గోల్డ్‌ మాఫియా! | Import gold from abroad from illegal | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ మాఫియా!

Published Fri, May 10 2019 1:00 AM | Last Updated on Fri, May 10 2019 5:03 PM

Import gold from abroad from illegal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలంటారు పెద్దలు’.. సరిగ్గా ఇలాగే బంగారం పన్ను ఎగవేతకు ఇక్కడి వ్యాపారులు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వాడేసుకుంటున్నారు. దీనికోసం ఏకంగా పరిశ్రమలే ఏర్పాటు చేయడం లేదా అలాంటి పరిశ్రమలతో ములాఖత్‌ అవ్వడం చేస్తున్నారు. హైదరాబాద్‌ బంగారం మార్కెట్‌లో ఇలాంటి గోల్‌మాల్‌ వ్యాపారాలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా భారీ స్కామ్‌లు ఒక్కొక్కటిగా బయటికి రావడం డెరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులనే విస్మయానికి గురిచేస్తోంది. ఈ కుంభకోణం కారణంగా కొందరు వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టి.. స్థానిక మార్కెట్‌లో తక్కువ ధరలకు విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. దీనికి ఇటీవల వెలుగుచూసిన ‘జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ ఎస్‌ఈజెడ్‌’ఉదంతమే నిదర్శనం. బంగారు ఆభరణాల తయారీకి అనుమతి పొందిన ఈ పరిశ్రమ రాచబాటలో బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా కోట్ల రూపాయల పన్నులు మిగుల్చుకుని జేబులో వేసుకుంటోంది.  

అసలేం జరిగింది?... 
రావిర్యాలలోని జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ ఎస్‌ఈజెడ్‌ పరిశ్రమ విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటారు. ఈ బంగారాన్ని స్థానిక మార్కెట్‌కు బదిలీ చేయకూడదనే నిబంధన కూడా ఉంది. ఇలా దిగుమతి చేసుకున్న బంగారానికి పన్నులు ఉండవు. ఇదే గోల్‌మాల్‌కు కారణమైంది. దిగుమతి చేసుకున్న బంగారంతో ఆభరణాలు తయారు చేసి తిరిగి విదేశాలకు ఎగుమతి చేయాలి. కానీ, వీరు అలా పంపకుండా.. చాలా స్వల్ప శాతం బంగారంతో ఆభరణాలు తయారు చేస్తున్నారు. వీటిలో అధిక శాతం రంగురాళ్లు నింపి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనిపై అధికారులకు పక్కా సమాచారం అందడంతో ఈ నెల 3, 4, 5 తేదీల్లో సదరు సంస్థపై దాడులు చేశారు. స్వా«ధీనం చేసుకున్న ఆభరణాలను, రికార్డులను చూసిన అ«ధికారులు విస్తుపోయారు. ఓ లావాదేవీలో 19 కిలోగ్రాముల బంగారం, 2 కిలోగ్రాముల రాళ్లు ఉండాలి. కానీ, 20.85 కిలోగ్రాముల రాళ్లు, కేవలం 565 గ్రాముల బంగారమే ఉండటంతో గుట్టు బయటపడింది. చాలాకాలం నుంచి ఇలాంటి పనులు చేస్తున్నారని, నగరంలో పేరున్న ఓ బడా జువెల్లరీ సంస్థకు వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకూ 1,100 కిలోల బంగారాన్ని ఇలా పక్కదారి పట్టించి భారీగా ఆర్జించారని, ప్రభుత్వానికి రూ. వేల కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. 

రాకెట్‌ విదేశాల్లోనే ఉందా? 
వాస్తవానికి 20 కిలోల బంగారం చొప్పున విదేశాల నుంచి ఆర్డర్‌ వస్తే.. తిరిగి అదే బరువుకు సమానమైన ఆభరణాలు చేసి పంపాలి. కానీ, అలాకాకుండా గ్రాముల్లో బంగారం పూతపూసి, కిలోగ్రాముల్లో రంగురాళ్లు నింపి పంపుతుంటే విదేశాల నుంచి అధికారులకు ఎందుకు ఫిర్యాదు రాలేదన్నది అధికారులు పరిశీలిస్తున్నారు. విదేశాల్లోనే వీరికి సహకరించేవారు ఉన్నారని డీఆర్‌ఐ అధికారులు అనుమానిస్తున్నారు. బంగారం పరిమాణంలో ఇంతటి భారీ వ్యత్యాసం ఉంటున్నా.. అవతలి వాళ్లు నోరు మెదపకుండా ఎలా ఉన్నారన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, త్వరలో మరిన్ని అరెస్టులు జరగవచ్చని సమాచారం. నోట్ల రద్దు సమయంలో నగరానికే చెందిన మసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జువెల్లరీస్‌ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు తప్పుడు బిల్లులు సృష్టించి ఏకంగా రూ.110 కోట్ల మేరకు గోల్‌మాల్‌ చేసినట్లు ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. రూ.82 కోట్లు విలువైన 145 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement