నష్టం.. 3,500 కోట్ల పైమాటే!
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు అంతర్రాష్ట్ర వాణిజ్యంపై పెద్ద ప్రభావమే చూపుతోంది.
జీఎస్టీ అమలయ్యాక తగ్గిన అంతర్రాష్ట్ర వాణిజ్యం
- మన ఉత్పత్తులు కొనేందుకు వెనుకాడుతున్న ఇతర రాష్ట్రాలు
- డీలర్ల రిజిస్ట్రేషన్లలో జాప్యమే కారణం
- 60 శాతం మంది డీలర్లకే ప్రొవిజనల్ నెంబర్లు
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు అంతర్రాష్ట్ర వాణిజ్యంపై పెద్ద ప్రభావమే చూపుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఉత్పత్తి అయ్యి ఇతర రాష్ట్రాల్లో కొనుగోళ్లు చేసే వస్తువుల మార్కెటింగ్ చాలా కష్టంగా మారింది. దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా రంగంలో జీఎస్టీ అమలు కారణంగా 22 శాతం తగ్గుదల నమోదు కాగా, అది రాష్ట్రంలో 30 శాతానికి పైగానే ఉంటుందని అంచనా. దీంతో జీఎస్టీ అమలయి నెల రోజులైనా కాకముందే అంతర్రాష్ట్ర వాణిజ్యంలో రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏటా రూ.3వేల కోట్లకు పైగా పన్ను...
వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు ఏటా అంతర్రాష్ట్ర వాణిజ్య కార్యకలాపాల ద్వారా రూ.3వేల కోట్ల వరకు పన్ను రూపంలో ఆదాయం వచ్చేది. వ్యాపారంలో 2% చొప్పున వ్యాట్ కట్టాల్సి ఉన్నందున రూ.3వేల కోట్ల పన్ను, అంటే దాదాపు ఏటా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగేవి. ఒక్క జూలైలో రోడ్డు రవాణా రంగంలో నమోదయిన తగ్గుదల మేరకు 30శాతం వ్యాపారం జరగకపోవడంవల్ల రూ.3,500 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయని, ఈ మేరకు జీఎస్టీ వల్ల నష్టం వాటిల్లినట్టేనని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన వాణిజ్య పన్నుల శాఖకు రావాల్సి న పన్ను వందల కోట్లలో తగ్గిపోనుందని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కారణమేంటి..?
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఏ వ్యాపార లావాదేవీ అయినా జీఎస్‌టిన్ నంబర్ ద్వారానే జరగాలి. ఈ క్రమంలో వ్యాట్ నుంచి దాదాపు 2 లక్షల మంది జీఎస్టీలోకి వచ్చారు. వీరంతా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు కానీ, 60 శాతం మందికే ఇప్పటి వరకు ప్రొవిజనల్ నెంబర్లు వచ్చాయి. కానీ, జీఎస్టీ చట్టం ప్రకారం కావాల్సిన టిన్ నంబర్లు (పన్ను గుర్తింపు సంఖ్య) రాలేదు. దీంతో సదరు వ్యాపారులు తీసుకెళ్లిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు నిరాకరిస్తున్నారు.
టిన్ నెంబర్ లేకుండా ఆ వస్తువు కొన్నా, ప్రొవిజనల్ నంబర్ యథావిధిగా టిన్ నంబర్‌గా మారకపోయినా ఆ లావాదేవీ చట్ట ఉల్లంఘన అవుతుందనే అక్కడి వ్యాపారులు వాటిని కొనేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా సరఫరా అయ్యే ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ప్లాస్టిక్, ఫర్నిచర్, పేపర్, ఐరన్ పరిశ్రమలపై ప్రభావం చూపుతోంది. జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ల కోసం రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌పై ఉన్న ఒత్తిడి, రిజిస్ట్రేషన్ల సమయంలో డీలర్లు చేసే పొరపాట్ల కారణంగా రిజిస్ట్రేషన్లు కావడం లేదని వాణిజ్య పన్నుల శాఖ అంటోంది. మరో 15 రోజుల్లో అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.