అదనపు కమిషనర్ ఏడుకొండలు
సాక్షి, అమరావతి/కంకిపాడు(పెనమలూరు): వాణిజ్య పన్నుల శాఖలో అతి పెద్ద అవినీతి చేప అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కింది. వాణిజ్య పన్నుల శాఖ(స్టేట్ ట్యాక్స్) అదనపు కమిషనర్ యు.ఏడుకొండలు రూ.25 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం వల పన్ని పట్టుకున్నారు. ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి దొరకడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే ప్రథమం.
ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణరంగ కంపెనీ ఐటీడీ సిమెంటేషన్స్ నుంచి శుక్రవారం విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లులో ఉన్న వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కార్యాలయంలో రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏడుకొండలును పట్టుకున్నట్టు తెలిపారు. గన్నవరం, విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నిర్మాణాలకు సంబంధించి రూ.4.6 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ రిఫండ్ చెల్లింపులకోసం లంచం తీసుకుంటున్నట్లు వాణిజ్య పన్నులశాఖ వచ్చిన పక్కా సమాచారంతో ఈ అవినీతి అధికారిని పట్టుకున్నట్లు వివరించారు.
కేసు దర్యాప్తు చేస్తున్నాం: ఏసీబీ డీజీ
రిఫండ్ చెల్లింపులకోసం రూ.25 లక్షల లంచమివ్వడానికి హైదరాబాద్ నుంచి ఐటీడీ సిమెంటేషన్స్ కంపెనీ ప్రతినిధులు వస్తున్నట్లు సమాచారమందిందని, కానీ తమ దాడిలో రూ.23.3 లక్షల సొమ్ము మాత్రమే దొరికిందని ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. మిగిలిన సొమ్ము ఎక్కడ ఉన్నదన్నది తనిఖీ చేస్తున్నామన్నారు. మిగిలిన సొమ్ము ఏమైంది? ఎవరెవరి హస్తముంది? అక్రమార్జన వ్యవహారాలపై తదుపరి దర్యాప్తు సాగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment