సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిన నిధులను వాణిజ్య పన్నుల శాఖ చేతులారా పోగొట్టుకుంటోంది. ప్రణాళిక లేని పనులు, హడావుడి ఉత్తర్వుల ద్వారా కోట్లాది రూపాయల ధనాన్ని కోల్పోతోంది. పన్ను చెల్లించే రిజిస్టర్డ్ డీలర్ల వ్యాపార లావాదేవీలను ఆడిట్ చేసే ప్రక్రియలో అక్కరకు రాని పనులు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా గత ఆరునెలలుగా రూ.100 కోట్ల వరకు వాణిజ్య పన్నుల శాఖకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ అధికారులే అంటున్నారు. ఆడిట్ ప్రక్రియలో అవసరం లేని ‘స్క్రూటినీ’అనే విధానాన్ని చేర్చడంతో ఆడిట్‌లు ఓ పట్టాన పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, గత ఆరునెలల కాలంలో ఈ విధానం ద్వారా కనీసం 10 మంది డీలర్ల వ్యాపార లావాదేవీలను కూడా ఆడిట్ చేయలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆడిట్.. కథా కమామిషు
వాస్తవానికి, పన్ను చెల్లింపుదారుల కింద రిజిస్టర్ అయిన డీలర్లు ఏటా తమ వార్షిక టర్నోవర్ ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు. ఇందుకు గాను అవసరమైన పత్రాలను ఆడిట్ చేయించి ప్రభుత్వానికి సమర్పి స్తారు. అయితే, వ్యాపారులిచ్చిన వివరాలు, వారి లావాదేవీలు సరిగా ఉన్నాయా లేదా తనిఖీ చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ కూడా ఆడిట్‌లు చేస్తుంది. వ్యాపారులు ఏడాది పాటు ఎక్కడి నుంచి వస్తువులు కొన్నారు?, ఎంతకు అమ్మారు?, అందులో ఏ శ్లాబు పన్ను కిందకు ఏ వస్తువులు వస్తాయి? అసలు పన్ను చెల్లించాల్సిన మొత్తం ఎంత? ఆడిట్‌లో చూపించిన మొత్తం ఎంత? చెల్లించింది ఎంత? ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఎంత క్లెయిమ్ చేసుకున్నారు? అనే వివరాలను వ్యాపారుల వద్ద ఉన్న రికార్డుల ద్వారానే తనిఖీ చేస్తారు.
ఈ విధంగా ఆడిట్ చేయడం ద్వారా వ్యాపారాన్ని తక్కువ చూపించి పన్ను ఎగ్గొట్టే డీలర్ల నుంచి అదనపు పన్ను వసూలు చేస్తారు. ఇలాంటి ఆడిట్ ప్రక్రియలో కూడా ఏటా వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతాయి. కానీ, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆడిట్ ప్రక్రియలో స్క్రూటినీ అనే విధానాన్ని మన రాష్ట్రంలోనే కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం సదరు వ్యాపారి వద్ద తనిఖీ చేసిన ప్రతి రికార్డును ఇన్వాయిస్‌తో సహా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి వస్తోంది. కాగా, ఆరేళ్లనాటి రికార్డులు కూడా పరిశీలించాలనడం.. అవి అందుబాటులో లేక, ఉన్నా సరిగా అప్‌లోడ్ చేయలేక ఆడిటింగ్ నత్తనడకన సాగుతోం దని అధికారులు వాపోతున్నారు.
నెలలో చేయాల్సింది 1,500
పన్ను మదింపు అధికారం ఉన్న అధికారులు రాష్ట్రంలో 350 మంది ఉన్నారు. ఇందు లో డీసీటీవోలు 200 మంది, సీటీవోలు 110 మంది, అసిస్టెంట్ కమిషనర్లు 30 మంది ఉన్నారు. అంటే 350 మంది అధికారులు డీలర్ల వ్యాపారాలపై పన్ను మదింపు చేయవచ్చు. ఒక్కో అధికారి కనీసం నెలకు 5 కంపెనీల రికార్డులను ఆడిట్ చేసే వీలుంది. ఈ లెక్క ప్రకారం ప్రతి నెలా 1,500 వరకు చేయవచ్చు. అంటే ఆరు నెలలకు 9,000 ఆడిట్‌లు పూర్తి చేయొచ్చు. గతంలో ఉన్న పన్నుల శాఖ గణాంకాల ప్రకారం ఒక్కో ఆడిట్ ద్వారా సరాసరి రూ.2 లక్షల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
అంటే 9,000 ఆడిట్లు చేయగలిగితే ఇప్పటికే ఈ ఆరునెలల్లో దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదనపు ఆదాయం సమకూరేది. ఉదాహరణకు అక్టోబర్ 2016 నుంచి సెప్టెంబర్ 2017 వరకు 18,442 ఆడిట్లకు ఆథరైజేషన్ ఇవ్వగా, 18,132 ఆడిట్లు చేశారు. దీని ద్వారా రూ.37 కోట్లు పెనాల్టీ, 13 కోట్లు పన్ను, ఇంకో 58 కోట్లు కేంద్ర అమ్మకం పన్ను కింద వచ్చింది. అంటే దాదాపు 108 కోట్ల వరకు ఆడిట్‌ల ద్వారా ఆదాయం సమకూరింది. కానీ, స్క్రూటినీ విధానంలో ఇప్పటివరకు కనీసం 10 ఆడిట్లు కూడా పూర్తి కాలేదు. దీంతో ఆ మేరకు నష్టం వాటిల్లుతోందని, అక్కరకు రాని ఇన్వాయిస్‌ల అప్‌లోడ్ లాంటి ప్రక్రియలను ఆడిట్ నుంచి పక్కన పెట్టాలని పన్నుల శాఖ అధికారులే అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment