చెట్టు కిందే చెక్‌పోస్టు!
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టుల దుస్థితి
► చెట్ల నీడ, దాబాలే అధికారులు, సిబ్బందికి ఆవాసం
► తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో వాణిజ్య పన్నుల శాఖకు 7 చెక్‌పోస్టులు
► వీటిల్లో 294 మంది ఉద్యోగులు అవసరం.. 70 మందికి మించని స్థితి
► చెక్‌పోస్టులకు సర్కారు జాగా లేదు.. లీజుల ఫైలుకు మోక్షం లేదు
► ఒక్కో చెక్‌పోస్టుకు రూ. 3 కోట్లు కేటాయించినా ఖర్చు చేయని వైనం
► యథేచ్ఛగా సాగుతున్న అక్రమ సరుకుల రవాణా
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోకలు సాగించే సరుకు రవాణా వాహనాలను తనిఖీ చేసేందుకు ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్రం ఏర్పాటై దాదాపు ఏడాది దగ్గరపడుతున్నా.. జాతీయ రహదారితో పాటు రాష్ట్రస్థాయి రహదారి చెక్‌పోస్టుల్లో కూడా ఎక్కడా ఒక్క భవనాన్ని నిర్మించలేదు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న రోడ్ల పక్కన అవసరమైన ప్రభుత్వ భూమి లేనందున కనీసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూసేకరణ అయినా చేయలేదు. దీంతో సంబంధిత అధికారులు రోడ్లపక్కన ఒక కారు పెట్టుకొని చెట్టు నీడలో కుర్చీలు వేసుకొని కూర్చోవడమో, సమీపంలోని దాబాలు, ఇళ్లలో సేదతీరడమో చేస్తున్నారు. సరుకులతో కూడిన వాహనాలు రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్నా... ఆపేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. సరుకుల వాహనాన్ని చూసి హైవే మీదకు వెళ్లి అధికారులు చేయి ఊపిన ప్పుడు ఆపితే తనిఖీలు, లేదంటే వెళ్లిపోవడమే. దీంతో అక్రమ సరుకు వాహనాలు కూడా దొంగ వేబిల్లులతో యథేచ్ఛగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయన్న విమర్శలున్నాయి.
ఐదెకరాలు అవసరం: నిబంధనల ప్రకారం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు నిర్మాణానికి ఐదెకరాల భూమి అవసరం. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు నిర్మాణానికైతే 10 ఎకరాలు కావాలి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో కనీసం రెండెకరాల స్థలంలో సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు రైతుల నుంచి భూమిని లీజు పద్ధతిన తీసుకొని... జాతీయ రహదారుల్లోని భూమికి నెలకు రూ.65,000, రాష్ట్ర రహదారుల్లో రూ.45వేలు అద్దె చెల్లించేలా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇది జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అయితే భూసేకరణ జరిపి శాశ్వత చెక్‌పోస్టులు నిర్మించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. ఈ లెక్కన అప్పటివరకు ఎండ, వానల్లోనే అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచే యాల్సిన పరిస్థితి నెలకొంది.
సిబ్బందీ కరువే: వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని ప్రతి చెక్‌పోస్టులో ఒక డీసీటీవోతో పాటు షిఫ్టుల వారీగా ముగ్గురు ఏసీటీవోలు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఉండాలి. కానీ కొత్తగా ఏర్పాటైన చెక్‌పోస్టుల్లో ఎక్కడా డీసీటీవో లేడు. ఏసీటీవోల ఆధ్వర్యంలో ఒకరిద్దరు సహాయకులతో బండి నడిపిస్తున్నారు. చెక్‌పోస్టులకు అవసరమైన సిబ్బంది లేకపోవడం ఒక ఎత్తయితే... ఉన్నా కూర్చునేందుకు నీడ కూడా లేకపోవడం గమనార్హం. ఇక కర్నూలు సమీపంలోని తుంగభద్ర వద్ద, నల్లగొండ జిల్లా కోదాడ వద్ద రాకపోకలు సాగించే రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉండాలి. కానీ సిబ్బంది లేక ఏపీ నుంచి వచ్చేదారిలోనే తాత్కాలిక చెక్‌పోస్టులు పెట్టారు.
ఉండాల్సిన సిబ్బంది
2 - రెండు జాతీయ రహదారులపై సీటీవోలు
7 - డీసీటీవోలు
53 - సీనియర్ అసిస్టెంట్లు
53 - ఏసీటీవోలు
77- జూనియర్ అసిస్టెంట్లు
102 - ఆఫీస్ సబార్డినేట్లు
294 - మొత్తంగా ఏడు చెక్‌పోస్టుల్లో మూడు షిఫ్టులకు అవసరమైన అధికారులు, సిబ్బంది
70 -ప్రస్తుతం ఉన్న సిబ్బంది సుమారు