సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరోనా వైరస్ (కోవిడ్–19 ) దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 19వ తేదీన ఒంగోలు నగరంలోని ఓ యువకునికి తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే సదరు యువకుని కుటుంబ సభ్యులకు, తనతో ప్రయాణించిన వ్యక్తులకు సైతం రిపోర్టులు నెగిటివ్ రావడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే శనివారం ఒంగోలు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న చీరాలకు చెందిన ముస్లిం మతపెద్ద దంపతులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. (ఒకట్లూ, పదులు, వందలు.. నేడు వేలు!)
ముఖ్యంగా పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తి నివాసముండే చీరాల చుట్టు పక్కల ప్రాంతాలను హైరిస్క్ జోన్‌లుగా ప్రకటించి నివారణ చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జిల్లాలో ప్రజలు స్వీయ నియంత్రణే ఆయుధంగా అత్యవసరమైతే తప్ప అడుగు బయట పెట్టవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలను అందుబాటులోకి తెచ్చామని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి అనుమానితులను అందులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వలంటీర్ల సాయంతో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఇళ్లకే పరిమితం కావాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. (క్వారంటైన్ కేంద్రం ఎలా ఉంటుందంటే..)
ముస్లిం మతపెద్ద దంపతులకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో ఆయనతో పాటు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ వార్డులకు తరలించే పనిలో పడ్డారు. చీరాల రూరల్ మండలం సాల్మన్ సెంటర్ పంచాయతీ పరిధిలోని నవాబ్‌పేటకు చెందిన ముస్లిం మతపెద్ద ఈ నెల 19వ తేదీన సుమారు 80 మంది ముస్లింలతో కలిసి ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. (మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ)
ఈ నెల 15న ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన మతపెద్దతో కూడిన బృందం విజయవాడ మీదుగా 17వ ఉదయం చీరాలకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే మతపెద్ద ప్రయాణించిన భోగీలో చీరాల, పేరాల, కారంచేడు, ఈపురుపాలెం, ఒంగోలుకు చెందిన ఐదుగురు ప్రయాణించినట్లు అధికారులకు సమాచారం అందింది. వీరంతా మతపెద్దతో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు తేలడంతో వీరందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సదరు మతపెద్ద చీరాలకు వచ్చిన తరువాత నవాబ్‌పేట మసీదులో ప్రార్థనలు చేయడంతో పాటు రెండు వివాహ కార్యక్రమాలకు సైతం హాజరైనట్లుగా చెబుతున్నారు. దీంతో ఆయనతో పాటు ప్రయాణించిన వారి గురించి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. (కోవిడ్తో స్పెయిన్ యువరాణి మృతి!)
చీరాలలో భయం..భయం
చీరాల ప్రాంతం కరోనా కబంద హస్తాల్లోకి వెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేయడంతో ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడ కరోనా వైరస్ కబళిస్తుందోనని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పంజా చీరాలపై పడింది. చీరాల మండలం సాల్మన్ సెంటర్ పంచాయతీలోని నవాబుపేటలో గురువారం రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. నవాబుపేటకు చెందిన భార్య, భర్తలకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని హుటాహుటిన ప్రత్యేక అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. (ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ)
రక్త పరీక్షల అనంతరం శనివారం వారిద్దరికీ కరోనా వైరస్ ఉన్నట్లుగా రిపోర్టులు రావడంతో చీరాల ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కరోనా మహమ్మారి రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో చీరాల ప్రాంత వాసులల్లో వణుకు మొదలైంది. అయితే కరోనా బాధితులు ఎక్కడెక్కడకు వెళ్లారు... ఎవరిని కలిశారు అనేది తెలియాల్సి ఉంది. దీంతో బాధితులతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తుల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. సుమారు 50 నుంచి 60మందిని ఐసోలేషన్‌కు తరలించే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటికే 1056 మంది విదేశీ ప్రయాణికులను సర్వేలేన్స్‌లో ఉంచారు. (కరోనాతో చిన్నారి మృతి; తొలి కేసు!)
పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఎక్కడెక్కడకు వెళ్లారో పరిశీలిస్తే..
మార్చి 12: చీరాల మండలం సాల్మన్‌సెంటర్ పంచాయతీలోని నవాబుపేటకు చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురు ఇస్తిమాకు చీరాల నుంచి ఢిల్లీ వెళ్లారు.
మార్చి 14: ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు.
మార్చి 14,15,16: మూడు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు.
మార్చి 17: ఢిల్లీలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరారు.
మార్చి 19: ఒంగోలులో రాజీవ్ గృహకల్ప కాలనీలో కుమారుడి ఇంటి వద్ద ఉన్న భార్యను తీసుకుని అదే రోజు అర్ధరాత్రి 2 గంటలకు చీరాలకు చేరుకున్నారు.
మార్చి 20 నుంచి 25వ తేదీ వరకు చీరాలలో ఉన్నారు. ఆ సమయంలో ఒక వివాహానికి, ఒక ముస్లిం కుటుంబంలో జరిగిన అంత్యక్రియలకు హాజయ్యాడు. 20వ తేదీ శుక్రవారం మసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నాడు.
మార్చి 25: భార్యాభర్తలు ఇద్దరికి దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం రావడంతో వారిని ఏఎన్‌ఎం పరీక్షల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
మార్చి 26: దంపతులిద్దరికీ కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
శనివారం వారికి కరోనా పాజిటివ్‌గా రావడంతో నవాబుపేట ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. రెడ్‌జోన్‌గా గుర్తించి రాకపోకలు నిలిపివేశారు. అయితే కరోనా అనుమానితులుగా వైద్యశాలకు తరలించిన వెంటనే ఆ ప్రాంతంలో అధికారుల బృందం పర్యటించింది. బ్లీచింగ్, శానిటేషన్ పనులు చేశారు. బాధితుడి నివాసం పరిసర ప్రాంత ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడి భరోసా కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment