విజయవాడ గాంధీనగర్‌లో మదీనా ఎంటర్ ప్రైజెస్ అనే బోగస్ సంస్థను సృష్టించి పాత ఇనుము విక్రయాల ద్వారా రూ.7.2 కోట్లకు పైగా టర్నోవర్ చేసినట్లు లెక్క చూపారు. ఈ లావాదేవీలన్నీ పేపరు మీద ఉన్నాయి తప్ప.. వాస్తవంగా సరుకు కొన్న, అమ్మిన దాఖలాల్లేవు. ఈ విషయాన్ని అధికారులు టోల్‌గేట్ ద్వారా వెళ్తున్న వాహనాల ఫాస్‌ట్యాగ్, వేబిల్లుల సిస్టం ద్వారా కనుగొన్నారు.
విజయవాడ–3 సర్కిల్ పరిధిలోని పెనమలూరులో కె.వి.రావు ట్రేడర్స్ పేరుతో ఫేక్‌సంస్థను సృష్టించి రూ.2.27 కోట్లకు పైగా టర్నోవర్ చేసినట్లు కనుగొన్నారు. ఇవన్నీ పేపరుపైన లావాదేవీలే తప్ప.. వాస్తవంగా అమ్మకాలు, కొనుగోళ్లు జరగలేదని అధికారులు గుర్తించారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇలా బోగస్ సంస్థలు సృష్టించి ఇన్‌పుట్ ట్యాక్స్ (కొనుగోలు చేసిన వస్తువులపై చెల్లించేపన్ను) కట్టకుండా ఎగవేసే దొంగల్ని వాణిజ్యపన్నుల అధికారులు వేటాడుతున్నారు. తుక్కు ఇనుముకు సంబంధించి కాగితాలపైనే సరఫరా చేసినట్లు చూపుతూ, మాన్యుఫాక్చర్ యూనిట్లకు లబ్ధి చేకూరుస్తున్న వారిని గుర్తించి పెనాల్టిలు వేసేదిశగా అడుగులు వేస్తున్నారు.
ఇటీవల విజయవాడలో పాత ఇనుము వ్యాపారానికి సంబంధించి నమోదై ఉన్న సంస్థల్లో వాణిజ్యపన్నుల అధికారులు చేసిన తనిఖీల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తనిఖీల్లో 43 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణలో 18 బోగస్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. వీటిద్వారా రూ.40 కోట్లకుపైగా టర్నోవర్ జరిగినట్లు గుర్తించారు. ఆ సంస్థలకు సంబంధించి అసలైన యజమానులను గుర్తించి పెనాల్టీ విధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నకిలీ సంస్థలను సృష్టిస్తున్నారిలా..
పాత ఇనుము వ్యాపారం చేసే వారిలో కొందరు వివిధ మార్గాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. తమ వద్ద పనిచేసే పేదల ఆధార్‌కార్డు తీసుకుని పాన్‌కార్డు దరఖాస్తు చేసి, దొంగ రెంటల్ అగ్రిమెంట్‌తో ఆన్‌లైన్‌లో కాటన్, టెక్స్‌టైల్స్, కిరాణా వ్యాపారం పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తర్వాత పాత ఇనుము కమోడిటీని దానికి యాడ్ చేస్తున్నారు.
విచ్చలవిడిగా ఇన్‌వాయిస్‌లు, వేబిల్లులు సృష్టించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని దొంగచాటుగా కాగితాలపైనే సరఫరా చేసినట్లు చూపి, మాన్యుఫాక్చ రింగ్ సంస్థలకు లబ్ధి చేకూరుస్తున్నారు. మున్సిపల్ పన్ను రశీదులను సైతం ఈ బోగస్ సంస్థల సృష్టికి కొంతమంది వాడుకుంటున్నారు. మున్సిపల్ వెబ్‌సైట్ నుంచి ఏదో పేరు మీద ఉన్న పన్ను రశీదులను డౌన్‌లోడ్ చేసుకొని, దొంగ లీజు అగ్రిమెంట్లతో నకిలీ సంస్థలను సృష్టిస్తున్నారు.
మాన్యుఫాక్చరింగ్ సంస్థలకు లబ్ధి ఇలా..
పాత ఇనుము సేకరించే హాకర్స్‌కు ఎటువంటి ఇన్‌పుట్ ట్యాక్స్ ఉండదు. పాత ఇనుము వివిధ మార్గాల్లో కొన్నదానికి బిల్లులు ఉండవు. ఇలా కొనుగోలు బిల్లుల్లేకుండా సరుకును రీరోలింగ్ మిల్లుకు సరఫరా చేస్తే ఆ కంపెనీ వారు ప్రభుత్వానికి 18 శాతం ట్యాక్స్ చెల్లించాలి.
కానీ ట్యాక్స్ కట్టకుండా ఎగవేసేందుకు ఈ నకిలీ సంస్థలను సృష్టించి ఫేక్ అమ్మకం బిల్లులను జనరేట్ చేసి, ఈ–వేబిల్లులు, బ్యాంకు అకౌంట్‌ల ద్వారా లబ్దిపొంది, వచ్చే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను రీరోలింగ్ సంస్థలకు పాస్ చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే వస్తువులకు దొంగ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను వాడుకుని ఈ మాన్యుఫాక్చరింగ్ సంస్థలు లబ్దిపొందుతున్నాయి. బోగస్ సంస్థలను సృష్టించి పాత ఇనుమును ఎక్కువగా విజయవాడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు.
దోషులను పట్టుకునేందుకు చర్యలు
బోగస్ సంస్థలు సృష్టించి, పన్ను ఎగవేసే వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులతోపాటు, దాని వెనుక ఉన్న అసలైన దోషులను, సాఫ్ట్‌వేర్, ప్రత్యేక నిఘా ఆధారంగా గుర్తించి, వారు టర్నోవర్ చేసిన మొత్తానికి సంబంధించి పెనాల్టీ వసూలు చేస్తాం. ఇటీవల విజయవాడలో చేసిన తనిఖీల్లో 43 కేసులు నమోదు చేశాం. ఇప్పటివరకు విచారణలో 18 బోగస్ సంస్థలను గుర్తించాం. – ఇ.కృష్ణమోహన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్, వాణిజ్యపన్నుల శాఖ విజయవాడ రీజియన్
Comments
Please login to add a commentAdd a comment