వీధికెక్కిన వసూళ్ల పర్వం
Published Tue, Dec 27 2016 1:48 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
జంగారెడ్డిగూడెం : జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో వసూళ్ల పర్వం వీధికెక్కింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వసూళ్ల వ్యవహారంపై విచారణ నిర్వహిస్తున్న తన విధులకు ఆటంకపర్చడంతోపాటు వసూళ్ల కేసును నీరుగార్చాలని ఒత్తిడి తెస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ఆ శాఖ సర్కిల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో వేళ్లూనుకున్న వసూళ్ల వ్యవహారాలు, ఫిర్యాదులొస్తే నీరుగార్చేందుకు అధికారుల్లో కొందరు ఎంతకైనా తెగిస్తారనే విషయాల్ని మరోసారి వెలుగులోకి తెచ్చిన ఈ ఉదంతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలోని వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టు వద్ద నిత్యం పెద్దఎత్తున అనధికారిక వసూళ్లు సాగుతున్నాయి. ఇక్కడి దందా వెలుగులోకి రావడంతో.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా జంగారెడ్డిగూడెం సర్కిల్ వాణిజ్య పన్నుల అధికారి (సీటీవో) వి.కేదారేశ్వరరావుకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఆయన విచారణ చేపట్టగా.. వ్యవహారాన్ని నీరుగార్చే ప్రయత్నాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో సీటీవో కేదారేశ్వరరావు సోమవారం రాత్రి పోలీ సులను ఆశ్రయించారు. డీసీటీవో ఎ¯ŒS.దుర్గారావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, అటెండర్ రంగారావు, ఆనందశేఖర్ అనే వ్యక్తి కేసును నీరు గార్చాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పోలీసులకు సీటీవో ఫిర్యాదు చేశారు. డీసీటీవో దుర్గారావు, శ్రీనివాస్, రవికుమార్, రంగారావు తన విధులను ఆటంకపర్చడంతోపాటు రౌడీయిజం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అక్రమ వసూళ్లపై తాను విచారణ నిర్వహిస్తుండగా.. ఈ కేసులో రాజీ పడాలని వేధిస్తున్నారని, లేదంటే తన కుల ధ్రువీకరణ పత్రం విషయంలో హైకోర్టులో అప్పీల్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడంతోపాటు మానసికంగా వేధిస్తున్న ఆ ఐదుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీటీవో కేదారేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎ¯ŒS.కేశవరావు సోమవారం రాత్రి చెప్పారు.
Advertisement
Advertisement