‘ఉన్నతం'గా దోచేస్తున్నారు ! | Showcause Notice to Commercial Taxes Department | Sakshi
Sakshi News home page

‘ఉన్నతం'గా దోచేస్తున్నారు !

Published Wed, Mar 6 2019 10:46 AM | Last Updated on Wed, Mar 6 2019 10:46 AM

Showcause Notice to Commercial Taxes Department - Sakshi

వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం

సాక్షి సిటీబ్యూరో: వ్యాపారుల క్రయ విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచి వారి ద్వారా జరిగే వ్యాపారాలకు ప్రభుత్వం నిర్దేశించిన పన్నును  వసూలు చేయాల్సిన వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులే దానికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వ అదాయాన్ని పెంచాల్సిన కొందరు అధికారులు వ్యాపారులతో కుమ్మకై  ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. వాణిజ్య పన్ను చట్టాలను ఆసరాగా తీసుకొని వ్యాపారులకు ముందుగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసి అనంతరం సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారు. దీంతో గ్రేటర్‌ పరిధిలోని ఏడు డివిజన్లలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయ లు అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో అధికారుల అక్రమ బాగోతంపై ‘సాక్షి’ ప్ర త్యేక కథనం..

వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పంజగుట్ట డివిజన్, సోమాజిగూడ సర్కిల్‌లోని ఓ ప్రముఖ బంగారు నగల దుకాణానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలపై ఆడిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.23 కోట్లు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. అయితే సదరు వ్యాపారి తన పలుకుబడిని వినియోగించి ఉన్నత అధికారులతో ఒప్పందం చేసుకుని కేవలం రూ. 4 కోట్లు మాత్రమే చెల్లించా డు. ఇందుకు గాను ఉన్నతాధికారులకు రూ.కోట్లల్లో ముడుపులు అందినట్లు సమాచారం.
అబిడ్స్‌ డివిజన్, గౌలిగూడ సర్కిల్‌లోని ఓ రెడీమెడ్‌ షోరూంకు సంబంధించి షాప్‌లపై దాడులు నిర్వహించిన శాఖ అధికారులు రూ. 16 కోట్ల పన్ను చెల్లించనందుకుగాను జరిమానా విధించారు. సదరు వ్యాపారి ఉద్యోగుల అండదండలతో సదరు శాఖ ఉన్నతాధికారి సంప్రదించడంతో అతని కేసును పక్కన పెట్టేశారు.
అబిడ్స్‌ డివిజన్, బషీర్‌బాగ్‌ సర్కిల్‌ పరిధిలోని ఓ భవన నిర్మాణ సంస్థకు సంబంధించి ఆడిట్‌ నిర్వహించిన సర్కిల్‌ అధికారులు రూ. 3 కోట్లు పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ షాకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే సదరు సంస్థ యజమాని కేంద్ర కార్యాలయంలోని ఓ అధికారిని కలిసి సెటిల్‌మెంట్‌ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో కేసు రూ.10 లక్షల్లో సెటిల్‌ కానున్నట్లు తెలిసింది. కేవలం ఈ మూడు డివిజన్లలోనే కాకుండా గ్రేటర్‌పరిధిలోని చార్మినార్, బేగంపేట్, సరూర్‌నగర్, సికింద్రాబాద్‌తో పాటు హైదారాబాద్‌ రూరల్‌ ప్రాంతాల్లోనూ అధికారుల అక్రమాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రూ. కోట్లల్లో గండి పడుతోంది.

నిబంధనలకు నీళ్లు
ప్రభుత్వ అధికారులు తాము పనిచేస్తున్న శాఖపరమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది మాత్రం నిబంధనలు పట్టించుకోవడం లేదు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారనే ఆరోపణలున్నాయి.  వ్యాపార సంస్థలు, షాప్‌లపై తనిఖీలు నిర్వహించే అధికారులు వ్యాపార లావాదేవీల సమాచారం నిమిత్తం 304 నోటీసులు జారీ చేస్తారు. ఇందులో సేల్స్,  కొనుగోలు బిల్లులు, స్టాక్‌తో పాటు లాభ నష్టాలకు సంబందించిన వివరాలు అందజేయాలని సూచిస్తారు. సదరు వ్యాపారి అకౌంట్స్‌ వివరాలు అందజేయకపోతే మూడుసార్లు 310 నోటీసులు జారీ చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే అధికారులు అందుకు విరుద్ధంగా 305 ఏ చట్టం ద్వారా షోకాజ్‌ నోటీసులు జారీ చేసి భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులను బెదిరిస్తున్నారు. సదరు వ్యాపారిని నేరుగా కార్యాలయానికి పిలిపించుకుని అతడితో బేరం కుదిరాక రూ.కోట్లలో ఉన్న మొత్తాన్ని రూ. లక్షలకు తగ్గించి 305 ఆర్డర్‌ ఇస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఉన్నా వారికి అందాల్సిన వాటా అందుతుండటంతో వారు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి
వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వైఖరి కారణం గా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వస్తోంది. వాణిజ్య పన్నుల శాఖను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నందున అధికారుల అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వ్యాపార సంఘాల నేతలు కోరుతున్నారు.

అక్రమాలకు పాల్పడితేకఠిన చర్యలు
డివిజన్‌ పరిధిలో సీటీఓల ద్వారా జారీ అయ్యే ప్రతి షోకాజ్‌ నోటీసుకు సంబంధించిన పన్నులు కచ్చితంగా వసూలు చేస్తాం. 304 నోటీసులతో వ్యాపారులు స్పందించకపోతే మూడు సార్లు 310 నోటీసులు ఇస్తున్నాం. అనంతర 305 ఏ నోటీసులు జారీ చేస్తున్నాం. వ్యాపారుల లావాదేవీలకు అనుగుణంగా ప్రభుత్వానికి రావాల్సిన అదాయాన్ని పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నాం. కింది స్థాయి అధికారులు  అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.– కె. సీతాలక్ష్మి, జాయింట్‌ కమిషనర్‌ అబిడ్స్‌ డివిజన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement