పన్నుల ఎగవేతకు, ప్రణాళికబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి గల తేడాలకు సంబంధించి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇంగ్లీషులో Tax Evasion అంటే ఎగవేత.. ఇంగ్లీషులో Tax Planning అంటే ప్లాన్ చేయడం. ప్లాన్ చేయడం వల్ల Tax Avoidance చేయవచ్చు. ఎగవేత నేరపూరితం. ప్లానింగ్ చట్టబద్ధమైనది. వివరాల్లోకి వెళితే..
పన్నుల ప్రణాళిక లక్ష్యాలు
చట్టంలో ఉన్న అంశాలకు లోబడి ప్లాన్ చేయడం.
అన్ని వ్యవహారాలు, బాధ్యతలు చట్టప్రకారం ఉంటాయి.
చట్టప్రకారం అవకాశం ఉన్నంతవరకు పన్ను భారాన్ని తగ్గించుకోవడం.
ఇదొక హక్కులాంటిది .. శాస్త్ర సమ్మతమైనది.
పన్ను ఎగవేత: ఉద్దేశాలు
చట్టంలో అంశాలను ఉల్లంఘించడం.
జరిగే వ్యవహారాలు చట్టానికి వ్యతిరేకంగా ఉంటాయి.
ఉద్దేశపూర్వకంగా పన్ను తప్పించుకునే మార్గాల అమలు.
ఇది నేరం. చట్టవిరుద్ధం.
పన్నుల ఎగవేతలో కావాలని పన్నులు కట్టకుండా ఎగవేయడం ఉంటుంది. అది చట్టవిరుద్ధం. అనైతికం. అబద్ధాలు చెప్పి, తప్పులు చేసి, ఎన్నో కుతంత్రాల ద్వారా ఆదాయాన్ని దాచి, దోచి.. పన్నులను కట్టకపోవడం కిందకు వస్తుంది. ఎన్నో మార్గాలను వెతుక్కుని, అమలుపర్చి తద్వారా పన్నులు ఎగవేస్తారు. మోసపూరితమైన వ్యవహారాలు, మోసపూరితమైన సమాచారం, లెక్కలు.. ఇవన్నీ అభ్యంతరకరం. చట్టరీత్యా నేరం. ఎండమావుల్లాగా ప్రయోజనం అనిపిస్తుంది. కానీ ప్రయోజనం ఉండదు. ఎన్నెన్నో ఉదాహరణలు. ఎన్నో మార్గాలు. అడ్డదార్లు. ఎందరో మనకు తారసపడతారు. మెరిసిపోతుంటారు. మురిసిపోతుంటారు. వెలిగిపోతుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికం. ఇలాంటి వారిపై చట్టపరంగా శిక్షలు తీవ్రంగానే ఉంటాయి. వడ్డీలు వడ్డిస్తారు. పెనాల్టీలు వేస్తారు. కటకటాల పాలు కావచ్చు. ఎన్నో చట్టాలు వారిని పట్టుకుంటాయి.
ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?
పన్నుల ప్లానింగ్
ఇక పన్నుల ప్లానింగ్‌లో ఓ పద్ధతి ఉంటుంది. ఇది చట్టానికి లోబడి ఉంది. నైతికంగా ఉంటుంది. అబద్ధం ఉండదు. తప్పు ఉండదు. కుతంత్రం ఉండదు. ఆదాయాన్ని దోచడం ఉండదు. దాచడం ఉండదు. పన్నులు పడకుండా జాగ్రత్త పడటం.. పన్నుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మోసపూరితం కాదు. లెక్కలు గానీ, సమాచారం గానీ మోసపూరితమైనదిగా ఉండదు. అతిక్రమణ ఉండదు. ప్రయోజనం ఉంటుంది. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నెన్నో సక్రమమైన మార్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరం 10 కోట్ల 41 లక్షల మంది రిటర్నులు వేశారు. లక్ష మంది వారి ఆదాయం కోటి రూపాయలు ఉన్నట్లు చెబుతున్నారు. వీరే మనకు ఆదర్శవంతులు. మనకు కట్టాల్సిన పన్నుల వివరాలు వెల్లడించడం ద్వారా చట్టప్రకారం అన్ని ప్రయోజనాలు దొరుకుతాయి. ఎటువంటి శిక్షలు ఉండదు. మనం ఈ మార్గాన్నే అనుసరిద్దాం.
-కె.సీ.హెచ్ ఏ.వీ.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment