కాళేశ్వరం బ్యారేజీల విషయంలో సర్కార్ పునరాలోచన
అయ్యర్ కమిటీ నివేదికపై అధ్యయనానికి ఇంజనీర్లతో మరో కమిటీ వేయాలని నిర్ణయం
ఆ కమిటీ సూచనల తర్వాతే ముందడుగు
మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా గ్యారంటీ లేదన్న అయ్యర్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులను సూచిస్తూ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తాజాగా మధ్యంతర నివేదిక సమర్పించినా.. మరమ్మతులు తక్షణమే ప్రారంభమయ్యే సూచన లు కనిపించడం లేదు. వానాకాలం ప్రారంభానికి నెల రోజులే మిగిలి ఉండగా, ఆలోగా అయ్యర్ కమిటీ సిఫారసు చేసిన తాత్కాలిక మరమ్మతులను పూర్తి చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీలోని 7వ నంబర్ బ్లాక్‌కు నిర్వహించే మరమ్మతులు తాత్కాలికమేని, మళ్లీ ఏదైనా జరగదని గ్యారెంటీ ఇవ్వలేమని అయ్యర్ కమిటీ తేల్చిచెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో కమిటీ నివేదికపై అధ్యయనం కోసం నీటి పారుదల శాఖలోని ఇంజనీర్లతో ఓ కమిటీని వేయా లని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీలకు మరమ్మతుల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
అయ్యర్ కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్నింటిని మాత్రమే వానాకాలం ప్రారంభానికి ముందు అమలు చేసేందుకు అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. కమిటీ సూచించిన పనులకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను తయారు చేసి ఆమోదం తీసుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆలోగా వర్షాకాలం ప్రారంభం అవుతుందని చెపుతున్నాయి. అయ్యర్ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించిన తర్వాతే బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను నిర్వహి స్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
మేడిగడ్డ బ్యారేజీ భవితవ్యంపై అయ్యర్ కమిటీ ప్రశ్నలు రేకెత్తించిన నేపథ్యంలో మరమ్మతులు చేపట్టిన తర్వాత ఏదైనా అనుకోని సంఘటన జరిగితే దానికి బాధ్యత వహించాల్సి వస్తుందనే భావనతో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. కాగా, మరో వారం రోజులు గడిచిన తర్వాతే మరమ్మతులు చేపట్టే అంశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment