► అక్రమంగా విక్రయిస్తున్న రూ.5 కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత
► రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 32 బృందాలతో దాడులు
సాక్షి, హైదరాబాద్: విదేశీ సిగరెట్‌కు సెగ తగిలింది. అక్రమ వ్యాపారులకు వాణిజ్యపన్నుల శాఖ పొగ పెట్టింది. విదేశీ చౌకధర సిగరెట్ల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. వాణిజ్యపన్నుల శాఖకు చెందిన 32 బృందాలు బుధవారంరాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేశాయి. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సిగరెట్ అక్రమ రవాణా ఏజెంట్ల గోడౌన్లు, ఇతర అడ్డాలపై దాడులు చేసి రూ. 5 కోట్ల విలువైన సిగరెట్ కార్టన్లను సీజ్ చేశాయి.
బ్లాక్, మోండ్, ఎస్సె, డన్‌హిల్, కేమల్, ఎల్.ఎమ్ బ్రాండ్లతో గల విదేశీ ప్రీమియం సిగరెట్లతోపాటు పారిస్, విన్, ఇంపాక్ట్, ఎలవెన్ 10, రూలి రివర్, రిచ్‌మ్యాన్, వేణుస్ తదితర బ్రాండ్లతో గల లోకల్ సిగరెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సీజ్ చేసిన అక్రమ విదేశీ సిగరె ట్ కార్టన్లకు సంబంధించి కోటి రూపాయల వరకు పన్నురూపంలో వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేయనుంది.
సిగరెట్టు కంపెనీల ఫిర్యాదుతో...
మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి విదేశాల్లో తయారైన ప్రీమియం, ఆర్డినరీ సిగరెట్లతోపాటు కోల్‌కతా, ముంబై, బంగ్లాదేశ్, ఇండోనేషియాల్లో తయారైన లోకల్ ఆర్డినరీ సిగరెట్లు కొన్నేళ్లుగా దేశీయ మార్కెట్‌ను ముంచెత్తాయి. ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ, సేల్స్ టాక్స్ లేకుండా నేరుగా మార్కెట్‌లోకి వస్తున్న ఈ సిగరెట్ల ధర కూడా చాలా తక్కువ. సిగరెట్టు డబ్బాలపై చట్టపరమైన హెచ్చరిక ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే అక్షరాలు గాని, క్యాన్సర్‌కు సంబంధించిన ఫొటోలుగానీ లేకుండా మార్కెట్‌లోకి వచ్చేశాయి.
కొత్తగా సిగరెట్టును అలవాటు చే సుకునే యువత, తక్కువ ధరకు సిగరెట్లు వస్తుండడంతో బీడీ, సిగరెట్టుకు అలవాటు పడ్డవారు ఈ విదేశీ సిగరెట్లను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిగరెట్ తయారీ కంపెనీలైన ఐటీసీ, వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ వాణిజ్యపన్నుల శాఖకు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు కమిషనర్ రేవతి రోహిణిల నేతృత్వంలో దాడులు జరిగాయి. హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ప్రధాన డీలర్‌తోపాటు పలువురిని గుర్తించారు. వాణిజ్యపన్నుల శాఖకు రావలసిన పన్ను వసూలు నోటీసులు జారీ చేశారు.
విదేశీ సిగరెట్టు.. గుట్టురట్టు
Published Fri, Jun 10 2016 2:18 AM | Last Updated on Thu, Oct 4 2018 5:38 PM
Advertisement