Czech Post
-
రూటు మారని చెక్‌పోస్టులు
సరిహద్దు చెక్‌పోస్టులతో వాణిజ్య పన్నుల శాఖ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతోంది. ఒకే మార్గంలో ఒక బోర్డర్ చెక్‌పోస్టు దాటిన తరువాత జిల్లా మధ్యలో మరో బోర్డర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ అనధికార చెక్‌పోస్టుకు అధికారులు టార్గెట్లు విధించడం వింతగా ఉందని ఆ శాఖ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ(వన్‌టౌన్) : రాష్ట్రం విడిపోయిన తరువాత కృష్ణా, ఖమ్మం జిల్లాలు రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. కృష్ణాజిల్లాలో తిరువూరు వద్ద వాణిజ్య పన్నుల శాఖ అధికారికంగా ఒక చెక్‌పోస్ట్‌ను నిర్వహిస్తుంది. తెలంగాణా ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోకి వచ్చే వాహనాలను అక్కడ తనిఖీలు నిర్వహిస్తారు. ఇదే రూట్లో కొండపల్లి బాలకృష్ణా సినిమా హాలు వద్ద వాణిజ్య పన్నుల శాఖ మరో సరిహద్దు చెక్‌పోస్ట్ పేరుతో తనిఖీలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. తిరువూరులో బోర్డర్ చెక్‌పోస్ట్‌లో తనిఖీ చేసిన వాహనాలు అదే దారిలో ఇబ్రహీంపట్నంకు వచ్చే క్రమంలో కొండపల్లి వద్ద వారికి ఈ బోర్డర్ చెక్‌పోస్టు కనిపిస్తోంది. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారికంగా నిర్వహిస్తోంది. ఒకే రహదారిలో రెండు బోర్డర్ చెక్‌పోస్టులు ఏ విధంగా పెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన మూడు మాసాలకు అధికారులు రెవెన్యూ శాఖ వద్ద స్థలం తీసుకుని చెక్‌పోస్టు ఏర్పాటు చేయడంతోపాటు ఏసీటీవో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అటెండర్ విధులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి లక్షల వ్యయం అవుతున్నా ఆశించినంత ఆదాయం మాత్రం రావడం లేదని సమాచారం. అయితే ఈ చెక్‌పోస్టు వివరాలు వాణిజ్య పన్నుల శాఖ వెబ్సైట్లోనూ లేకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. నిరుపయోగంగా చెక్‌పోస్టు తెలంగాణ రాష్ట్రంలోంచి వచ్చే వాహనాలు కొండపల్లి చెక్‌పోస్టుకు రాకుండానే రాష్ట్రంలోకి వెళ్లి పోవచ్చని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. తిరువూరు నుంచి నూజివీడు మీదుగా హనుమాన్జంక్షన్కు వెళ్లిపోవచ్చు. కొండపల్లిలోకి ప్రవేశించిన తరువాత కూడా మరోమార్గంలో విజయవాడ జాతీయ రహదారి మీదకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ చెక్‌పోస్టు వల్ల ఉపయోగం లేదంటున్నారు. తొలగించమని ప్రభుత్వానికి లేఖ రాశాం రాష్ట్ర విభజనతో గూగుల్ మ్యాప్ సహాయంతో కొండపల్లి చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఖమ్మం నుంచి కొన్ని వాహనాలు తిరువూరు మీదుగా కొండపల్లి రావచ్చని భావించి దీనిని ఏర్పాటు చేశారు. అయితే సరుకు రవాణా చేసే భారీ వాహనాలన్నీ తిరువూరు చెక్‌పోస్టు మీదు గా తప్ప ఇతర మార్గాల్లో రావడం సాధ్యపడదు. దీంతో ఈ చెక్‌పోస్టు పెద్దగా ఉపయోగపడటం లేదు. ప్రభుత్వం చెక్‌పోస్టు కేటాయిం చినందున సిబ్బందిని కేటాయించి తనిఖీలు చేయిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తొలగిస్తాం. - కిరణ్, అసిస్టెంట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ -
చెట్టు కిందే చెక్‌పోస్టు!
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టుల దుస్థితి ► చెట్ల నీడ, దాబాలే అధికారులు, సిబ్బందికి ఆవాసం ► తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో వాణిజ్య పన్నుల శాఖకు 7 చెక్‌పోస్టులు ► వీటిల్లో 294 మంది ఉద్యోగులు అవసరం.. 70 మందికి మించని స్థితి ► చెక్‌పోస్టులకు సర్కారు జాగా లేదు.. లీజుల ఫైలుకు మోక్షం లేదు ► ఒక్కో చెక్‌పోస్టుకు రూ. 3 కోట్లు కేటాయించినా ఖర్చు చేయని వైనం ► యథేచ్ఛగా సాగుతున్న అక్రమ సరుకుల రవాణా హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోకలు సాగించే సరుకు రవాణా వాహనాలను తనిఖీ చేసేందుకు ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్రం ఏర్పాటై దాదాపు ఏడాది దగ్గరపడుతున్నా.. జాతీయ రహదారితో పాటు రాష్ట్రస్థాయి రహదారి చెక్‌పోస్టుల్లో కూడా ఎక్కడా ఒక్క భవనాన్ని నిర్మించలేదు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న రోడ్ల పక్కన అవసరమైన ప్రభుత్వ భూమి లేనందున కనీసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూసేకరణ అయినా చేయలేదు. దీంతో సంబంధిత అధికారులు రోడ్లపక్కన ఒక కారు పెట్టుకొని చెట్టు నీడలో కుర్చీలు వేసుకొని కూర్చోవడమో, సమీపంలోని దాబాలు, ఇళ్లలో సేదతీరడమో చేస్తున్నారు. సరుకులతో కూడిన వాహనాలు రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్నా... ఆపేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. సరుకుల వాహనాన్ని చూసి హైవే మీదకు వెళ్లి అధికారులు చేయి ఊపిన ప్పుడు ఆపితే తనిఖీలు, లేదంటే వెళ్లిపోవడమే. దీంతో అక్రమ సరుకు వాహనాలు కూడా దొంగ వేబిల్లులతో యథేచ్ఛగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఐదెకరాలు అవసరం: నిబంధనల ప్రకారం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు నిర్మాణానికి ఐదెకరాల భూమి అవసరం. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు నిర్మాణానికైతే 10 ఎకరాలు కావాలి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో కనీసం రెండెకరాల స్థలంలో సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు రైతుల నుంచి భూమిని లీజు పద్ధతిన తీసుకొని... జాతీయ రహదారుల్లోని భూమికి నెలకు రూ.65,000, రాష్ట్ర రహదారుల్లో రూ.45వేలు అద్దె చెల్లించేలా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇది జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అయితే భూసేకరణ జరిపి శాశ్వత చెక్‌పోస్టులు నిర్మించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. ఈ లెక్కన అప్పటివరకు ఎండ, వానల్లోనే అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచే యాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బందీ కరువే: వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని ప్రతి చెక్‌పోస్టులో ఒక డీసీటీవోతో పాటు షిఫ్టుల వారీగా ముగ్గురు ఏసీటీవోలు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఉండాలి. కానీ కొత్తగా ఏర్పాటైన చెక్‌పోస్టుల్లో ఎక్కడా డీసీటీవో లేడు. ఏసీటీవోల ఆధ్వర్యంలో ఒకరిద్దరు సహాయకులతో బండి నడిపిస్తున్నారు. చెక్‌పోస్టులకు అవసరమైన సిబ్బంది లేకపోవడం ఒక ఎత్తయితే... ఉన్నా కూర్చునేందుకు నీడ కూడా లేకపోవడం గమనార్హం. ఇక కర్నూలు సమీపంలోని తుంగభద్ర వద్ద, నల్లగొండ జిల్లా కోదాడ వద్ద రాకపోకలు సాగించే రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉండాలి. కానీ సిబ్బంది లేక ఏపీ నుంచి వచ్చేదారిలోనే తాత్కాలిక చెక్‌పోస్టులు పెట్టారు. ఉండాల్సిన సిబ్బంది 2 - రెండు జాతీయ రహదారులపై సీటీవోలు 7 - డీసీటీవోలు 53 - సీనియర్ అసిస్టెంట్లు 53 - ఏసీటీవోలు 77- జూనియర్ అసిస్టెంట్లు 102 - ఆఫీస్ సబార్డినేట్లు 294 - మొత్తంగా ఏడు చెక్‌పోస్టుల్లో మూడు షిఫ్టులకు అవసరమైన అధికారులు, సిబ్బంది 70 -ప్రస్తుతం ఉన్న సిబ్బంది సుమారు -
హరిహరీ....
=నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌పై మళ్లీ ఏసీబీ దాడులు =48,150 రూపాయలు స్వాధీనం =తీరు మార్చుకోని సిబ్బంది =కఠిన చర్యలు లేకపోవడమే కారణం సరిగ్గా ఈ నెల 21న అక్కడ ఏసీబీ దాడులు జరిగాయి. ఐదుగురు అధికారుల వద్ద భారీ మొత్తంలో అక్రమ సొమ్ము పట్టుబడింది. పది రోజులూ గడవక ముందే ఏసీబీ అధికారులు మళ్లీ దాడులు చేశారు. అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సొమ్ముతో పట్టుబడిన అధికారుల్లో ముగ్గురు ఈ నెల 21న నాటి దాడుల్లోనూ నిందితులు కావడం గమనార్హం. చర్యలు లేకపోవడంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుడిపాల, న్యూస్‌లైన్: గుడిపాల మండలంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ఉంది. ఇక్కడ ఉప వాణిజ్యపన్నులశాఖ అధికారి, సహాయ వాణిజ్య పన్నులశాఖ అధికారి, మోటారు వాహనాల తనిఖీ అధికారి, సహాయ మోటారు వాహనాల తనిఖీ అధికారి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌శాఖకు సంబంధించి ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, అటవీశాఖ సిబ్బంది తదితరులు విధులు నిర్వహిస్తున్నారు. తమిళనాడు సరిహద్దులోని ఈ చెక్‌పోస్ట్ మీదుగా నిత్యం వేలాది వాహనాలు వెళుతుంటాయి. ఇక్కడ అక్రమ వసూళ్లు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఈ నెల 21న దాడులు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏసీటీవోలు సురేష్, గోపాల్, పళణి, సివిల్ సప్లయిస్ డెప్యూటీ తహశీల్దార్ రహీముద్దీన్‌ఖాన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,02,690 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌పై ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయం లో మరోమారు దాడులు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏసీటీవోలు గణేష్, సురేష్, సివిల్ సప్లయిస్ డెప్యూటీ తహశీల్దార్ రహీముద్దీన్‌ఖాన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి రశీదులూ లేకుండా ఉన్న 48,150 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, కిషోర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళారులదే రాజ్యం ఈ చెక్‌పోస్ట్‌లో దళారులదే ఇష్టారాజ్యంగా మారుతోంది. ఏడు శాఖలకు సంబంధించి 30 మంది వరకు దళారులు ఉన్నారు. వీరు అధికారుల్లా వ్యవహరిస్తున్నారు. లారీ డ్రైవర్లను దుర్భాషలాడుతూ అయిన కాడికి లాక్కుంటున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడే వారు వీరిని సంప్రదిస్తే చాలు అన్ని పనులూ అయిపోతున్నాయి. దిష్టి తగిలిందట.. చెక్‌పోస్ట్‌లో దాడుల తర్వాత ఏసీబీ అధికారులు వెళ్లిపోయారు. అనంతరం సిబ్బంది ప్రయివేటు వ్యక్తులను పిలిపించి చెక్‌పోస్ట్‌లోని అన్ని గదులనూ శుభ్రం చేయించారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. తమపై ఏసీబీ అధికారుల చూపు పడకుండా ఉండాలని పూజలు చేయడం గమనార్హం. దీనిని బట్టి సిబ్బంది తీరు మార్చుకోవడం లేదని స్పష్టమవుతోంది. కఠిన చర్యలు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది. -
స్తంభించిన వాణిజ్య సేవలు!
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో 39 రోజులుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో వాణిజ్య సేవలు పూర్తి గా స్తంభించాయి. జూలై 30న కేంద్రప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నాటి నుంచి జిల్లాలోని ప్రతి ఉద్యోగి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగం గా జిల్లా వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు, సిబ్బంది సైతం కార్యాలయాలకు తాళాలు వేసి ప్రత్యక్ష అందోళనలో పాల్గొంటున్నారు. దీంతో వ్యాపార సంస్థల నూతన రిజిస్ట్రేషన్లు, నెలవారి పన్నుల వసూళ్లు నిలచిపోయాయి. దీనికితోడు జిల్లాలో అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సైతం మూసివేశారు. అక్రమరవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రతినెలా జిల్లా వాణిజ్యశాఖ ద్వారా కనీసం సుమారు రూ.20 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతుంది. ఉద్యోగుల సమ్మె ప్రభావంతో జిల్లాలోని నరహరిపేట, చిత్తూరులోని ఠాణా చెక్‌పోస్టు, నాగలాపురం, పలమనేరు, తడుకు పేట చెక్ పోస్టులు పూర్తిగా మూతపడ్డాయి. వీటితో పాటు అధికారులు జరిపే మహాచెక్లు ఆగిపోవటంతో ఈ శాఖకు రావలసిన ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడింది. దీంతో జిల్లా నుంచి ఎలాంటి తనిఖీలు లేకుండా గ్రానైట్, ఇతర నిత్యావసర వస్తువులు రాష్ట్ర సరిహద్దులు దాటి యథేచ్ఛగా వెళుతున్నాయి. నెలలో కేవలం ఉద్యోగుల తనిఖీలు లేకపోవడంతో గడచిన 35 రోజుల్లో ప్రభుత్వం సుమారు రూ.25 కోట్లు నష్టపోయింది. పట్టు వీడని ఉద్యోగులు జిల్లాలో సమ్మె చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, సిబ్బంది కేంద్రం దిగివచ్చి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని అంటున్నారు. రాష్ట్ర విభజన వల్ల తమ పిల్లల భవిష్యత్తు నష్టపోతుందంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ ప్రాణాలైనా అర్పిస్తాం, కాని సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను ఎటువంటిపరిస్థితుల్లోనూ వదులుకునేందుకు సిద్ధంగా లేమంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. -
బందోమస్తు
హైకోర్టులో శుక్రవారం ఉద్రిక్తత.. శనివారం ఇటు ఎల్బీ స్టేడియంలో సమైక్యాంధ్ర ఉద్యోగుల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’.. అటు అడ్డుకుంటామంటూ హెచ్చరికలు.. తెలంగాణ బంద్.. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు. శివార్ల చుట్టూ చెక్‌పోస్టులు.. బందోబస్తు గుప్పిట నగరం నడిబొడ్డు ప్రాంతం.. అంతటా ఉత్కంఠ, ఉద్విగ్నత నెలకొన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో ఉత్కంఠ.. శుక్రవారం రాష్ట్ర హైకోర్టులో ఉద్రిక్తత.. శనివారం ఏపీఎన్జీఓల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’..అడ్డుకుంటామనే హెచ్చరికలు.. తెలంగాణ బంద్.. ఈ పరిణామాల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరమంతటా ఉత్కంఠ నెలకొంది. సభా వేదిక ఎల్బీ స్టేడియం ఉన్న మధ్య మండలంతో పాటు రాజధాని మొత్తాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. నగర పోలీసులు, రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి 13 వేల మందికి పైగా సిబ్బందిని శనివారం తెల్లవారుజాము నుంచే నగరవ్యాప్తంగా మోహరించనున్నారు. స్టేడియం పరిసరాల్లోనే 3 వేల మంది ఉంటారు. లోపలకు దారితీసే కీలక మార్గాలతో పాటు స్టేడియం మొత్తాన్నీ కేంద్ర బలగాలకు అప్పగించారు. నగరంలోని ఒక్కో జోన్‌కు ఒక్కో సీనియర్ ఐపీఎస్ అధికారి ఇన్చార్జిగా ఉంటారు. మరోపక్క స్టేడియం చుట్టూ ఉన్న రహదారుల్లో ఒక్కో రూట్‌కు ఒకో ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా పకడ్బందీ నిఘా, పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సభను అడ్డుకోవాలని, గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్న ఆందోళనకారుల కోసం లాడ్జిలతో పాటు అనేక ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టారు. స్టేడియం చుట్టపక్కల ఉన్న నాలుగు మార్గాలను పూర్తిగా మూసేశారు. 40 ప్రాంతాల్లో బారికేడ్లు, కంచె ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో నిఘా బృందాలు డేగకన్నేసి ఉంచుతాయి. కమిషనరేట్‌లోని సిబ్బంది అంతా కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశించారు. కూడళ్లపై నిఘాకు ట్రాఫిక్ కెమెరాల వినియోగం ట్రాఫిక్ స్థితిగతుల పరిశీలనకు నగరంలోని 95 ప్రాంతాల్లో ఉన్న సర్వైయ్లెన్స్ కెమెరాలను శనివారం నిఘా కోసమూ వినియోగిస్తారు. వీటన్నింటినీ బషీర్‌బాగ్ పోలీసు కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో అనుసంధానించారు. ఈ కెమెరాల ద్వారా ఇతర ప్రాంతాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలపై కన్నేసి ఉంచుతారు. కూడళ్లలో కదలికలను కనిపెడతారు. ఇందుకు సీసీసీలో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వీరు అటు ప్రధాన కంట్రోల్ రూమ్‌తో పాటు క్షేత్రస్థాయి సిబ్బందితో సంప్రదింపులు జరుపుతుంటారు. నగరంలోని ప్రతి చెక్‌పాయింట్ వద్దా వీడియో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో వినియోగానికి స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను, అనుమానితుల కదలికలను కనిపెట్టటానికి షాడో పార్టీలు ఏర్పాటు చేశారు. మూడంచెల కార్డన్ ఏరియా... సరైన అనుమతులు లేకుండా, పోలీసుల కన్నుగప్పి ఎల్బీ స్టేడియం సమీపంలోకి దూసుకువెళ్లాలని ప్రయత్నించే వారిని కట్టడి చేయడానికి మూడంచెల కార్డన్ (నియంత్రణ) ఏరియాలు ఏర్పాటు చేశారు. స్టేడియానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించారు. 35 చెక్‌పోస్టుల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వీరిలో ట్రాఫిక్ విభాగం అధికారులూ ఉన్నారు. ముందజాగ్రత్తగా స్టేడియం చుట్టపక్కల పరిసరాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిషేధించారు. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాటిని మళ్లిస్తారు. ఎల్బీ స్టేడియానికి దారితీసే ఖైరతాబాద్, నారాయణగూడ, బషీర్‌బాగ్, తెలుగుతల్లి, మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్లపై రాకపోకల్నీ నిషేధించాలని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచే బారికేడ్లు, బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. నగరానికి రైళ్లు, బస్సుల ద్వారా వచ్చే ఏపీఎన్జీఓలకు ఇబ్బందులు లేకుండా నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్‌ల్లోని రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్ తదితర బస్టాండ్లతో పాటు వీటి నుంచి స్టేడియం వరకు ఉన్న రూట్లపైనా నిఘా ఉంచి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.