సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వానికి కామధేనువు అయిన వాణిజ్య పన్నుల వసూళ్లు నగరంలో చాలావరకు తగ్గుముఖం పట్టాయి. సీమాంధ్ర సెగతో వ్యాపార,వాణిజ్యరంగాల టర్నోవర్ బాగా తగ్గిపోయి ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. గత రెండునెలలుగా వివిధ పన్నుల వసూళ్లు తగ్గడంతో ఉన్నతాధికారులు కలవరపడుతున్నారు. వాణిజ్యపన్నులశాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్ నగర రాబడియే అత్యంత కీలకం. మొత్తం రాష్ట్ర రాబడిలో 74శాతం వరకు ఇక్కడినుంచే జమవుతోంది.
వాణిజ్య పన్నులశాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువఆధారిత పన్ను), అమ్మకం పన్నులు ప్రధానమైనవి. ఇవేకాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంతవరకు ఆదాయం వస్తుంది. మొత్తం రాబడిలో ఒక వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతంపైగా,మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు సమకూరుతోంది. తాజా పరిణామాలతో వ్యాట్‌తోపాటు వివిధ పన్నుల వసూళ్లు క్షీణించడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ఈనెల మొత్తం లక్ష్యంలో ఇప్పటివరకు కనీసం 40శాతం కూడా వసూలు కాకపోవడం పరిస్థితికి నిదర్శనం.
గ్రేటరే పెద్ద అన్న : గ్రేటర్ హైదరాబాద్ వాణిజ్య పన్నులశాఖకు కల్పతరువు లాంటిది. ఇక్కడినుంచే అధిక రాబడి వసూలవుతోంది. రాష్ట్రం మొత్తం 25 డివిజన్లలో కలిపి వివిధ పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సమకూరిన ఆదాయం రూ.8706.32 కోట్ల కాగా, అందులో కేవలం గ్రేటర్‌లోని ఏడు డివిజన్ల రాబడి మొత్తం రూ.5214.47 కోట్ల వరకు ఉంటుంది. అంటే సగానికన్నా ఎక్కువన్నమాట.
అందులో సైతం అత్యధికంగా పంజగుట్ట డివిజన్ నుంచి రూ.1125.74 కోట్లు వసూలయ్యాయి. ఆ తర్వాత అబిడ్స్ డివిజన్ నుంచి రూ.932.12 కోట్లు, బేగంపేట డివిజన్ నుంచి రూ.902.36కోట్ల వరకు రాబడి లభించింది. ప్రధాన ంగా వివిధ వ్యాపార,వాణిజ్య సంస్థలు, కంపెనీల నుంచి వ్యాట్,అమ్మకం తదితర పన్నులు వసూళ్లవుతాయి.పెట్రోలియం ఉత్పత్తులు పెట్రోలు,డీజిల్, వంటగ్యాస్, సీఎన్జీ తదితర వాటిపై అధిక పన్నులు వసూలవుతాయి.
ప్రధానంగా రాజధానిలో పెట్రోలియం కంపెనీల కార్యాలయాలు ఉన్నకారణంగా వ్యాట్‌ను ఇక్కడే చెల్లిస్తారు. మొత్తం వ్యాట్ రాబడిలో కేవలం పెట్రోలుపైనే సుమారు 27శాతం వరకు ఉంటుంది. అలాగే మద్యం వినియోగం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్పటికీ కేవలం హైదరాబాద్‌లోనే మొత్తం వ్యాట్ వసూలవుతోంది. రాష్ట్ర బ్రేవరేజ్ కార్పొరేషన్ మద్యం విక్రయాలకు అనుగుణంగా నగరంలోనే వ్యాట్ చెల్లిస్తుంది.
ఆదాయానికి ‘సెగ’
Published Mon, Sep 23 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement