Illegal traders
-
అప్పుడే నల్ల బజారుకి
సాక్షి, హైదరాబాద్: ‘జిల్లా ఆఫీసర్లకే ఒక్కొక్కలకి లక్ష దాకా ఇస్తం. బియ్యం పట్టుకోకుండ, రాష్ట్రం దాటిచ్చెటందుకు గీ ఆఖరి పోలీస్టేషన్‌కే నెలకు లక్ష ఇస్తం. తాసీల్దార్లు, డీటీలు అందరికి ఎవలయి వాళ్లకు పోతయి. బియ్యం బయటకు పోకుండ ఆపితే మాకంటే వాళ్లకే ఎక్కువ లాస్. గందుకె మా దందా ఆగది’ సిరోంచలో బియ్యం దందా చేసే ఓ వ్యక్తి బాహాటంగా చెపుతున్న మాటలివి. రాష్ట్రంలో పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం లబ్ధిదారులు, రేషన్ డీలర్ల ద్వారా ఈ నెల కూడా యధేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. పీడీఎస్ బియ్యం పంపిణీ ఈ నెల 4వ తేదీ నుంచి మొదలు కాగా , ఎప్పటి మాదిరిగానే గత మూడు రోజుల నుంచి బియ్యం నల్లబజారుకు తరలిపోవడం మొదలైందని విశ్వసనీయ సమాచారం. చిన్న చిన్న సరకు రవాణా వాహనాలను పోలీసులు పట్టుకున్నట్లు షో చేస్తుండగా, టన్నుల కొద్దీ బియ్యాన్ని గోడౌన్లకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుంచి రాత్రి వేళల్లో లారీలు, ట్రక్కుల్లో దాచి ఉంచిన బియ్యాన్ని మహారాష్ట్ర, కర్నాటకకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. బియ్యం రవాణా విషయంలో పౌరసరఫరాల శాఖ డీఎస్వోలు, డీఎంలు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఈ శాఖల అధికారులకు అక్రమ రవాణా దారుల నుంచి వచ్చే మామూళ్లే అందుకు కారణమని అంటున్నారు. సర్కారు ఆదేశించినా అదే తీరు...: రాష్ట్రంలో పేదల బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై ‘సాక్షి’లో గతనెల 30, ఈనెల 1వ తేదీల్లో ప్రచురితమైన వార్త కథనాలపై పౌరసరఫరాల శాఖ స్పందించింది. ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు కమిషనర్ వి.అనిల్‌కుమార్ జిల్లాల డీఎస్ఓలు, డీఎంలతో పాటు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. 4వ తేదీ నుంచి మొదలయ్యే బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని, రేషన్ షాపులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. అయితే కొన్ని చోట్ల మినహా ఏ జిల్లాలో కూడా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ సిబ్బంది పూర్తిస్థాయిలో బియ్యం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి పెట్టలేదు. రేషన్ దుకాణాలను సందర్శించి, స్టాక్‌ను తనిఖీ చేసిన, చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో రేషన్ దుకాణాల నుంచి యధేచ్ఛగా బియ్యం గోడౌన్లకు తరలిపోతున్నట్లు సమాచారం. సోమవారం నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల మీదుగా పక్క రాష్ట్రాలకు బియ్యాన్ని పంపించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. కాగా దుకాణాలకు రేషన్ చేరిన వారం రోజుల్లోగా ..రేషన్ దందా చేసే వాళ్ళు ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రెండుసార్లు బియ్యం అక్రమ రవాణాకు స్కెచ్ వేస్తున్నట్లు మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ‘సాక్షి’కి తెలిపారు. తూతూ మంత్రంగా దాడులు... తాజాగా మరికల్ మక్తల్ మీదుగా కర్ణాటకకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే అమరచింతకు చెందిన ఓ వ్యక్తికి చెందిన బియ్యం లారీ, బొలెరో వాహనాన్ని మహబూబ్‌నగర్, నారాయణపేటల్లో స్థానికులు పోలీసులకు పట్టించి ఇచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్‌లో అక్రమ రవాణా అవుతున్న రూ. 86వేల విలువైన 43 క్వింటాళ్ల బియ్యాన్ని అదుపులోకి తీసుకొని పౌరసరఫరాల శాఖ డీటీకి అప్పగించారు. అయితే ఈ ఘటనల్లో అసలు దందా చేసే వ్యక్తులను మాత్రం పోలీసులు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
Chirala: చీరాలలో బంగారం నల్ల వ్యాపారం
ప్రకాశం జిల్లా చీరాల కేంద్రంగా గోల్డ్ బిస్కెట్ల అక్రమ వ్యాపారం మాయా బజారును తలపించే రీతిలో జోరుగా సాగుతోంది. సౌదీలోని ఖతర్ నుంచి వాయు, జలమార్గాల ద్వారా కస్టమ్స్ కళ్లుగప్పి దేశానికి బంగారం వస్తోంది. అక్రమార్కుల ద్వారా దర్జాగా చీరాల చేరుతోంది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో ఈ చీకటి వ్యాపారం ఊపందుకుంది. తక్కువ ధరకే వస్తుండడం వ్యాపారులకు లాభసాటిగా మారింది. సుంకాలు ఎగ్గొట్టడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరో వైపు తక్కువకే బంగారం ఇస్తామనే కేటుగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. చీరాల: వస్త్ర వ్యాపారానికి పేరుగాంచిన చీరాలకు మినీ ముంబయిగా పేరుంది. తాజాగా బంగారం జీరో దందా వ్యాపారం విస్తరిస్తోంది. కొందరు సుంకాలు ఎగ్గొట్టి తక్కువ ధరకు బంగారాన్ని వర్తకులకు విక్రయిస్తుంటే.. మరి కొందరు ఈ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యాపారాన్ని కొందరు ఏజెంట్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు సమాచారం. బంగారం తీసుకురావాలంటే కస్టమ్స్, జీఎస్టీ పన్నులు 17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అవి చెల్లించకుండా ఎంతో కొంత ముట్టచెప్పి తీసుకొస్తున్నామని, అందువల్లే చౌకగా బంగారం దొరుకుతుందని వ్యాపారాన్ని సాగిస్తున్నారు. సౌదీ నుంచే స్మగ్లింగ్ బంగారు గనులు విస్తారంగా ఉన్న సౌదీలోని ఖతర్ నుంచి స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ నుంచి సింగపూర్, అక్కడి నుంచి విశాఖపట్నం, చెన్నైకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. అలా తెచ్చిన బంగారాన్ని ఏజెంట్ల ద్వారా చీరాల, తెనాలి, నెల్లూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి లెక్కా పత్రాలు లేకుండా తక్కువ ధరకు లభిస్తుండడంతో వ్యాపారులు కూడా మొగ్గు చూపుతున్నారు. చీరాల ప్రాంతంలో ఎక్కువగా వస్త్ర వ్యాపారంతో పాటు బంగారం వ్యాపారం సాగుతోంది. ఇక్కడ బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఆభరణాల తయారీ కూడా జరుగుతోంది. ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి జీఎస్టీ బిల్లు కాకుండా ఎస్టిమేషన్ బిల్లులే ఇవ్వడం విశేషం. అందుకే అక్రమార్కులు చీరాల ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 17 శాతం పన్నుల్లో సుమారు 5 నుంచి 7 శాతం తక్కువ ధరకే బిస్కెట్లు దొరకడంతో చీరాల, తెనాలిలోని బంగారం వ్యాపారులతో పాటు అనధికారికంగా కొందరు వ్యక్తులు కొనుగోలు చేసి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. చీరాలలో 75 వరకు, తెనాలి ప్రాంతంలో 200కుపైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. కస్టమ్స్‌లో ఉద్యోగమని.. చీరాలకు చెందిన పి.రవితేజ బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం వ్యాపారం చేయాలనే ఆలోచనతో 2017 నుంచి చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2020లో తెనాలిలో బులియన్ మార్కెట్లో మదన్ అనే బంగారం వ్యాపారితో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా చీరాలలోని పలు బంగారం దుకాణాలతో పాటు కొందరు వ్యక్తులకు మార్కెట్ ధర కంటే 5 నుంచి 10 శాతం తక్కువకు ఇవ్వడం మొదలు పెట్టాడు. చీరాల చుట్టు పక్కల బంగారు వ్యాపారులతో పాటు తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసే మరి కొందరిని ఆకర్షించాడు. చాలా కాలంగా తాను కస్టమ్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు. కస్టమ్స్ డ్యూటీతో పాటు జీఎస్టీ లేకుండా బంగారం తెచ్చి అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు. కొంత కాలం ఈ వ్యాపారం సజావుగా సాగింది. ఈ మార్గంలో అయితే భారీగా సంపాదించలేననుకున్నాడో ఏమోగానీ, 700 బిస్కెట్లకు (ఒక్కో బిస్కెట్ 100 గ్రా.) అడ్వాన్సుగా పలువురు వర్తకుల వద్ద డబ్బు తీసుకున్నాడు. చివరికి వారికి బంగారం ఇవ్వకపోగా ఇచ్చిన అడ్వాన్సును స్వాహా చేశాడు. మోసపోయామని గ్రహించిన వ్యాపారులు, ఇతర వ్యక్తులు చీరాల వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు వ్యాపారుల వద్ద నుంచి రూ.3.50 కోట్లకుపైగా నగదు తీసుకుని అతని జల్సాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. అయితే అందులో బయటపడని వ్యాపారులు చాలా మంది ఉన్నట్లు సమాచారం. తమ అక్రమ వ్యాపారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే వారంతా మౌనం దాల్చారు. మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. బంగారం వ్యవహారంపై దృష్టి సారిస్తున్నాం తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పే కేటుగాళ్లపై దృష్టి సారించాం. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్నాం. ఇప్పటికే ఒక ఏజెంట్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద రూ.24 లక్షల నగదు, కొంత బంగారం రికవరీ చేశాం. బంగారం వ్యాపారులు కూడా కేటుగాళ్ల మాయమాటలు వినిమోసపోవద్దు. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేయాలి. లేకుంటే చర్యలు తప్పవు. – పి.శ్రీకాంత్, డీఎస్పీ, చీరాల మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. -
బరి తెగించిన ఇసుక అక్రమ వ్యాపారులు
మరికల్ (నారాయణపేట): మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం పూసల్‌పహాడ్ సమీప కోయిల్‌సాగర్ వాగు వద్ద ఇసుక అక్రమ వ్యాపారులు బుధవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న పాపానికి వీఆర్వో మైబన్నపై దాడికి దిగారు. పూసల్‌పహాడ్‌కు చెందిన కొందరు అక్రమ ఇసుక వ్యాపారులు బుధవారం రాత్రి కోయిల్‌సాగర్ వాగులో నుంచి ఇసుక తరలిస్తున్నారు. గుర్తించిన గ్రామ సేవకులు వీఆర్వో మైబన్నకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వచ్చి.. గ్రామ సేవకుల సహాయంతో ట్రాక్టర్లను సీజ్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆయనపై దాడికి దిగుతూ పక్కకు నెట్టేశారు. వెంటనే ట్రాక్టర్లో ఉన్న ఇసుకను అన్లోడ్ చేస్తూ పరారయ్యారు. ఈ సమయంలో తమ ట్రాక్టర్ల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించినట్లు వీఆర్వో, గ్రామసేవకులు తెలిపారు. -
విదేశీ సిగరెట్టు.. గుట్టురట్టు
► అక్రమంగా విక్రయిస్తున్న రూ.5 కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత ► రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 32 బృందాలతో దాడులు సాక్షి, హైదరాబాద్: విదేశీ సిగరెట్‌కు సెగ తగిలింది. అక్రమ వ్యాపారులకు వాణిజ్యపన్నుల శాఖ పొగ పెట్టింది. విదేశీ చౌకధర సిగరెట్ల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. వాణిజ్యపన్నుల శాఖకు చెందిన 32 బృందాలు బుధవారంరాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేశాయి. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సిగరెట్ అక్రమ రవాణా ఏజెంట్ల గోడౌన్లు, ఇతర అడ్డాలపై దాడులు చేసి రూ. 5 కోట్ల విలువైన సిగరెట్ కార్టన్లను సీజ్ చేశాయి. బ్లాక్, మోండ్, ఎస్సె, డన్హిల్, కేమల్, ఎల్.ఎమ్ బ్రాండ్లతో గల విదేశీ ప్రీమియం సిగరెట్లతోపాటు పారిస్, విన్, ఇంపాక్ట్, ఎలవెన్ 10, రూలి రివర్, రిచ్‌మ్యాన్, వేణుస్ తదితర బ్రాండ్లతో గల లోకల్ సిగరెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సీజ్ చేసిన అక్రమ విదేశీ సిగరె ట్ కార్టన్లకు సంబంధించి కోటి రూపాయల వరకు పన్నురూపంలో వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేయనుంది. సిగరెట్టు కంపెనీల ఫిర్యాదుతో... మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి విదేశాల్లో తయారైన ప్రీమియం, ఆర్డినరీ సిగరెట్లతోపాటు కోల్‌కతా, ముంబై, బంగ్లాదేశ్, ఇండోనేషియాల్లో తయారైన లోకల్ ఆర్డినరీ సిగరెట్లు కొన్నేళ్లుగా దేశీయ మార్కెట్‌ను ముంచెత్తాయి. ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ, సేల్స్ టాక్స్ లేకుండా నేరుగా మార్కెట్లోకి వస్తున్న ఈ సిగరెట్ల ధర కూడా చాలా తక్కువ. సిగరెట్టు డబ్బాలపై చట్టపరమైన హెచ్చరిక ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే అక్షరాలు గాని, క్యాన్సర్‌కు సంబంధించిన ఫొటోలుగానీ లేకుండా మార్కెట్లోకి వచ్చేశాయి. కొత్తగా సిగరెట్టును అలవాటు చే సుకునే యువత, తక్కువ ధరకు సిగరెట్లు వస్తుండడంతో బీడీ, సిగరెట్టుకు అలవాటు పడ్డవారు ఈ విదేశీ సిగరెట్లను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిగరెట్ తయారీ కంపెనీలైన ఐటీసీ, వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ వాణిజ్యపన్నుల శాఖకు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ రేవతి రోహిణిల నేతృత్వంలో దాడులు జరిగాయి. హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ప్రధాన డీలర్‌తోపాటు పలువురిని గుర్తించారు. వాణిజ్యపన్నుల శాఖకు రావలసిన పన్ను వసూలు నోటీసులు జారీ చేశారు. -
ససేమిరా...
అధికార పార్టీలో గుట్కా పంచాయితీ - నెలకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రూ.250 కోట్ల వ్యాపారం - ఇటీవల రూ.50 లక్షల నిల్వలు పట్టివేత - బెజవాడ పోలీస్ కమిషనర్‌పై అధికార పార్టీ ఒత్తిళ్లు - సిండికేట్ మంచిదని సిఫార్సు చేసిన గుంటూరు మంత్రి, ఓ ఎమ్మెల్యే - రాతపూర్వకంగా కోరిన విజయవాడ నగర కమిషనర్ ? సాక్షి, విజయవాడ : విజయవాడ కేంద్రంగా నెలకు సుమారు రూ.300 కోట్ల విలువైన గుట్కా నిల్వలు కోస్తా జిల్లాలకు వెళుతున్నాయి. కర్నాటక, మహారాష్ట్రలకు ఇక్కడి నుంచే భారీగా సరఫరా అవుతున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే. గుట్కా సిండికేట్‌లో కొందరు అక్రమ వ్యాపారులు పాత్రధారులైతే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కీలక సూత్రధారులు. ఇటీవల నగరంలో భారీ గుట్కా డంప్‌ను పోలీసులు గుర్తించి సీజ్ చేసి నామమాత్రపు కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. దాని వెనుక భారీ మంత్రాంగమే నడిచింది. ఈ విషయంలో పోలీసులు ఒకవైపు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మరోవైపు నిలవటంతో వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. లింకు బయటపెట్టిన డంప్... గత నెల 26న నగరంలోని భవానీపురంలోని ఐరన్ యార్డులో భారీ గుట్కా డంప్ బయటపడింది. మహారాష్ట్ర నుంచి బళ్లారి వెళుతున్న లారీ ఐరన్ యార్డులో ఆగింది. అక్కడ రాష్ట్రానికి చెందిన లారీలోకి లోడు మార్చి బళ్లారికి పంపటానికి సిద్ధమవుతుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు లారీల సరకు సీజ్ చేసి, దీని విలువ రూ.50 లక్షలు ఉంటుందని ప్రకటించారు. లారీ డ్రైవర్ సాల్మన్రాజుపై కేసు నమోదు చేసి దానిని పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో విషయం పోలీసుల దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్దకు చేరింది. భారీ సిండికేట్ ఆధ్వర్యంలో... నగరంలో సుమారు 10 మంది వ్యక్తులతో భారీ సిండికేట్‌గా ఏర్పడి గుట్కా వ్యాపారం సాగిస్తున్నారు. వీరందరికీ తెరవెనుక అసలు సూత్రధారిగా గుంటూరు నగరానికి చెందిన అధికార పార్టీ నేత ఉన్నాడు. సదరు నేతకు గుంటూరు శివారుల్లో పాన్‌మసాలా ప్లాంటు ఉంది. పేరుకే పాన్‌మసాలా ప్లాంటు.. అక్కడ మాత్రం తయారయ్యేది ఎంసీ బ్రాండ్ గుట్కా. గత కొన్నేళ్లుగా సదరు నేత ఈ వ్యాపారం సాగిస్తూ గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించి చివరి వరకు రేస్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో నగరంలోని సిండికేట్‌కు సదరు నేత గాడ్‌ఫాదర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో లారీలు సీజ్ కాగానే సిండికేట్ వ్యవహారాన్ని గాడ్‌ఫాదర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అధికార పార్టీ మంత్రి, స్థానిక వ్యాపారుల ద్వారా నగరంలో తరచూ వివాదాల్లో నిలిచే ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వీరిద్దరూ రంగంలోకి దిగి పోలీసులపై ఒత్తిళ్లు పెంచారు. దీంతో పోలీసులు తమ పరిధి కాదని, నగర కమిషనర్‌తో మాట్లాడాలని వారికి సూచించారు. దీంతో బాల్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కోర్టులో పడింది. మంచివాళ్లని రాసిస్తే ఓకే... మంత్రి, ఎమ్మెల్యే ఈ విషయమై సీపీపై ఒత్తిళ్లు తేవటం మొదలుపెట్టారు. అయినా స్పందన లేకపోవటంతో చివరికి వారే నేరుగా లైన్లోకి వచ్చి మన పార్టీ వాళ్లేనండీ.. చాలా మంచివాళ్లు.. తెలియక చేశారు.. ఈ ఒక్కసారికి వదిలేయండి.. మళ్లీ ఇలాంటివి జరగవంటూ కేసు లేకుండా చూడాలని కోరినట్లు సమాచారం. తొలుత సీపీ దీనిని పెద్దగా పట్టించుకోకపోవటంతో గుంటూరు జిల్లా అమాత్యుడు కొంత సీరియస్‌గా తీసుకొని విషయం తేల్చమని సీపీని కోరినట్లు సమాచారం. దీనికి సీపీ స్పందించి ‘వాళ్లు మంచివాళ్లని మీరు నాకు రాతపూర్వకంగా రాసిస్తే అలాగే చేసేద్దాం’ అని చెప్పినట్లు సమాచారం. కొసమెరుపు ఏంటంటే.. దొరికిన రెండు లారీల కేసు కంటే అసలు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. అయితే గాడ్‌ఫాదర్‌తో ఈ ప్రజాప్రతినిధులకు కొంత ఆర్థిక సంబంధాలు కూడా ఉన్న నేపథ్యంలో వారు ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశముందని సమాచారం. -
‘నల్ల’ ఉల్లిపై ఉక్కుపాదం
-
‘నల్ల’ ఉల్లిపై ఉక్కుపాదం
అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం ఉల్లిపై మంత్రి రాంవిలాస్ ఉన్నతస్థాయి సమీక్ష * జీఎస్టీ ఆమోదం పొంది ఉంటే ధరను నియంత్రించేవాళ్లమని వెల్లడి * ధరలు మరింత పెరిగే అవకాశం.. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: నల్ల బజారులో ఉల్లి అమ్మకాలపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. అక్రమంగా నిల్వచేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఉల్లిని కోయకుండానే జనం కన్నీరు పెడుతున్న నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సోమవారం ఢిల్లీలో అత్యవసరంగా వినియోగదారుల వ్యవహారాలు, వ్యవసాయ విభాగంఅధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఉల్లి నిల్వలు, ధర, ఎగుమతులు, దిగుమతులపై సమీక్షించారు. ఉల్లిధరను నియంత్రించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిఘా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడుతున్నవారిపై నిత్యావసర వస్తువుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని పాశ్వాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ప్రధానంగా ఆసియాలో అతి పెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్గావ్లో అక్రమ నిల్వలకు పాల్పడుతున్న వ్యాపారులను కఠినంగా నియంత్రించాలని మహారాష్ట్ర సర్కారును కేంద్రం ఆదేశించింది. ఒకవేళ వస్తుసేవల పన్ను చట్టం(జీఎస్టీ) బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది ఉంటే.. ఉల్లి ధరల నియంత్రణ తేలికయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరను అదుపు చేయటంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పాశ్వాన్ ఆరోపించారు. కావలసినంత నిల్వలు ఉన్నప్పటికీ ఆప్ సర్కారు బ్లాక్ మార్కెట్ వ్యాపారులను అదుపుచేయటానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దేశంలో ఉల్లి దిగుబడి కేవలం 5లక్షల టన్నులు మాత్రమే తగ్గిందని, అయితే ఈ పరిస్థితిని అదనుగా చూసుకుని వ్యాపారులు కొరత సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉల్లి ధర పెరుగుదల తాత్కాలికంగా వచ్చే న్యుమోనియా జ్వరం వంటిదేనన్నారు. 10 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవలసిందిగా ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీసీని ఆదేశించామని మంత్రి వివరించారు. ధరలు పైపైకి..: దేశంలో ఉల్లి సృష్టిస్తున్న ప్రళయం ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. పది రోజులుగా అన్ని రాష్ట్రాల్లో ప్రజల్ని కంటతడిపెట్టిస్తున్న ఉల్లి రోజు రోజుకూ మరింత అందనంత ఎత్తుకు వెళ్లిపోతోంది. హోల్‌సేల్ వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత.. దాని వల్ల మార్కెట్‌కు సరఫరా లేక.. అవసరాలు తీర్చలేని దిగుమతులు ఉల్లి ధరను కొండెక్కేలా చేశాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.80కి చేరుకున్న కిలో ఉల్లి ధర.. మరో పది శాతం పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశంలో అతి పెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లోనే ఉల్లి ధర కిలో రూ. 60కి చేరింది. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లిని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నా అవసరాలకు సరిపోవటం లేదని ముంబై వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహకార సంస్థ డెరైక్టర్ అశోక్ వలుంజ్ తెలిపారు. అఫ్ఘాన్ నుంచి రోజుకు ఆరు నుంచి 7 ట్రక్కుల్లో ఉల్లి దిగుమతి అవుతోంది. 30 టన్నుల సామర్థ్యం ఉన్న 100 నుంచి 200 ట్రక్కుల్లో దిగుమతి చేసుకోనున్న ఉల్లిని దేశమంతటా పంపిణీ చేస్తామని వివరించారు. వచ్చే నెలలో ఈజిప్ట్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోనున్నట్లు వివరించారు. అయితే, ఒక్క ముంబై మహానగరానికే వంద లారీల ఉల్లి అవసరమైన నేపథ్యంలో, ప్రస్తుతం చేసుకుంటున్న దిగుమతులు అవసరాలను తీరుస్తాయని భావించలేమని పేర్కొన్నారు. 2వేల కిలోల చోరీ దేశంలో దొంగలకు ఇప్పుడు డబ్బులక్కర లేకుండా పోయాయి.. బంగారం దొంగతనం మీదా మోజు పోయింది. ఇప్పుడు హాట్‌కేక్‌లా సొమ్ములు కురిపించే అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉందా అంటే.. అది ఉల్లిపాయే.. రోజుకోచోట దొంగలు ఉల్లిపాయల్ని దర్జాగా దోచుకుపోతున్నారు. ఆదివారం ముంబై సబర్బన్‌లోని ఓ దుకాణం నుంచి 700 కిలోల ఉల్లిని కొందరు దొంగలు దోచుకుని పోతే.. సోమవారం దేశంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన నాసిక్‌లో ఏకంగా రెండు వేల కిలోల ఉల్లిపాయల్ని దొంగలు రాత్రికి రాత్రి దొంగతనం చేశారు. నాసిక్‌లోని నందగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబాసాహెబ్ పవార్ అనే రైతు తన గోదాములో దాచుకున్న 2వేల కిలోల ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగల కోసం గాలింపు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దొడ్డిదారిన దీపావళి బాణసంచా
సాక్షి, హైదరాబాద్: అక్రమ వ్యాపారులకు దీపావళి బాణసంచా కోట్లు కురిపిస్తోంది. లెక్కా పత్రం లేని సంపాదనలో ఆదాయం పన్ను శాఖకు చిల్లిగవ్వ కూడా కట్టడంలేదు. శివకాశీ నుంచి హైదరాబాద్ వరకు ఏ చెక్పోస్టులోనూ బాణసంచాను అడ్డుకున్న దాఖలాలు లేవు. దీంతో బాణసంచా వ్యాపారంపై ఆదాయం పన్నుశాఖ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పరిమిత సంఖ్యలోనే వ్యాపారులు బాణసంచా అమ్మకాలకు లెసైన్సులు పొందినట్టు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే. రాష్ట్రవ్యాప్తంగా 1,540 మంది ఈ ఏడాది బాణసంచా కొనుగోలు చేసినట్లు శివకాశీ నుంచి అందిన వివరాలు తెలుపుతున్నాయి. వీటి విలువ రూ. 850 కోట్లు. లెసెన్సులు లేకుండా జంటనగరాల్లోనే 600 మంది బాణసంచా అమ్ముతున్నారు. లెసైన్సులు పొందిన 70 మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. మిగతా వారి నుంచి పైసా ఆదాయం రావడంలేదు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే పన్ను 15 శాతం కూడా ఉండటంలేదు. అనుమతి లేని వ్యాపారులు నేరుగా శివకాశీ నుంచి సరుకు తెస్తున్నారు. పన్నుల బెడద లేకపోవడం వల్ల వీరికి 50 శాతం లాభాలు వస్తున్నాయి. ఇందులో కొంత మొత్తాన్ని చెక్‌పోస్టుల వద్ద వెచ్చిసున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. మరోపక్క బాణసంచాను నగర శివారు ప్రాంతాల్లో జనావాసాలు లేని ప్రాంతాల్లో నిల్వ చేయాలని నిబంధనలున్నా, లెసైన్సులు లేని వ్యాపారులు నగరం నడిబొడ్డునే గోడౌన్లలో పెడుతున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇవ్వడం వల్ల ఎలాంటి తనిఖీలు ఉండటం లేదనే ఆరోపణలున్నాయి.