పన్ను ఎగవేత చట్టరీత్యా నేరం. అనైతికం. ఆర్థికంగా సంక్షోభం తయారవుతుంది. అయితే, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. సినిమాలో ‘విలన్’ మనకు ఆది నుంచి చివరి వరకు కనిపిస్తాడు. నిజజీవితంలో ‘విలన్’ విలన్‌లాగా కనిపించడు. ఓ పరోపకారి పాపయ్యలాగా, ఓ మర్యాద రామన్నలాగా అనిపిస్తాడు. వినిపిస్తాడు. కనిపిస్తాడు. ఎంతో మోసం చేస్తాడు. మనం తెలుసుకునే లోపల తెరమరుగవుతాడు.
‘‘మీరు ఇప్పుడే మోసపోయారు’’ పుస్తకంలో రచయిత.. మనం ప్రతి రోజూ వైట్‌కాలర్ క్రైమ్ ద్వారా ఎలా మోసపోతున్నామో కళ్ళకి కట్టినట్లు తెలియజేశారు. ‘‘డబ్బుని ఎలా సంపాదించాలి’’ అనే పుస్తకంలో రచయిత ’అంకుర్ వారికూ’ ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఆస్తిని ఎలా ఏర్పాటు చేసుకోవాలని మొదలైన విషయాల మీద ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తారు. అలాగే తెలుగు రచయతలు వీరేంద్రనాథ్‌గారు, బీవీ పట్టాభిరాం గారు తమ పుస్తకాల ద్వారా ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఇంత మంది చెప్పినా, ఇన్ని విషయాలు తెలిసినా, షరా మామూలే!
ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
ఒకరిని చూసి ఒకరు. ఆశతో, ప్రేరేపణతో. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు మోసం చేస్తున్నారు. పన్ను ఎగవేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి మార్గాలున్నట్లు..
అకౌంట్స్ బుక్స్ నిర్వహించపోవడం, నిర్వహణలో అవకతవకలు, ఆదాయాన్ని తక్కువగా చూపించడం, ఖర్చులను పెంచేయడం
దురాలోచనలతో బంగారాన్ని .. అంటే ఆభరణాలు, రత్నాలు, డైమండ్లు, వెండి విషయాల్లో సెంటిమెంటు పేరు మీద, పసుపు–కుంకాల పేరు మీద, పెళ్లిళ్ల పేరు మీద కొంటున్నారు. అమ్ముతున్నారు. మళ్లీ కొంటున్నారు. పెట్టుబడికి సోర్స్ చెప్పరు. లాభాన్ని లెక్కించరు. ఆస్తిగా చూపించరు. ‘‘భర్తకే చెప్పం’’ అంటారు కొందరు మహిళలు. మీకు గుర్తుండే ఉంటుంది. రైళ్లలో బోగీ ఎక్కే ముందు ఇదివరకు ప్రయాణికుల జాబితా ఉండేది. పేరు, వయస్సు, లింగం, పాన్ నంబరు, మొదలైనవి అందులో ఉంటాయి. బంగారం షాపులవాళ్లు వారి సిబ్బందిని పంపించి ఆ వివరాలను సంగ్రహించేవారు. ఆ జాబితాను తీసుకుని, షాపునకు వచ్చి, అందులోని పేర్ల మీద ఇతరులకు అమ్మేవారు.
వ్యవసాయ భూమి అంటే ఏమిటో ఆదాయపు పన్ను నిర్వచించినా, గ్రామాల పేరు మార్చి, సరిహద్దులు మార్చి అమ్మకాల్లో మోసం. అలాగే ఆదాయం విషయంలో ఎన్నో మతలబులు.. ఎందుకంటే వ్యవసాయ ఆదాయం, భూమి అమ్మకాల మీద పన్ను లేదు.
ఇక రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పనక్కర్లేదు. నేతి బీరకాయలో నేయి లేదు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ‘‘రియల్’’ గానే పన్ను ఎగవేత ఉంది.
అన్‌లిస్టెడ్ కంపెనీల షేర్లు, స్టాక్స్, క్రయవిక్రయాల్లో ఎన్నో అక్రమమార్గాలు అవలంబిస్తున్నారు.
పబ్లిక్ కంపెనీల్లో షేరు ప్రీమియం పేరుతో మోసాలు.. అలాగే షేర్స్ అలాట్‌మెంట్‌కి ముందుగా అప్లికేషన్‌తో పాటు వసూలు చేసే మనీతో మోసాలు.
వ్యాపారంలో సర్దుబాటు హుండీలు సహజం... వీటి మార్పిడి... ఇదొక సరిహద్దుల్లేని వ్యాపారం అయిపోయింది.
డమ్మీ సంస్థలు.. ఉనికిలో లేనివి.. ఉలుకు లేని..పలుకు లేని.. కాగితం సంస్థలు. కేవలం ఎగవేతకే ఎగబాకే సంస్థలు. దొంగ కంపెనీలు. డొల్ల కంపెనీలు. బోగస్ వ్యవహారాలు. బోగస్ కంపెనీలు.
క్రిప్టోకరెన్సీల్లో గోల్‌మాల్..ఇలా ఎన్నో.. ముఖ్యంగా సోర్స్ చెప్పకపోవడం, పెట్టుబడికి కానీ.. రాబడికి కానీ వివరణ ఇవ్వకపోవడం, పన్ను ఎగవేతకు పన్నాగం చేయడం. వీటి జోలికి పోకండి.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment