దొడ్డిదారిన దీపావళి బాణసంచా
సాక్షి, హైదరాబాద్: అక్రమ వ్యాపారులకు దీపావళి బాణసంచా కోట్లు కురిపిస్తోంది. లెక్కా పత్రం లేని సంపాదనలో ఆదాయం పన్ను శాఖకు చిల్లిగవ్వ కూడా కట్టడంలేదు. శివకాశీ నుంచి హైదరాబాద్ వరకు ఏ చెక్‌పోస్టులోనూ బాణసంచాను అడ్డుకున్న దాఖలాలు లేవు. దీంతో బాణసంచా వ్యాపారంపై ఆదాయం పన్నుశాఖ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పరిమిత సంఖ్యలోనే వ్యాపారులు బాణసంచా అమ్మకాలకు లెసైన్సులు పొందినట్టు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే. రాష్ట్రవ్యాప్తంగా 1,540 మంది ఈ ఏడాది బాణసంచా కొనుగోలు చేసినట్లు శివకాశీ నుంచి అందిన వివరాలు తెలుపుతున్నాయి. వీటి విలువ రూ. 850 కోట్లు. లెసెన్సులు లేకుండా జంటనగరాల్లోనే 600 మంది బాణసంచా అమ్ముతున్నారు.
లెసైన్సులు పొందిన 70 మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. మిగతా వారి నుంచి పైసా ఆదాయం రావడంలేదు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే పన్ను 15 శాతం కూడా ఉండటంలేదు. అనుమతి లేని వ్యాపారులు నేరుగా శివకాశీ నుంచి సరుకు తెస్తున్నారు. పన్నుల బెడద లేకపోవడం వల్ల వీరికి 50 శాతం లాభాలు వస్తున్నాయి. ఇందులో కొంత మొత్తాన్ని చెక్‌పోస్టుల వద్ద వెచ్చిసున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. మరోపక్క బాణసంచాను నగర శివారు ప్రాంతాల్లో జనావాసాలు లేని ప్రాంతాల్లో నిల్వ చేయాలని నిబంధనలున్నా, లెసైన్సులు లేని వ్యాపారులు నగరం నడిబొడ్డునే గోడౌన్లలో పెడుతున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇవ్వడం వల్ల ఎలాంటి తనిఖీలు ఉండటం లేదనే ఆరోపణలున్నాయి.