
నేడు అసెంబ్లీ సమావేశం
ఒకే రోజు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం సమావేశం కానుంది. వచ్చే ఏప్రిల్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకురానున్న జీఎస్‌టీ బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ జీఎస్‌టీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెడతారు. సోమవారం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సచివాలయంలో భేటీ అయింది. అసెంబ్లీ సమావేశాలను ఒకే రోజు నిర్వహించాలని, జీఎస్‌టీ బిల్లుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఆమోదించి పంపించాలని తీర్మానించింది.
ఇదే సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐదో విడత సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఒకే రోజు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించినప్పటికీ మరి కొన్ని రోజులు కొనసాగించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. బీఏసీలో తీసుకునే నిర్ణయం మేరకు దీనిపై స్పష్టత వస్తుంది. ఒకవేళ పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించినా వినాయక చవితి ఉత్సవాల తర్వాతే సమావేశాలు కొనసాగించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.