సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ఓవైపు రూ. కోట్లలో పన్ను ఎగ్గొడుతూ మరోవైపు ప్రభుత్వాన్నే దోషిగా చూపేందుకు హైకోర్టుకెక్కిన ఓ ఘరానా వ్యాపార సంస్థ బాగోతం న్యాయస్థానంలోనే బట్టబయలైంది. వాణిజ్య పన్నులశాఖపై ఆ సంస్థ వేసిన కేసులో విచారణ సందర్భంగా దాని బండారం ప్రాథమికంగా రుజువు కావడంతో హైకోర్టు సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. పన్నులు ఎగవేసే ఇలాంటి వ్యాపార సంస్థలు ఎన్నున్నాయో దర్యాప్తులో నిగ్గు తేల్చాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు ఏమిటంటే...
వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఎటువంటి మదింపు ఉత్తర్వులు జారీ చేయకుండానే తమ నుంచి రూ. 32.87 లక్షలకు పోస్ట్‌డేటెడ్ చెక్కులను వసూలు చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన ఆకాశ్ ఫుడ్స్ హైకోర్టును ఆశ్రయించింది. అధికారుల చర్యను చట్ట విరుద్ధంగా ప్రకటించి తమ చెక్కులను వెనక్కి ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే తమకు చెల్లించాల్సిన పన్ను నిమిత్తం ఆ చెక్కులను నగదుగా మార్చామని వాణిజ్యపన్నులశాఖ అధికారులు కోర్టుకు నివేదించారు. అంతేగాక అయిల్ తరలింపు వాహనాలకు సంబంధించిన సీఎస్‌టీ వే బిల్లుల వ్యవహారంలో ఆకాశ్ ఫుడ్స్ చేసిన మోసాన్ని కోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించారు. పలు వాహనాలకు సంబంధించి ఆకాశ్ ఫుడ్స్ 106 వే బిల్లులు సంపాదించిందని, వాటి ద్వారా తెలంగాణ నుంచి మహారాష్ట్ర, ఢిల్లీకి అయిల్ వాహనాలు పంపిందన్నారు. దీనిపై మహారాష్ట్ర పన్ను అధికారుల సాయంతో విచారణ చేపట్టగా నాందేడ్‌లో ఆకాశ్ ఫుడ్స్ చూపిన ఆయిల్ డీలర్ల చిరునామాలన్నీ బోగస్‌వని తేలిందన్నారు. అలాగే ఢిల్లీలోని డీలర్ల బ్యాంకు ఖాతాల్లో భారీగా అవకతవకలు కనిపించాయని కోర్టుకు వివరించారు. ఆకాశ్ ఫుడ్స్ సమర్పించిన ఫోనిక్స్ ఇంపెక్స్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో రూ. 1.05 కోట్లు చెల్లింపులు చేసినట్లు ఉంటే, ఆకాశ్ ఫుడ్స్ మాత్రం రూ. 7.77 కోట్లు చెల్లించినట్లు చూపిందన్నారు.
తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం...
పన్ను బకాయి కింద జమ చేసుకునేందుకు ఆకాశ్ ఫుడ్స్‌కు చెందిన చెక్కులను అధికారులు నగదుగా మార్చుకున్నం దున ఈ కేసును హైకోర్టు అక్కడితో మూసేయాల్సి ఉన్నప్ప టికీ... ఆకాశ్ ఫుడ్స్‌పై అధికారులు చేసిన ఆరోపణలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కోట్ల రూపాయాల మేర పన్ను ఎగవేసేందుకు ఆకాశ్ ఫుడ్స్ ప్రయత్నించినట్లు ప్రా«థమికంగా నిర్ధారించి సంస్థ ఆర్థిక అవకతవకలపై సీబీసీ ఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తును ఈ కేసుకే పరిమి తం చేయకుండా పిటిషనర్‌లాగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకలా పాలు సాగిస్తున్న ఆయిల్ డీలర్లందరి విషయంలోనూ దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. దీనిపై 3 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ప్రభుత్వాలకు చురకలు...
ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాలను ఉద్దేశించి హైకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంస్థ పన్ను ఎగవేతపై అధికారులు ఇప్పటివరకు ఫిర్యాదు లేదా దర్యాప్తు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పన్నులు ఎగవేస్తున్న వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. పన్నుల వసూలు, జరిమానాల విధింపుతోనే పని అయిపోయిందని చేతులు దులుపుకోవడం సరికాదని, నీతినియమాలు లేనటువంటి వ్యాపారులపట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment