రూటు మారని చెక్‌పోస్టులు
సరిహద్దు చెక్‌పోస్టులతో వాణిజ్య పన్నుల శాఖ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతోంది. ఒకే మార్గంలో ఒక బోర్డర్ చెక్‌పోస్టు దాటిన తరువాత జిల్లా మధ్యలో మరో బోర్డర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ అనధికార చెక్‌పోస్టుకు అధికారులు టార్గెట్‌లు విధించడం వింతగా ఉందని ఆ శాఖ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు.
విజయవాడ(వన్‌టౌన్) : రాష్ట్రం విడిపోయిన తరువాత కృష్ణా, ఖమ్మం జిల్లాలు రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. కృష్ణాజిల్లాలో తిరువూరు వద్ద వాణిజ్య పన్నుల శాఖ అధికారికంగా ఒక చెక్‌పోస్ట్‌ను నిర్వహిస్తుంది. తెలంగాణా ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోకి వచ్చే వాహనాలను అక్కడ తనిఖీలు నిర్వహిస్తారు. ఇదే రూట్‌లో కొండపల్లి బాలకృష్ణా సినిమా హాలు వద్ద వాణిజ్య పన్నుల శాఖ మరో సరిహద్దు చెక్‌పోస్ట్ పేరుతో తనిఖీలు చేయడం విమర్శలకు దారితీస్తోంది.
తిరువూరులో బోర్డర్ చెక్‌పోస్ట్‌లో తనిఖీ చేసిన వాహనాలు అదే దారిలో ఇబ్రహీంపట్నంకు వచ్చే క్రమంలో కొండపల్లి వద్ద వారికి ఈ బోర్డర్ చెక్‌పోస్టు కనిపిస్తోంది. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారికంగా నిర్వహిస్తోంది. ఒకే రహదారిలో రెండు బోర్డర్ చెక్‌పోస్టులు ఏ విధంగా పెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన మూడు మాసాలకు అధికారులు రెవెన్యూ శాఖ వద్ద స్థలం తీసుకుని చెక్‌పోస్టు ఏర్పాటు చేయడంతోపాటు ఏసీటీవో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అటెండర్ విధులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి లక్షల వ్యయం అవుతున్నా ఆశించినంత ఆదాయం మాత్రం రావడం లేదని సమాచారం. అయితే ఈ చెక్‌పోస్టు వివరాలు వాణిజ్య పన్నుల శాఖ వెబ్‌సైట్‌లోనూ లేకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయి.
నిరుపయోగంగా చెక్‌పోస్టు
తెలంగాణ రాష్ట్రంలోంచి వచ్చే వాహనాలు కొండపల్లి చెక్‌పోస్టుకు రాకుండానే రాష్ట్రంలోకి వెళ్లి పోవచ్చని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. తిరువూరు నుంచి నూజివీడు మీదుగా హనుమాన్‌జంక్షన్‌కు వెళ్లిపోవచ్చు. కొండపల్లిలోకి ప్రవేశించిన తరువాత కూడా మరోమార్గంలో విజయవాడ జాతీయ రహదారి మీదకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ చెక్‌పోస్టు వల్ల ఉపయోగం లేదంటున్నారు.
తొలగించమని ప్రభుత్వానికి లేఖ రాశాం
రాష్ట్ర విభజనతో గూగుల్ మ్యాప్ సహాయంతో కొండపల్లి చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఖమ్మం నుంచి కొన్ని వాహనాలు తిరువూరు మీదుగా కొండపల్లి రావచ్చని భావించి దీనిని ఏర్పాటు చేశారు. అయితే సరుకు రవాణా చేసే భారీ వాహనాలన్నీ తిరువూరు చెక్‌పోస్టు మీదు గా తప్ప ఇతర మార్గాల్లో రావడం సాధ్యపడదు. దీంతో ఈ చెక్‌పోస్టు పెద్దగా ఉపయోగపడటం లేదు. ప్రభుత్వం చెక్‌పోస్టు కేటాయిం చినందున సిబ్బందిని కేటాయించి తనిఖీలు చేయిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తొలగిస్తాం.
- కిరణ్,
అసిస్టెంట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ