ససేమిరా...
అధికార పార్టీలో గుట్కా పంచాయితీ
- నెలకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రూ.250 కోట్ల వ్యాపారం
- ఇటీవల రూ.50 లక్షల నిల్వలు పట్టివేత
- బెజవాడ పోలీస్ కమిషనర్‌పై అధికార పార్టీ ఒత్తిళ్లు
- సిండికేట్ మంచిదని సిఫార్సు చేసిన గుంటూరు మంత్రి, ఓ ఎమ్మెల్యే
- రాతపూర్వకంగా కోరిన విజయవాడ నగర కమిషనర్ ?
సాక్షి, విజయవాడ : విజయవాడ కేంద్రంగా నెలకు సుమారు రూ.300 కోట్ల విలువైన గుట్కా నిల్వలు కోస్తా జిల్లాలకు వెళుతున్నాయి. కర్నాటక, మహారాష్ట్రలకు ఇక్కడి నుంచే భారీగా సరఫరా అవుతున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే. గుట్కా సిండికేట్‌లో కొందరు అక్రమ వ్యాపారులు పాత్రధారులైతే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కీలక సూత్రధారులు. ఇటీవల నగరంలో భారీ గుట్కా డంప్‌ను పోలీసులు గుర్తించి సీజ్ చేసి నామమాత్రపు కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. దాని వెనుక భారీ మంత్రాంగమే నడిచింది. ఈ విషయంలో పోలీసులు ఒకవైపు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మరోవైపు నిలవటంతో వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
లింకు బయటపెట్టిన డంప్...
గత నెల 26న నగరంలోని భవానీపురంలోని ఐరన్ యార్డులో భారీ గుట్కా డంప్ బయటపడింది. మహారాష్ట్ర నుంచి బళ్లారి వెళుతున్న లారీ ఐరన్ యార్డులో ఆగింది. అక్కడ రాష్ట్రానికి చెందిన లారీలోకి లోడు మార్చి బళ్లారికి పంపటానికి సిద్ధమవుతుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు లారీల సరకు సీజ్ చేసి, దీని విలువ రూ.50 లక్షలు ఉంటుందని ప్రకటించారు. లారీ డ్రైవర్ సాల్మన్‌రాజుపై కేసు నమోదు చేసి దానిని పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో విషయం పోలీసుల దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్దకు చేరింది.
భారీ సిండికేట్ ఆధ్వర్యంలో...
నగరంలో సుమారు 10 మంది వ్యక్తులతో భారీ సిండికేట్‌గా ఏర్పడి గుట్కా వ్యాపారం సాగిస్తున్నారు. వీరందరికీ తెరవెనుక అసలు సూత్రధారిగా గుంటూరు నగరానికి చెందిన అధికార పార్టీ నేత ఉన్నాడు. సదరు నేతకు గుంటూరు శివారుల్లో పాన్‌మసాలా ప్లాంటు ఉంది. పేరుకే పాన్‌మసాలా ప్లాంటు.. అక్కడ మాత్రం తయారయ్యేది ఎంసీ బ్రాండ్ గుట్కా. గత కొన్నేళ్లుగా సదరు నేత ఈ వ్యాపారం సాగిస్తూ గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించి చివరి వరకు రేస్‌లో ఉన్నాడు.
ఈ క్రమంలో నగరంలోని సిండికేట్‌కు సదరు నేత గాడ్‌ఫాదర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో లారీలు సీజ్ కాగానే సిండికేట్ వ్యవహారాన్ని గాడ్‌ఫాదర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అధికార పార్టీ మంత్రి, స్థానిక వ్యాపారుల ద్వారా నగరంలో తరచూ వివాదాల్లో నిలిచే ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వీరిద్దరూ రంగంలోకి దిగి పోలీసులపై ఒత్తిళ్లు పెంచారు. దీంతో పోలీసులు తమ పరిధి కాదని, నగర కమిషనర్‌తో మాట్లాడాలని వారికి సూచించారు. దీంతో బాల్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కోర్టులో పడింది.
మంచివాళ్లని రాసిస్తే ఓకే...
మంత్రి, ఎమ్మెల్యే ఈ విషయమై సీపీపై ఒత్తిళ్లు తేవటం మొదలుపెట్టారు. అయినా స్పందన లేకపోవటంతో చివరికి వారే నేరుగా లైన్‌లోకి వచ్చి మన పార్టీ వాళ్లేనండీ.. చాలా మంచివాళ్లు.. తెలియక చేశారు.. ఈ ఒక్కసారికి వదిలేయండి.. మళ్లీ ఇలాంటివి జరగవంటూ కేసు లేకుండా చూడాలని కోరినట్లు సమాచారం. తొలుత సీపీ దీనిని పెద్దగా పట్టించుకోకపోవటంతో గుంటూరు జిల్లా అమాత్యుడు కొంత సీరియస్‌గా తీసుకొని విషయం తేల్చమని సీపీని కోరినట్లు సమాచారం. దీనికి సీపీ స్పందించి ‘వాళ్లు మంచివాళ్లని మీరు నాకు రాతపూర్వకంగా రాసిస్తే అలాగే చేసేద్దాం’ అని చెప్పినట్లు సమాచారం. కొసమెరుపు ఏంటంటే.. దొరికిన రెండు లారీల కేసు కంటే అసలు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. అయితే గాడ్‌ఫాదర్‌తో ఈ ప్రజాప్రతినిధులకు కొంత ఆర్థిక సంబంధాలు కూడా ఉన్న నేపథ్యంలో వారు ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశముందని సమాచారం.