ప్రకాశం జిల్లా చీరాల కేంద్రంగా గోల్డ్ బిస్కెట్ల అక్రమ వ్యాపారం మాయా బజారును తలపించే రీతిలో జోరుగా సాగుతోంది. సౌదీలోని ఖతర్ నుంచి వాయు, జలమార్గాల ద్వారా కస్టమ్స్ కళ్లుగప్పి దేశానికి బంగారం వస్తోంది. అక్రమార్కుల ద్వారా దర్జాగా చీరాల చేరుతోంది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో ఈ చీకటి వ్యాపారం ఊపందుకుంది. తక్కువ ధరకే వస్తుండడం వ్యాపారులకు లాభసాటిగా మారింది. సుంకాలు ఎగ్గొట్టడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరో వైపు తక్కువకే బంగారం ఇస్తామనే కేటుగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి.
చీరాల: వస్త్ర వ్యాపారానికి పేరుగాంచిన చీరాలకు మినీ ముంబయిగా పేరుంది. తాజాగా బంగారం జీరో దందా వ్యాపారం విస్తరిస్తోంది. కొందరు సుంకాలు ఎగ్గొట్టి తక్కువ ధరకు బంగారాన్ని వర్తకులకు విక్రయిస్తుంటే.. మరి కొందరు ఈ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యాపారాన్ని కొందరు ఏజెంట్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు సమాచారం. బంగారం తీసుకురావాలంటే కస్టమ్స్, జీఎస్టీ పన్నులు 17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అవి చెల్లించకుండా ఎంతో కొంత ముట్టచెప్పి తీసుకొస్తున్నామని, అందువల్లే చౌకగా బంగారం దొరుకుతుందని వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
సౌదీ నుంచే స్మగ్లింగ్
బంగారు గనులు విస్తారంగా ఉన్న సౌదీలోని ఖతర్ నుంచి స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ నుంచి సింగపూర్, అక్కడి నుంచి విశాఖపట్నం, చెన్నైకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. అలా తెచ్చిన బంగారాన్ని ఏజెంట్ల ద్వారా చీరాల, తెనాలి, నెల్లూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి లెక్కా పత్రాలు లేకుండా తక్కువ ధరకు లభిస్తుండడంతో వ్యాపారులు కూడా మొగ్గు చూపుతున్నారు. చీరాల ప్రాంతంలో ఎక్కువగా వస్త్ర వ్యాపారంతో పాటు బంగారం వ్యాపారం సాగుతోంది.
ఇక్కడ బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఆభరణాల తయారీ కూడా జరుగుతోంది. ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి జీఎస్టీ బిల్లు కాకుండా ఎస్టిమేషన్ బిల్లులే ఇవ్వడం విశేషం. అందుకే అక్రమార్కులు చీరాల ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 17 శాతం పన్నుల్లో సుమారు 5 నుంచి 7 శాతం తక్కువ ధరకే బిస్కెట్లు దొరకడంతో చీరాల, తెనాలిలోని బంగారం వ్యాపారులతో పాటు అనధికారికంగా కొందరు వ్యక్తులు కొనుగోలు చేసి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. చీరాలలో 75 వరకు, తెనాలి ప్రాంతంలో 200కుపైగా బంగారం దుకాణాలు ఉన్నాయి.
కస్టమ్స్‌లో ఉద్యోగమని..
చీరాలకు చెందిన పి.రవితేజ బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం వ్యాపారం చేయాలనే ఆలోచనతో 2017 నుంచి చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2020లో తెనాలిలో బులియన్ మార్కెట్లో మదన్ అనే బంగారం వ్యాపారితో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా చీరాలలోని పలు బంగారం దుకాణాలతో పాటు కొందరు వ్యక్తులకు మార్కెట్ ధర కంటే 5 నుంచి 10 శాతం తక్కువకు ఇవ్వడం మొదలు పెట్టాడు. చీరాల చుట్టు పక్కల బంగారు వ్యాపారులతో పాటు తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసే మరి కొందరిని ఆకర్షించాడు. చాలా కాలంగా తాను కస్టమ్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు.
కస్టమ్స్ డ్యూటీతో పాటు జీఎస్టీ లేకుండా బంగారం తెచ్చి అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు. కొంత కాలం ఈ వ్యాపారం సజావుగా సాగింది. ఈ మార్గంలో అయితే భారీగా సంపాదించలేననుకున్నాడో ఏమోగానీ, 700 బిస్కెట్లకు (ఒక్కో బిస్కెట్ 100 గ్రా.) అడ్వాన్సుగా పలువురు వర్తకుల వద్ద డబ్బు తీసుకున్నాడు. చివరికి వారికి బంగారం ఇవ్వకపోగా ఇచ్చిన అడ్వాన్సును స్వాహా చేశాడు. మోసపోయామని గ్రహించిన వ్యాపారులు, ఇతర వ్యక్తులు చీరాల వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు వ్యాపారుల వద్ద నుంచి రూ.3.50 కోట్లకుపైగా నగదు తీసుకుని అతని జల్సాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. అయితే అందులో బయటపడని వ్యాపారులు చాలా మంది ఉన్నట్లు సమాచారం. తమ అక్రమ వ్యాపారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే వారంతా మౌనం దాల్చారు.
మాఫియా మధ్య విభేదాలతో బయటకు..
కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు.
లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు.
బంగారం వ్యవహారంపై దృష్టి సారిస్తున్నాం
తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పే కేటుగాళ్లపై దృష్టి సారించాం. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్నాం. ఇప్పటికే ఒక ఏజెంట్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద రూ.24 లక్షల నగదు, కొంత బంగారం రికవరీ చేశాం. బంగారం వ్యాపారులు కూడా కేటుగాళ్ల మాయమాటలు వినిమోసపోవద్దు. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేయాలి. లేకుంటే చర్యలు తప్పవు.
– పి.శ్రీకాంత్, డీఎస్పీ, చీరాల
మాఫియా మధ్య విభేదాలతో బయటకు..
కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు.
లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment