విజిలెన్స్‌ ఏం చెప్పింది? | Preliminary Report on Medigadda Barrage Collapse | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ ఏం చెప్పింది?

Published Thu, Feb 8 2024 4:05 AM | Last Updated on Thu, Feb 8 2024 3:35 PM

Preliminary Report on Medigadda Barrage Collapse - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఈఎన్సీ (ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌)లు, ఇతర అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తేలి్చంది. నిర్మాణ సమయంలో, తర్వాత చూపిన నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజీ విఫలమైందని స్పష్టం చేసింది. బ్యారేజీకి సంబంధించిన పనులన్నీ పూర్తికాకున్నా ‘వర్క్‌ కంప్లీట్‌ సర్టిఫికెట్‌’ఇచ్చారని.. కాంట్రాక్టర్‌కు బ్యాంక్‌ గ్యారంటీలను కూడా విడుదల చేశారని తప్పుపట్టింది.

మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులను కాంట్రాక్టు సంస్థ కాకుండా సబ్‌ కాంట్రాక్టర్‌ నిర్మించారని.. బిల్లుల చెల్లింపులు, ఖాతాల పరిశీలన ద్వారా దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్‌ విభాగం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. 

పని పూర్తికాకున్నా బ్యాంక్‌ గ్యారంటీల విడుదల 
బ్యారేజీ డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ 2020 ఫిబ్రవరి 2 నుంచి వర్తిస్తుందంటూ అదే ఏడాది నవంబర్‌ 11న ఈఎన్సీ లేఖ జారీచేశారు. పనులు పూర్తికాకున్నా బ్యాంకు గ్యారంటీలను నిర్మాణ సంస్థకు విడుదల చేశారు. సదరు ఈఎన్సీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

ఒప్పందంలోని నిబంధన 50 ప్రకారం కాంట్రాక్టర్‌ పనులు పూర్తిచేయలేదు. ఏటా వానాకాలం ముగిశాక డ్యామ్‌ ఆప్రాన్‌ ఏరియాలో ‘సౌండింగ్‌ అండ్‌ ప్రొబింగ్‌’ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. డ్యామ్‌ పర్యవేక్షకుడు (ఈఎన్సీ రామగుండం) అవి చేపట్టలేదు.  

నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి 
ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్స్, జియోలాజికల్‌ ఇన్వెస్టిగేషన్స్, అన్ని కాంక్రీట్‌ నిర్మాణాల దృఢత్వంపై పరిశీలన అత్యవసరం. బ్యారేజీ వైఫల్యానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిర్దేశిత పద్ధతిలో బ్యారేజీ నిర్మాణ పనులు జరగలేదు.

బ్లాక్‌–7 పియర్ల కింద ఉన్న పునాది (ర్యాఫ్ట్‌), ర్యాఫ్ట్‌ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్‌ పైల్స్‌ను నిర్దేశిత క్రమపద్ధతిలో నిర్మించలేదని వాటికి సంబంధించిన మెజర్‌మెంట్‌ బుక్స్, ఇతర రికార్డుల పరిశీలనలో తేలింది. ఉన్నతాధికారుల తనిఖీలు లేకుండానే చాలా ఉల్లంఘనలను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 

నిర్వహణ గాలికి వదిలేశారు 
2019 జూన్‌ 19న బ్యారేజీని నాటి సీఎం ప్రారంభించారు. నాటి నుంచి బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణను నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖల్లో ఎవరూ చేపట్టలేదు. నిజానికి తొలుత రూ.1,849.31 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ బాధ్యతలను నిర్మాణ సంస్థకు అప్పగించారు. తర్వాత ఈఎన్సీ సిఫార్సుల ఆధారంగా.. 2016 మార్చి 3న రూ.2,591 కోట్లకు, 2018 మే19న రూ.3,260 కోట్లకు, 2021 సెపె్టంబర్‌ 6న రూ.4,613 కోట్లకు అంచనాలను పెంచారు. 

ఒప్పందాలు, నిబంధనలను ఉల్లంఘించి.. 
ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, భద్ర తా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ నిర్మాణ 2019 సెపె్టంబర్‌ 10న మహదేవపూర్‌ డివిజన్‌–1 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ‘సబ్‌స్టాన్షియల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌’ను జారీచేశారు.

దానిపై సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ కౌంటర్‌ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు.. 2021 మార్చి 15న పనులు పూర్తయినట్టు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సర్టిఫికెట్‌ జారీచేశారు. కానీ ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి ఉత్తర్వులు జారీచేశారు.

బ్యారేజీ వైఫల్యానికి కారణాలివీ.. 
♦ బ్యారేజీ నిర్మాణ సమయంలో షీట్‌ పైల్స్‌ను పాతి నిర్మించిన కాఫర్‌ డ్యామ్‌ను నిర్మాణం పూర్తయ్యాక తొలగించాలి. కానీ కాఫర్‌ డ్యామ్‌ను, షీట్‌పైల్స్‌ను ఐదేళ్లు గడిచినా తొలగించలేదు. దీనితో గోదావరి నది సహజ ప్రవాహంపై ప్రభావం పడింది. 

♦  బ్యారేజీ పునాది (ర్యాఫ్ట్‌), దాని కింద భూగర్భంలో ‘కటాఫ్‌ వాల్స్‌’ నిర్మాణం సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రాయింగ్స్‌ ప్రకారం ర్యాఫ్ట్, కటాఫ్‌ వాల్స్‌ మధ్య కలయిక (కనెక్షన్‌)ను చేపట్టలేదని బ్యారేజీకి జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ర్యాఫ్ట్‌ కింద భూగర్భంలో ఎగువన, దిగువన షికెంట్‌ పైల్స్‌ను వేశారు. ఇందులో సెకండరీ పైల్స్‌ వేసేప్పుడు.. ప్రైమరీ పైల్స్‌ దెబ్బతిని పునాదుల కింది నుంచి ఇసుక కొట్టుకుపోయి ఉండవచ్చు. 7వ బ్లాకులోని 16–21 పియర్లకు వ చ్చిన పగుళ్లను పరిశీలిస్తే.. పునాదులు ఘోరంగా విఫలమైనట్టు అర్థమవుతోంది. 

♦  బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం కనిపించింది. బ్యారేజీని 2019–20లో ప్రారంభించాక దిగువన కాంక్రీట్‌ బ్లాకులతో ఏర్పాటు చేసిన అప్రాన్‌ ఏరియాకు ఎలాంటి తనిఖీలు, నిర్వహణ చేపట్టలేదు. వరదల్లో కాంక్రీట్‌ బ్లాకులు కొట్టుకుపోవడంతో బ్యారేజీ కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడానికి ఆస్కారం ఏర్పడింది. కాంక్రీట్‌ బ్లాకులను పునరుద్ధరించి మరమ్మతులు చేయాలని 2020–2023 మధ్య నీటిపారుదల శాఖ నాలుగు సార్లు కోరినా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు.  

♦  7వ బ్లాకులో 11 నుంచి 22 వరకు పియర్లు ఉండగా.. 18, 19, 20 పియర్లకు పగుళ్లు వచ్చాయి. వీటిలో 20వ పియర్‌ పునాదుల దాకా భారీగా దెబ్బతిన్నది. 

♦ డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ ప్రకారం ఏటా బ్యారేజీ నిర్వహణకు సంబంధించిన నివేదికను రూపొందించాలి. కానీ రాష్ట్ర డ్యామ్‌ సేఫ్టీ సంస్థ తయారు చేయలేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ విషయంలో డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement