
ఇక జీఎస్టీ శాఖ
► వస్తుసేవల పన్నుతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వరూపం మార్పు
► కమిషనర్ హోదాలో మాత్రం మార్పులేదు
► కింది స్థాయి పోస్టులన్నింటికీ ప్రమోషన్ కేడర్లు
► సర్కిళ్లు, డివిజన్ల పెంపునకు ప్రతిపాదనలు
► ఒకటి రెండు రోజుల్లో నోటిఫై చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వరూపాన్నే మార్చేస్తోంది. అసలు ఆ శాఖ పేరే మారిపోయి తెలంగాణ వస్తుసేవల పన్ను శాఖ (జీఎస్టీ శాఖ)గా మారిపోతోంది. జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి పన్ను విధించే అధికారం లేని నేపథ్యంలో వాణిజ్య పన్నులు అనే పదాన్ని తొలగించి.. జీఎస్టీ శాఖగా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు కమిషనరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వాటికి ఆమోదం లభిస్తే శనివారమే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల హోదాల్లోనూ మార్పులు రానున్నాయి.
కమిషనర్ హోదాలో ఎలాంటి మార్పు చేయనప్పటికీ... తర్వాతి స్థాయి నుంచి కేడర్‌లో మార్పులు చేస్తున్నారు. శాఖ అదనపు కమిషనర్‌ను స్పెషల్ కమిషనర్‌గా పిలవనున్నారు. జాయింట్ కమిషనర్ నుంచి డీసీటీవోల వరకు పదోన్నతులు కల్పించి హోదా పెంచనున్నారు. కిందిస్థాయిలో ఉండే సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి (ఏసీటీవో)ని మాత్రం వస్తుసేవల పన్ను అధికారి (జీఎస్టీ అధికారి)గా పిలవనున్నారు. అయితే పేరు మార్చినా బాధ్యతల్లో ప్రస్తుతానికి మార్పు ఉండద ని.. బాధ్యతలకు ప్రత్యేక మార్గ దర్శకాలు విడుదలయ్యేం తవరకు అవే విధులను నిర్వహించాల్సి ఉంటుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సర్కిళ్లు, డివిజన్లు కూడా పెంపు
జీఎస్టీని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రస్తుతం ఈ శాఖ పరిధిలో ఉన్న సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యలో మార్పులు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ కోసం నియమించిన కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ సిఫారసులను యథావిధిగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి కూడా ఫైలు వెళ్లింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటివరకు ఉన్న 91 సర్కిల్ కార్యాలయాలను 140కి పెంచనున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 డివిజన్లను 20కి పెంచుతున్నారు. ఈ పెంపు ద్వారా మొత్తం 850కి పైగా అదనపు పోస్టులు కూడా అవసరం కానున్నాయి. అయితే ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.
అర్ధరాత్రి నుంచే చెక్‌పోస్టుల ఎత్తివేత
జీఎస్టీ అమలు నేపథ్యంలో శుక్రవార అర్ధరాత్రి నుంచే రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఎత్తివేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో 19 చెక్‌పోస్టు లు ఉన్నాయి. ఆ చెక్‌పోస్టులను మూసివేయాలని, అక్కడి సిబ్బందిని సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో ఉన్న సిబ్బంది కొరతను బట్టి వినియోగించుకోవాలని క్షేత్రస్థాయికి ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే చెక్‌పోస్టుల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను వెంటనే రికార్డు చేయాలని, వాటిని హైదరాబాద్‌కు పంపడంతో పాటు అక్కడి ఆస్తులను కాపాడేందుకు రోజుకొకరికి విధులు కేటాయించాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు చెక్‌పో స్టుల్లో సిబ్బందిని ఉంచకూడదని, మొబైల్ బృందాల ద్వారా తనిఖీలు కూడా చేపట్టవద్దని ఆదేశించడం గమనార్హం.
పన్ను రాయితీపై ప్రతిష్టంభన
రాష్ట్రంలోని వెయ్యి పరిశ్రమలకు ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమలు వస్తువులు తయారు చేస్తే ఇక్కడే పన్ను కట్టేవి.. ఆ వస్తువులను వేరే రాష్ట్రంలో అమ్మినా పన్ను రాష్ట్రానికే వచ్చేది. ఇలా ఆదాయం వస్తుంది కాబట్టి అన్ని రాష్ట్రాలూ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేవి. కానీ జీఎస్టీ అమల్లోకి వస్తుండడంతో పరిస్థితి మారిపోతోంది. రాష్ట్రంలో తయారైన వస్తువులను ఇతర రాష్ట్రంలో అమ్మితే.. పన్ను ఆదాయం ఆ రాష్ట్రాలకే వెళ్లిపోతుంది. వస్తువులు తయారైన రాష్ట్రానికి ఎటువంటి పన్ను ఆదాయం రాదు.
ఆ పరిశ్రమలు జీఎస్టీని ఇక్కడే కట్టినా... కేంద్రం ఆ పన్నును తీసుకుని ఆయా వస్తువుల వినియోగం జరిగిన రాష్ట్రానికి ఇచ్చేస్తుంది. దీంతో ఇప్పటికే పన్ను రాయితీలిచ్చిన పరిశ్రమలకు ‘ట్యాక్స్ డిఫర్ మెంట్ (పన్ను తిరిగి చెల్లింపు)’ఎలాగన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక తయారీ పరిశ్రమ నుంచి వచ్చిన ఎన్ని వస్తువులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి, ఎన్ని మన రాష్ట్రంలో అమ్ముడుపోయాయనే దానిని లెక్కిం చి పన్ను రాయితీ కల్పించాలా? మొత్తం ఆ పరిశ్రమ కట్టిన పన్ను మొత్తాన్ని ఒప్పందం ప్రకారం మన రాష్ట్రమే చెల్లించాలా? లేక కేంద్రం జోక్యం చేసుకుని ఆ పన్ను లాభం పొందిన రాష్ట్రం నుంచి తిరిగి ఇప్పిస్తుందా? అన్న అంశాలపై ప్రతిష్టంభన నెలకొంది.
2005 నుంచి వెయ్యికిపైగా..
పరిశ్రమలను ఆకర్షించే ఆలోచనతో 2005 నుంచి 2017 వరకు రాష్ట్రంలో వెయ్యికిపైగా పరిశ్రమలకు అప్పటి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ప్రకటించా యి. కొన్నింటికి ట్యాక్స్ డిఫర్‌మెంట్ కూడా ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఆయా పరిశ్రమల ద్వారా పూర్తి స్థాయి ఆదాయం మన రాష్ట్రానికి అందని నేపథ్యంలో.. ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.