు ఉంటూ ఆ ఇంటిని కొనేందుకు ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకుని, రూ.కోటి బ్యాంకు రుణం తీసుకున్నారు. దీనికి మరో కోటి వెచ్చించి మరమ్మతులు చేయించారు. అధికారులే అవినీతిపరులు కావడంతో కిందిస్థాయి అధికారులు చేసే అవినీతిని పట్టించుకోలేకపోతున్నారని వాణిజ్యపన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment