సాక్షి, హైదరాబాద్: తగిన అధ్యయనాలు, పరిశోధనలు చేయకుండానే మల్లన్నసాగర్ రిజర్వాయర్ డ్రాయింగ్‌లను ఆమోదించి, నిర్మాణం చేపట్టారని ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంత భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా చీలికలు, కదలికలు ఉన్నాయని.. భూకంపాలకు అవకాశం ఉందని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) తమ ప్రాథమిక నివేదికలో పేర్కొందని గుర్తు చేసింది.
రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ సిఫార్సులను పట్టించుకోకుండా.. తగిన సర్వేలు, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని తప్పుపట్టింది. ఒకవేళ భూకంపం వస్తే సమీప ప్రాంతాల ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడేళ్లుగా సమగ్ర ఆడిట్ నిర్వహించిన కాగ్.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలివీ..
సగం ఆయకట్టు మల్లన్నసాగర్ కిందే..
కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద జలాశయమైన మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీని కింద 10.3లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన మొత్తం ఆయకట్టులో ఇది సగానికికన్నా ఎక్కువ. 2017 అక్టోబర్‌లో మల్లన్నసాగర్ నిర్మాణాన్ని ప్రారంభించగా.. మార్చి 2022 నాటికి రూ.6,126 కోట్లు విలువైన పనులు చేశారు. గత సీఎం 2020 ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు.
అధ్యయనం జరపాలని కోరినా...
మల్లన్నసాగర్ ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. అయితే నిర్మాణం ప్రారంభించడానికి ముందే ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై (సైట్ స్పెసిఫిక్ సీస్మిక్ స్టడీస్) నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) వంటి సంస్థలతో అధ్యయనం జరిపించాలని సూచించారు. దీంతో సంబంధిత అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదల శాఖ హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. కానీ ఆ అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే.. 2017లో ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించింది. తర్వాత ఎన్‌జీఆర్‌ఐ నివేదిక ఇచ్చింది.
భూకంపాలకు అవకాశం ఉందంటూ..
దేశంలో భూకంపాల సంభావ్యత తక్కువగా ఉండే సీస్మిక్ జోన్–2లో తెలంగాణ ఉన్నా.. 1967లో కోయినాలో, 1993లో లాతూర్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపాలతో.. జోన్–2 ప్రాంతం కూడా భూకంపాలకు అతీతం కాదని తేలిందని ఎన్‌జీఆర్‌ఐ నివేదికలో పేర్కొంది. ఇటీవలికాలంలో ఒంగోలు, లాతూర్‌లో వచి్చన భూకంపాలతో తెలంగాణలోనూ ప్రకంపనలు వచ్చాయని, ఇక్కడి నిర్మాణాలకు స్వల్పంగా నష్టం జరిగిందని తెలిపింది.
1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచి్చన భూకంపంతో దక్షిణ భారతదేశం అంతా ప్రకంపనలు కనిపించాయని పేర్కొంది. 1983 జూన్‌లో హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని.. దాని ప్రభావం 200 కిలోమీటర్ల వరకు కనిపించిందని గుర్తు చేసింది. నాటి భూకంప కేంద్రం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇక్కడ 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే తట్టుకునేలా కట్టని (నాన్ ఇంజనీర్డ్) నిర్మాణాలు దెబ్బతింటాయని పేర్కొంది.
మల్లన్నసాగర్ ప్రాంతంలోని భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా మూడు జతల చీలికలు (3 సెట్స్ ఆఫ్ డామినెంట్ లీనమెంట్) ఉన్నాయని.. కదలికలు కూడా చోటుచేసుకుంటున్నాయని నివేదికలో తెలిపింది. వీటితో పడే ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పట్టించుకోకుండా, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో నీటిపారుదల శాఖ ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో మల్లన్నసాగర్ దృఢత్వం, భూకంపం వస్తే జరిగే విపత్తు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలేనని కాగ్ పేర్కొంది.
అత్యవసరంగా డ్రాయింగ్స్‌కు ఆమోదం
మల్లన్నసాగర్ నిర్మిత ప్రాంతంలో భూకంపాల సంభావ్యతపై అధ్యయనాలు లేవని.. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అత్యవసర పరిస్థితిలో రిజర్వాయర్ డ్రాయింగ్స్‌ను ఆమోదిస్తున్నామని సీడీఓ చీఫ్ ఇంజనీర్ పదేపదే పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ డ్రాయింగ్స్ సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, ఐఐటీ–రూర్కి’ల నుంచి ఈ డ్రాయింగ్స్‌కు తదుపరి ఆమోదం(వెట్టింగ్) తీసుకోవాలని కూడా సూచించారు.
కానీ నీటిపారుదల శాఖ సదరు సంస్థలతో వెట్టింగ్ చేయించినట్టు ఎలాంటి రికార్డులు లేవని కాగ్ పేర్కొంది. మల్లన్నసాగర్ నిర్మాణం 95శాతం పూర్తయ్యాక 2021 జనవరిలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలైన డిజైన్లు, స్థిరత్వ విశ్లేషణలు, డిజైన్లకు వెట్టింగ్ కోసం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం విడ్డూరమని స్పష్టం చేసింది. ఆ కమిటీ ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు జరపలేదని, ఎలాంటి నివేదిక సైతం ఇవ్వలేదని పేర్కొంది.
ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం
ఒకవేళ ఏదైనా విపత్తు సంభవించి మల్లన్నసాగర్ డ్యామ్ దెబ్బతింటే.. ప్రాణ, ఆస్తి నష్టం నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్’ ఓ నివేదిక సమర్పించింది. మల్లన్నసాగర్‌లో నీళ్లు నింపడానికి ముందే ఈ నివేదికలోని అంశాలకు అనుగుణంగా ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేయాలని సూచించింది. మల్లన్నసాగర్‌లో 2021 ఆగస్టు నుంచి నీళ్లు నింపడం ప్రారంభించగా.. ఇప్పటివరకు ఎమర్జెన్సీ ప్లాన్‌ను తయారు చేయలేదని కాగ్ ఆక్షేపించింది. ఒకవేళ్ల మల్లన్నసాగర్‌కు ప్రమాదం జరిగితే.. సమీప ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు ఉంటుందని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment