Tax Planning
-
Income Tax: పాత విధానమా.. కొత్త విధానమా..?
ఆర్థిక సంవత్సరం 2020–21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. మీకు ఇష్టమైతే ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. గడువు తేదీలోపల ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే, కొత్త విధానమే పాటించాలి. పాత విధానంలో మినహాయింపులు ఉన్నాయి. రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతం.. ఇలా ఉన్నాయి. కొత్త విధానంలో మినహాయింపులు ఉండవు. రేట్లు 5,10, 15, 20, 30 శాతంగా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. ఏ ప్రాతిపదికన ఎంచుకోవాలి? » మీ ఆదాయ స్వభావం » మీ ఆదాయం » సేవింగ్స్ » పెట్టుబడులు » సొంతిల్లు రుణం – రుణం మీద వడ్డీ » మెడికల్ ఖర్చులు, కొన్ని జబ్బుల మీద ఖర్చులు » జీతం మీద ఆదాయం ఒక్కటే ఉంటే ఒకలాగా ఆలోచించాలి » జీతంతో పాటు ఇతర ఆదాయాలు ఉంటే మరొకలాగా ఆలోచించాలి » వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు .. వారి ఇన్వెస్ట్మెంట్ విధానం » ఉద్యోగస్తులు వారికి ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు. » వ్యాపారస్తులకు అలా మార్చుకునే వెసులుబాటు లేదు » ఒకరితో ఒకరు పోల్చుకోకండి. మీ విధానం మీదే. మీ ఆదాయం మీదే. మీ పన్నుభారం మీదే.ఎటువంటి సేవింగ్స్ లేకపోతే కొత్త పద్ధతిలో రూ. 29,900 పన్ను భారం తగ్గుతుంది. సుమారు రూ. 30,000 మిగులు. అయితే, మీ చేతిలో ఎంతో నిలవ ఉంటుంది. దీన్ని మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరిచ్చే ప్రాధాన్యత, మీ అవసరం మొదలైన వాటి ప్రకారం మీ ఇష్టం.మరో కేసులో కేవలం జీతం రూ. 7,00,000 కాగా సేవింగ్స్ లేవు అనుకుందాం. అప్పుడు..కొత్త పద్ధతిలో ట్యాక్స్ పడదు. పాత పద్ధతిలో పడుతుంది. పాత పద్ధతిలో పన్ను పడకూడదంటే, ఆ మేరకు సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ అంటే మీ ఫండ్స్ బ్లాక్ అవుతాయి. ఆటోమేటిక్‌గా అందరూ కొత్త దాని వైపే మొగ్గు చూపుతారు. అయితే ఉద్యోగంలో కంపల్సరీగా పీఎఫ్ మొదలైన సేవింగ్స్ ఉంటాయి. ముందు జాగ్రత్తగా మనం సేవ్ చేస్తుంటాం. మన అవసరాలను, కలలను, ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులంటే, ఒకరు సేవ్ చేసి మరొకరు మానేసి.. ఇద్దరూ కొంత చేసి.. ఇలా ఎన్నో ఆలోచనలే మీ ట్యాక్స్ ప్లానింగ్‌కి దారి తీస్తాయి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ట్యాక్స్ ప్లానింగ్ ఇలా చేద్దాం..
ట్యాక్స్ ప్లానింగ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. ఈ వారం ట్యాక్స్ ప్లానింగ్ చేయడానికి సూచనలను తెలుసుకుందాం.చట్టాన్ని తెలుసుకోండి. చట్టాన్ని గౌరవించండి. చాలా పెద్ద పుస్తకం. ఎన్నో సెక్షన్లు, సబ్ సెక్షన్లు, వివరణల ఫారంలు, ఎనెక్జర్లు, మార్పులు, చేర్పులు, టెక్నికల్ భాష అని భయపడకండి. నిజానికి ఇది గ్రీక్ అండ్ లాటిన్ కాదు. సులువుగా తెలుసుకోవచ్చు. కొంచెం శ్రద్ధ, ఇష్టం ఉండాలి. మీ ఇల్లు కట్టిన మేస్త్రీ వంద ఇంగ్లీషు పదాలు పలుకుతాడు. ఇంగ్లీషు రాదు. అలాగే మీ కార్పెంటర్.. రోడ్డు మీదే కాపురం చేసే పంక్చర్లు వేసే వ్యక్తి ఎన్నో ఇంగ్లీషు పదాలు వాడతారు. ప్రస్తుతం సెల్ఫోన్లు వాడే కోట్లాది మందికి ఇంగ్లీషు రాదు. కానీ మన ఇష్టం, కోరిక, అభిలాష, బాధ్యత, చట్టాన్ని గౌరవించే సంప్రదాయం.. ఇవి చాలు. దీనికి తోడుగా ఉందిగా ‘గూగుల్ తల్లి’.. సమాచారాన్ని వెదజల్లి మిమ్మల్ని సన్నద్ధం చేసే కల్పవల్లి.అన్ని భాషల్లోని యూట్యూబ్‌లు, ఎన్నెన్నో లింకులు, వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల్లో పుస్తకాలు, ప్రచురణలు, డెమో సెషన్లు, సభలు, సమావేశాలు, చర్చావేదికలు, వర్క్‌షాప్‌లు, ట్యాక్స్ కాలమ్‌లు, వ్యాసాలు, అవగాహన సదస్సులు ఉంటున్నాయి. ఇంకేం కావాలి. డిపార్టుమెంట్ వారు సర్క్యులర్స్ ఇస్తున్నారు. అధికారులు ఫ్రెండ్లీగా ఉంటారు. ఎన్నో యాప్‌లు, రెడీ రెకనర్లు, ప్రశ్నలకు జవాబులు. వీటిని అందిపుచ్చుకుంటే మీరు పండితులైనట్లే లెక్క.మీ హక్కులు, బాధ్యతలు తెలుసుకోండి.. మసలుకోండి.. ఆత్మబంధువు రూపంలో సి.నా.రె. గారి సూటి ప్రశ్నించారు ‘ఏమి చదివి పక్షులు పైకెగరగలిగేను’ అని .. అలాగే ‘ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని’ అని కృష్ణశాస్త్రిగారు ప్రశ్నించారు. కాబట్టి తెలుసుకుంటే రానిదంటూ ఉండదు.. ఈనాటి ఈ చట్టం ఏనాటిదో అని భయపడకండి. మీరేమీ తక్కువ కాదు.. ఎవరికీ తీసిపోరు. మీ ఫోన్ స్మార్ట్. మీరు స్మార్ట్. మీ ఫోన్ ఏ ప్లాన్‌లో ఉందో తెలుసు. టారిఫ్ ప్లాన్ తెలుసు, వైఫై వివరాలు తెలుసు, బ్యాంకు అకౌంట్ పాస్వర్డ్లు తెలుసు. బంగారం ధర తెలుసు. షేర్లు ఎంతకు కోట్ అవుతున్నాయో తెలుసు.ఇలా ఎన్నో తెలుసు. అలాంటిది ఇన్‌కం ట్యాక్స్ రూల్స్ అనేవి బ్రహ్మపదార్థాలు కావు కదా తెలియకుండా ఉండటానికి. మీరు పట్టించుకోలేదు అంతే. ఇక నుంచి అవి తెలుసుకోండి. వివిధ రకాలైన గడువు తేదీలను తెలుసుకోండి. గుర్తుంచుకోండి. రూల్స్ తెలుసుకోండి. మినహాయింపులు, తగ్గింపులు తెలుసుకోండి. మీ సహోద్యోగులను సంప్రదించండి. మార్నింగ్ వాక్‌లో మీ పక్కింటాయనతో మాట్లాడండి.ఇప్పుడు ప్లాన్ చేయండి.. ముచ్చటగా మూడోది.. ప్లాన్ చేసుకోండి. మొదటి పాయింటు ప్రకారం సమగ్ర సమాచారం ఉంది. రెండో పాయింటు ప్రకారం సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. తెలుసుకున్నారు. ఇక ప్లానింగ్. ఈ సంవత్సరం అనుకోకుండా ఆదాయం వచ్చింది. ఆ మేరకు ఆదాయం తగ్గించుకోవాలనుకుంటే దాన్ని సేవింగ్స్ చేయండి. ఉదాహరణకు రూ. 40,000 బోనస్ వచ్చింది. పరిమితులు దాటకుండా ఉంటే 80సి ప్రకారం ఇన్వెస్ట్ చేయండి. స్థిరాస్తి క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది. మరో ఇల్లు కొనండి. లేదా బాండ్లు కొనండి.ఇంటద్దె అలవెన్స్ పూర్తిగా మినహాయింపు రావాలంటే.. ఇంటి అద్దె ఎక్కువ ఇచ్చి పెద్ద ఇంట్లో ఉండండి. అయితే, ఆఫీసుకు దూరంగా ఉండి రవాణా ఖర్చు రానుపోను చాలా ఎక్కువయితే మరోలా ప్లాన్ చేయండి. చివరిగా ట్యాక్స్ప్లానింగ్ అంటే కేవలం పన్నుభారం తగ్గించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడం కాదు. ఇతరత్ర కుటుంబ ప్రాధాన్యతలు, ఆరోగ్య సమస్యలు, నైతిక విలువలు, చట్టాన్ని గౌరవించటం, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు, వృత్తి మీద ప్రేమ, సొంతూరిమీద ప్రేమ మొదలైనవి పరిగణనలోకి తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ట్యాక్స్ ప్లానింగ్.. సరిగమపదని..
‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకోండి. ’ఎగవేత’ భూతం ’కబంధ’ హస్తాల నుంచి బైటపడ్డాం. ఇప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ మీద దృష్టి సారించి, ప్లానింగ్ రాగాల్లో స,రి,గ,మ,ప,ద,ని తెలుసుకుందాం. గత దశాబ్దంగా మనం వింటున్న పదం.. జనాలు నలుగురు మెచ్చిన పదం ’మేనేజ్మెంట్’.. కేవలం కంపెనీలు, కార్పొరేట్లు, వ్యాపారం, వాణిజ్య రంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ’మేనేజ్మెంట్’ కంపల్సరీ. సంస్థలతో బాటు వ్యక్తులకు, మనందరికీ వర్తించేది ’మేనేజ్మెంట్’. ట్యాక్స్‌ని మేనేజ్ చేయాలి. ట్యాక్స్ మేనేజ్మెంట్లో ముఖ్యమైన ప్రాథమిక అంశం, కీలకాంశం ’ట్యాక్స్ ప్లానింగ్’. ఇది క్రియాశీలక చర్య .. చర్చ!ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాచట్టరీత్యా, రాచమార్గంలో పన్నుభారాన్ని తగ్గించే మార్గం. అవసరం అయినంత, అర్హత ఉన్నంత .. అన్ని ప్రయోజనాలు, తగ్గింపులు, మినహాయింపులు పొంది, ఆదాయాన్ని తగ్గించుకోవడం లేదా పెద్ద శ్లాబు నుంచి తక్కువ/చిన్న శ్లాబుకి తెచ్చుకోవడం, 30 శాతం నుంచి 20 శాతానికి, 20 శాతం నుంచి 10 శాతానికి, ఇంకా 10 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించుకోవడం.ట్యాక్స్ ప్లానింగ్ మూడు రకాలుగా ఉంటుంది. స్వల్పకాలికం.. అంటే ఆ సంవత్సరానికి పన్ను తగ్గించుకోవడం. దీర్ఘకాలికం.. అంటే భవిష్యత్‌లో పన్నుని తగ్గించుకోవడం. మూడోది, విరాళాల ద్వారా తగ్గించుకోవడం.పన్ను తగ్గించుకోవడం: స్వల్పకాలికంగా గానీ దీర్ఘకాలికంగా గానీ పన్నులను తగ్గించుకోవడం.పోస్ట్‌పోన్ చేసుకోవడం: ఈ విధంగా ఎప్పుడు చేసుకోవచ్చంటే.. బడ్జెట్‌కు ముందు.. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మార్చి 31 లోపల లేదా ఏప్రిల్ 1 తర్వాత.. స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఇలా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు.పన్ను భారాన్ని విభజించుట: ఒకే మనిషి మీద ఎక్కువ ట్యాక్స్ పడే పరిస్థితుల్లో ఆదాయాన్ని చట్టప్రకారం అగ్రిమెంట్ల ద్వారా ఆదాయాన్ని విభజించడం. ఉదాహరణకు ఆలుమగలు వారి పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్లను మార్చి వడ్డీ సర్దుబాటు చేసుకోవచ్చు.తప్పించుకోవడం: సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రకారం తప్పించుకోవడాన్ని చట్టరీత్యా కూడా చేయొచ్చు. చట్టంలోని లొసుగుల్లోని అంశాలకు లోబడి పన్ను తప్పించుకోవచ్చు. ఉదాహరణకు భార్యా, భర్త ఇద్దరికీ పన్నుభారం వర్తిస్తుంది. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ స్కూల్ ఫీజులు కడుతున్నారు. అలాంటప్పుడు ఇద్దరి స్కూల్ ఫీజును ఒకరి కేసులో, మిగతా పిల్లల ఫీజును మరొక కేసులో క్లెయిం చేయొచ్చు. ఒకరకంగా కాకుండా మరో విధంగా కట్టడాన్ని ఇంగ్లీషులో disguise taxation అని అంటారు. మారువేషం కాదు. మరో వేషంలాంటిది. అంటే, చేసే వ్యాపారం భాగస్వామ్యం లేదా కంపెనీలాగా చేస్తే 30 శాతం పన్ను పడుతుంది. అలా కాకుండా సొంత వ్యాపారంగా చేస్తే శ్లాబుల వారీగా 10 శాతం, 20 శాతం, 30 శాతం చొప్పున కట్టొచ్చు. బేసిక్ లిమిట్ కూడా వర్తిస్తుంది.సంపూర్తిగా ఆలోచించాలి: పాటల ట్యూనింగ్లాగే ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఉంటుంది. గీత రచనను బట్టి స్వర రచన. ఏదైనా ఏడు స్వరాల్లో ఇమడాలి. పూర్తి సమాచారం ఉండాలి. చట్టాన్ని అతిక్రమించకూడదు. పన్ను భారం తగ్గాలి, చట్టప్రకారం జరగాలి.పన్నుకు సంబంధిచిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ-మెయిల్ పంపించగలరు -
పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!
పన్నుల ఎగవేతకు, ప్రణాళికబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి గల తేడాలకు సంబంధించి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇంగ్లీషులో Tax Evasion అంటే ఎగవేత.. ఇంగ్లీషులో Tax Planning అంటే ప్లాన్ చేయడం. ప్లాన్ చేయడం వల్ల Tax Avoidance చేయవచ్చు. ఎగవేత నేరపూరితం. ప్లానింగ్ చట్టబద్ధమైనది. వివరాల్లోకి వెళితే..పన్నుల ప్రణాళిక లక్ష్యాలుచట్టంలో ఉన్న అంశాలకు లోబడి ప్లాన్ చేయడం.అన్ని వ్యవహారాలు, బాధ్యతలు చట్టప్రకారం ఉంటాయి.చట్టప్రకారం అవకాశం ఉన్నంతవరకు పన్ను భారాన్ని తగ్గించుకోవడం.ఇదొక హక్కులాంటిది .. శాస్త్ర సమ్మతమైనది.పన్ను ఎగవేత: ఉద్దేశాలుచట్టంలో అంశాలను ఉల్లంఘించడం.జరిగే వ్యవహారాలు చట్టానికి వ్యతిరేకంగా ఉంటాయి.ఉద్దేశపూర్వకంగా పన్ను తప్పించుకునే మార్గాల అమలు.ఇది నేరం. చట్టవిరుద్ధం.పన్నుల ఎగవేతలో కావాలని పన్నులు కట్టకుండా ఎగవేయడం ఉంటుంది. అది చట్టవిరుద్ధం. అనైతికం. అబద్ధాలు చెప్పి, తప్పులు చేసి, ఎన్నో కుతంత్రాల ద్వారా ఆదాయాన్ని దాచి, దోచి.. పన్నులను కట్టకపోవడం కిందకు వస్తుంది. ఎన్నో మార్గాలను వెతుక్కుని, అమలుపర్చి తద్వారా పన్నులు ఎగవేస్తారు. మోసపూరితమైన వ్యవహారాలు, మోసపూరితమైన సమాచారం, లెక్కలు.. ఇవన్నీ అభ్యంతరకరం. చట్టరీత్యా నేరం. ఎండమావుల్లాగా ప్రయోజనం అనిపిస్తుంది. కానీ ప్రయోజనం ఉండదు. ఎన్నెన్నో ఉదాహరణలు. ఎన్నో మార్గాలు. అడ్డదార్లు. ఎందరో మనకు తారసపడతారు. మెరిసిపోతుంటారు. మురిసిపోతుంటారు. వెలిగిపోతుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికం. ఇలాంటి వారిపై చట్టపరంగా శిక్షలు తీవ్రంగానే ఉంటాయి. వడ్డీలు వడ్డిస్తారు. పెనాల్టీలు వేస్తారు. కటకటాల పాలు కావచ్చు. ఎన్నో చట్టాలు వారిని పట్టుకుంటాయి.ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?పన్నుల ప్లానింగ్ఇక పన్నుల ప్లానింగ్‌లో ఓ పద్ధతి ఉంటుంది. ఇది చట్టానికి లోబడి ఉంది. నైతికంగా ఉంటుంది. అబద్ధం ఉండదు. తప్పు ఉండదు. కుతంత్రం ఉండదు. ఆదాయాన్ని దోచడం ఉండదు. దాచడం ఉండదు. పన్నులు పడకుండా జాగ్రత్త పడటం.. పన్నుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మోసపూరితం కాదు. లెక్కలు గానీ, సమాచారం గానీ మోసపూరితమైనదిగా ఉండదు. అతిక్రమణ ఉండదు. ప్రయోజనం ఉంటుంది. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నెన్నో సక్రమమైన మార్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరం 10 కోట్ల 41 లక్షల మంది రిటర్నులు వేశారు. లక్ష మంది వారి ఆదాయం కోటి రూపాయలు ఉన్నట్లు చెబుతున్నారు. వీరే మనకు ఆదర్శవంతులు. మనకు కట్టాల్సిన పన్నుల వివరాలు వెల్లడించడం ద్వారా చట్టప్రకారం అన్ని ప్రయోజనాలు దొరుకుతాయి. ఎటువంటి శిక్షలు ఉండదు. మనం ఈ మార్గాన్నే అనుసరిద్దాం.-కె.సీ.హెచ్ ఏ.వీ.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
ట్యాక్స్ ప్లానింగ్‌లో చేసే పొరపాట్లు ఇవే..
ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉన్నాం. ఈ దశలో ట్యాక్స్ ప్లానింగ్ అన్నది చాలా ముఖ్యమైన అంశం. చివరి నిమిషంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పన్ను ఆదా చేయడానికి ముందుగా ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి. ఇలా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అవి సమర్థవంతమైన ట్యాక్స్ ప్లానింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇదీ చదవండి: SVB: దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే.. అవగాహన ముఖ్యం ప్రస్తుత ఖర్చులపై అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం పొరపాటు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు రాయితీ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు సరైన ప్రణాళికను కలిగి ఉండటం చాలా ముఖ్యం. బీమా ప్రీమియం రూ.5 లక్షలు మించకూడదు ఏడాదికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియంతో బీమా పాలసీలో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు ఉండదని 2023 బడ్జెట్ స్పష్టం చేసింది. కాబట్టి పన్ను మినహాయింపుల కోసం బీమా పాలసీలలో పెట్టుబడి పెట్టేవారు దానికి చెల్లించే ప్రీమియం ఏడాదికి రూ. 5 లక్షల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇక అన్లిమిటెడ్ 5జీ డేటా! క్రెడిట్ కార్డ్ వినియోగంలో జాగ్రత్త! పన్ను మినహాయింపుల కోసమని కొంతమంది క్రెడిట్ కార్డ్‌ని ఉపయోస్తుంటారు. ఇలా చేయడం చాలా పొరపాటు. ఎందుకంటే ఇది అప్పులు పెరిగేందుకు దారితీయవచ్చు. ముందుగానే ప్లానింగ్ మంచిది ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి ఆఖరు నెల వరకు ఆగకుండా ముందుగానే ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడం మంచిది. దీని వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? -
ఇల్లు కొనాలనుకుంటున్నారా? ట్యాక్స్ ప్లానింగ్ ఇలా చేసుకోండి!
ఆర్థిక మంత్రిగారు హల్వా తయారు చేశారు. ఇది గంట పని. బడ్జెట్ కసరత్తు మాత్రం ఫిబ్రవరి 1 నాడు ఉదయం వరకు జరుగుతూనే ఉంటుంది. మార్పులు, చేర్పులు, కూర్పులు .. రాబోయే బడ్జెట్ ఎలా ఉండాలో అన్న విషయంపై ఎన్నో ఆశలు .. ఆలోచనలు .. ఏది ఎలా ఉన్నా .. కింద చెప్పిన ట్యాక్స్ ప్లానింగ్‌లో పదనిసలు మీకు ఎప్పుడు శ్రీరామరక్ష (సీతమ్మ వరాలతో నిమిత్తం లేకుండా). ►ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి మీ కుటుంబసభ్యులు మీకు అప్పుగా మొత్తం ఇవ్వొచ్చు. మీరు తీసుకోవచ్చు. వారికి సోర్స్ ఉండాలి. నిజంగా వ్యవహారం జరగాలి. వారు ట్యాక్సబుల్ బ్రాకెట్లో లేకపోతే మరీ మంచిది. ఉదా: స్త్రీ ధనం .. వారి సేవింగ్స్ లాంటివి. ►వైద్య ఖర్చులు బాగా పెరిగిపోతున్న రోజుల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకు మెడిక్లెయిం పాలసీ మంచిది. ►సీనియర్ సిటిజన్లకు ఎన్నో ఆకర్షణీయమైన, అనువైన ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ►చదువుల కోసం అప్పు తీసుకుంటే ఆ అప్పు మీద వడ్డీకి ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేవు. అలా అని అప్పులకు పోకండి. మీకు ఇబ్బంది లేనంతవరకు మాత్రమే వెళ్లండి. ►దగ్గర బంధువుల నుంచి వచ్చే గిఫ్ట్‌లకు పన్ను భారంలేదు. లేని పాత్రను సృష్టించకండి. మనిషి ఉండాలి. కెపాసిటీ ఉండాలి. సోర్స్ ఉండాలి. వ్యవహారం జరిగి ఉండాలి. ►బంధువులు కాని వారి నుండి కేవలం రూ. 50,000 వరకు గిఫ్టులకు మినహాయింపు ఉంటుంది. రూ. 50,000 దాటితే పుచ్చుకున్న వ్యక్తికి అది ఆదాయం అవుతుంది. ►ఇవే రూల్సు స్థిరాస్తులకు కూడా వర్తిస్తాయి. రూ.50,000కు ఏ స్థిరాస్తీ రాదు. కానీ పల్లెటూళ్లలో బహుశా అంత తక్కువకు స్థిరాస్తివిలువ ఉంటే ప్రయత్నం చేయండి. ►ఇదే విధంగా షేర్లు, సెక్యూరిటీలు, బంగారం,ఆభరణాలు, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, కళాత్మకమైన వస్తువులు మొదలైన విషయాల్లోనూ పాటించండి. (6), (7), (8)ల్లో పేర్కొన్న వాటికి సంబంధించి.. దగ్గర బంధువులు అంటే .. ‘‘నిర్వచనం’’ప్రకారం ఉండాలి. ►వయస్సు పెద్దదవుతున్నప్పుడు‘‘వీలునామా’’రాస్తే మంచిది. వీలునామా ద్వారా ఆస్తులకు ఎటువంటి పన్నుభారం ఉండదు. వీలునామా మామూలు కాగితం మీద, స్పష్టంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా, అనుమానాలకు తావు ఇవ్వకుండా రాస్తే చాలు. వ్యవహారం సులువుగా జరిగిపోతుంది. -
ట్యాక్స్ చెల్లిస్తున్నారా? పన్ను భారం ఇలా తగ్గించుకోండి!
ఫిబ్రవరి 1న పార్లమెంటులో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఒక పక్క విశ్వవ్యాప్తంగా తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం, మరో పక్క అన్ని రంగాల్లో ధరల పెరుగుదల.. పది రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏవో తాయిలాలు ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్న వేతన జీవులు .. ఏవేవో ఊహాగానాలు.. ఏమి అవుతుందో తెలీదు..ఏం వస్తుందో తెలీదు. కానీ, ఏ మార్పూ రాదనుకుని వేతన జీవులు పన్ను భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం మీద దృష్టి సారిస్తే.. అదే ఊరట.. ఉపశమనం.. ఉత్తమం! గవర్నమెంటు ఉద్యోగస్తుల విషయంలో జీతభత్యాలు, అలవెన్సులు, షరతులు, నిబంధనలు, రూల్సు, నియమాలు మారవు. మీ మాట చెల్లదు. కానీ ప్రైవేట్ సంస్థల్లో కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. ఆ వెసులుబాటుతో ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ►కరువు భత్యం, కరువు భత్య అలవెన్సు .. ఈ రెండింటిని బేసిక్ జీతంలో కలిసిపోయేలా ఒప్పందం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటద్దె అలవెన్సు, గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటెడ్ మీద పన్ను భారం తగ్గుతుంది. ►జీతం మీద నిర్ణయించిన కమీషన్ శాతం .. ఫిక్సిడ్‌గా ఉండాలి. కమీషన్ని జీతంలో భాగంగా పరిగణిస్తారు. ►యజమాని సహకరిస్తే కొన్ని చెల్లింపులను బిల్లులు సబ్మిట్ చేసి తీసుకోండి. అంటే.. రీయింబర్స్మెంటులాగా. ►పెర్క్స్ని తీసుకుని లబ్ధి పొందడం చాలా ఉపయోగం. అలవెన్సులు వద్దు. వాటి మీద పన్ను భారం ఉంటుంది. ►పెర్క్స్ అంటే .. ఇంట్లో టెలిఫోన్, ఇంట్లో కంప్యూటర్, పర్సనల్ ల్యాప్‌టాప్, కొన్ని చరాస్తులను ఇంట్లో వాడుకోవడం.. ఆఫీసులో పనివేళలో రిఫ్రెష్మెంట్లు.. మొదలైనవి. వీటి మీద పన్ను భారం ఉండదు. ►ఆఫీసు కారు మీ స్వంత పని మీద వాడుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. అలా అని దుర్వినియోగం చేయవద్దు. ►మీ యజమాని మీ తరఫున చెల్లించే పీఎఫ్ చందా 12 శాతం వరకు ఇవ్వొచ్చు. ►80సీ సేవింగ్స్ మీ ఇష్టం.. మీ వీలును బట్టి చేయండి. ►హెచ్ఆర్ఏ మినహాయింపు కావాలంటే ఇల్లు మీ పేరు మీద కాకుండా, ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద క్లెయిమ్ చేయండి. వారు అసలు ట్యాక్స్ బ్రాకెట్లో లేకపోతే మీకు ఎంతో ప్రయోజనం. ►ఎరియర్స్ జీతాలు చేతికి వచ్చినప్పుడే పన్నుభారం లెక్కిస్తారు. ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ వస్తోంది. 01–04–2023 నుంటి శ్లాబులు మారతాయి అని అంటున్నారు. అలా మారడం వల్ల ఉపయోగం ఉంటే ఎరియర్స్‌ను వచ్చే ఏడాది ఇవ్వమనండి. ►కొన్ని కంపెనీల్లో వారికి మీ సేవలు కావాలి. మీ హోదా.. అంటే మీరు ఉద్యోగా? కన్సల్టెంటా అన్నది ముఖ్యం కాదు. అలాంటప్పుడు కన్సల్టెంటుగా ఉండండి. అప్పుడు 10 శాతం పన్ను డిడక్ట్ చేస్తారు. మీ ఖర్చుల్ని బట్టి మీ నికర ఆదాయాన్ని మీరే లెక్కించుకోవచ్చు. -
ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ? అయితే ఇది మీకోసమే.. ఇదొక రాచమార్గం
దసరా, దీపావళి పండగలు వెళ్లిపోయాయి. ఇక పెద్ద ఖర్చులు ఉండవు. అయితే, పన్ను కూడా ఒక ఖర్చులాంటిదే కాబట్టి ఇక నుంచి ట్యాక్స్ ప్లానింగ్ వైపు ఒక లుక్ వేద్దాం. పన్నుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇదొక రాచమార్గం. చట్టబద్ధంగా, సగౌరవంగా, సక్రమంగా, సరైన దారిలో నడుస్తూ మనం మన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అవకాశం ఉంటే పన్ను భారమే లేకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. తప్పనిసరి అయితే సకాలంలో చెల్లించి, సకాలంలో రిటర్ను వేసి సజ్జనులమని సంబరపడొచ్చు. ట్యాక్స్ ప్లానింగ్ అవసరమా? దైనందిన జీవితంలో ముందుచూపు ఎలా ఉండాలో ట్యాక్స్ విషయంలోనూ ముందు చూపు అవసరం. దీన్నే ప్లానింగ్ అంటారు. చట్టప్రకారం ఎటువంటి తప్పులు చేయకుండా, పొరపాట్లు దొర్లకుండా, ఎటువంటి అడ్డదార్లు తొక్కకుండా, గోల్మాల్ గోవిందం గారిలాగా కాకుండా .. రాముడు మంచి బాలుడిలాగా పన్ను భారాన్ని తగ్గించుకోవడం అవసరమే. ప్రయోజనాలు ఉన్నాయా? ఎందుకు లేవు మాస్టారూ! ట్యాక్స్ ప్లానింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ►పన్ను తగ్గుతుంది. ఆ మేరకు మిగిలినట్లే. ► సరైన మొత్తం సకాలంలో చెల్లించేస్తే .. అధిక మొత్తం చెల్లించి ఆ తర్వాత రిఫండు కోసం చకోర పక్షుల్లాగా ఎదురు చూడాల్సిన బాధ తప్పుతుంది. ► తక్కువ చెల్లించి, ఆ తర్వాత విషయం తెలిసి అనవసరంగా వడ్డీలు కట్టక్కర్లేదు. పన్ను భారమే తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు వడ్డీలు చెల్లించాల్సిన అవసరమే లేదు. ► ఆలోచించి ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ఇల్లు జాయింట్ ఓనర్షిప్ అయితే ఇంటద్దెను ఆదాయంగా భావించినప్పుడు అద్దెను ఇద్దరికి విడగొట్టి ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే జాయింటు బ్యాంకు అకౌంటులోని వడ్డీలు, జాయింటుగా ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్ల మీద వడ్డీ విషయంలో కూడా ఇలా చేయొచ్చు. ► మీరు ఏ శ్లాబులో ఉన్నారో ఆ శ్లాబు దాటకుండా .. తక్కువ శ్లాబులోనే ఉండేలా ఆదాయాన్ని పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు లేదా సర్దుబాటు చేసుకోవచ్చు. ►సెక్షన్ 80సిలో ఎన్నో తగ్గింపులు ఉన్నాయి. ఇందులో 20 అంశాలు ఉన్నాయి. అన్నింటికీ కలిపి పరిమితి రూ. 1,50,000. వీటిలో ఏది కంపల్సరీనో అది చేసి మిగతాది ఇతర కుటుంబ సభ్యులకు చేయవచ్చు. ► పిల్లలకు చదువుల ఫీజు విషయంలో కేవలం ఇద్దరు పిల్లలకే ఇస్తారు. ఇద్దరి ఫీజు ఒకరి ఆదాయంలో నుంచి, మిగతావారివి వేరే కుటుంబ సభ్యుల ఆదాయంలో నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ► ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ద్వారా వచ్చే వడ్డీని పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. ► వ్యాపారస్తులు కొన్ని ఖర్చులను అదుపులో ఉంచుకుని ఏ ఖర్చు మీద మినహాయింపు ఉందో వాటి మీదే ఖర్చు పెట్టవచ్చు. ► అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు, ఇల్లు కట్టడం లాంటి లాంగ్‌టర్మ్ ప్రాజెక్టులు, షార్ట్ టర్మ్‌లో మెడిక్లెయిమ్, డొనేషన్లు వంటివి పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. -
ITR: పన్ను భారం.. చట్టంలో లొసుగులు.. అబద్దపు లెక్కలు..
సాధారణంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో అందరూ ట్యాక్స్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తారు. 31–03–22తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరం విషయంలో ఆలోచనలు చేసి, అమలుపర్చాల్సిన సమయం ఇదే. ఆలస్యం చేయకండి. ట్యాక్స్ ప్లానింగ్‌నే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని కూడా అనవచ్చు. ఇలా ప్లానింగ్ చేయడం వల్ల రాజమార్గంలో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. పన్నును ఎగవేయకూడదు కానీ.. ప్లానింగ్ ద్వారా పన్నుని తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ ప్లానింగ్ గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు.. 1. మీరు ఏ ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఆర్థిక సంవత్సరానికి మాత్రమే మినహాయింపు లభిస్తుంది. 2. ఒక సంవత్సరంలో చేస్తే, ఆ తరువాత సంవత్సరంలో ఎటువంటి మినహాయింపు రాదు. 3. ట్యాక్స్ ప్లానింగ్ నూటికి నూరు పాళ్లు చట్టరీత్యా ఆమోదయోగ్యమైనది. 4. చట్టంలోని లొసుగులు ఆసరాగా తీసుకుని పన్ను భారం లేకుండా చేసుకోవడం.. తగ్గించుకోవటం తప్పు. ఉదాహరణకు దొంగ క్లెయిములు, నకిలీ పత్రాలు సృష్టించి క్లెయిమ్ చేయడం, అబద్ధపు లెక్కలు చూపించడం, లెక్కలు రాయకపోవడం, అబద్ధపు ఖర్చులు రాయడం, వ్యక్తిగత ఖర్చులు పరిగణనలోకి తీసుకోవడం.. ఇలా వంద దారులు ఉన్నాయి. కానీ, ట్యాక్స్ ప్లానింగ్‌కు ఒకే ఒక మార్గం .. రాజమార్గం ఉంది. 5. మీ ఆదాయాన్ని సక్రమ మార్గంలో సంపాదించటమే ట్యాక్స్ ప్లానింగ్‌కు నాంది. దానికి తగ్గట్లుగా పునాది పడితే సహజసిద్ధంగా మంచి ఆలోచనలే వస్తాయి. 6. మంచి ఆలోచన అంటే.. ఆ ఆలోచన/ప్లానింగ్ అందరికీ ఒకేలాగా ఉండదు. మార్గం ఒకటే అయినా విధివిధానాలు వేరుగా ఉంటాయి. ప్రాధాన్యతలు వేరు.. ఉదాహరణకు 80సిలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎవరి ప్రాధాన్యత, అవసరాలను బట్టి వారు ఇన్వెస్ట్ చేస్తారు. 7. వ్యాపారం, వృత్తి, స్థాయి, రెసిడెన్స్ స్టేటస్, వయస్సు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 8. కేవలం ఒక వ్యక్తి పన్ను భారం తగ్గించే ధోరణి కాకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు పిల్లల చదువులు, అమ్మాయి పెళ్లి, ఇల్లు కట్టుకోవడం మొదలైన వాటిని పేర్కొనవచ్చు. 9. పక్కింటి పరంధామయ్యతో మీకు పని లేదు. ఎదురింటి ఏకాంబరం గారితో ఏమీ మాట్లాడక్కర్లేదు. మీ ప్లానింగ్ మీదే. పోలిక వద్దు.. పోటీ వద్దు. 10. మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చట్టప్రకారం మలచుకోండి. ఆదాయం, ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్లు, సేవింగ్స్, పన్నులు చెల్లించటం, రిటర్నులను గడువు తేదీ లోపల వేయటం, ట్యాక్స్ ప్లానింగ్, కుటుంబపు ఆర్థిక పరిస్థితి స్థిరంగా, సక్రమంగా సాగేలా ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యం. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ట్యాక్స్ ప్లానింగ్ కూడా భాగమే. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: పన్ను చెల్లింపు దారులకు శుభవార్త!! రూ.లక్షవరకు పన్ను ఆదా చేసుకోవడం ఎలానో మీకు తెలుసా? -
యాప్ కీ కహానీ...
స్క్రిప్‌బాక్స్... డబ్బే డబ్బును సృష్టిస్తుంది. దీనికి కొంచెం చతురత కావాలి. తెలివిగా ఇన్వెస్ట్మెంట్లను చేస్తే అవే మనకు తగిన ప్రతిఫలాన్ని అందిస్తాయి. ఇలా చేయాలంటే వ్యక్తిగత ఆర్థిక వ్యవ హారాలపై పట్టు సాధించాలి. దీనికోసం ముందుగా ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ వంటి తదితర అంశాల గురించి తెలుసుకోవాలి. ‘స్క్రిప్‌బాక్స్’ యాప్ సాయంతో వీటి గురించి తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు... ⇔ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ⇔ పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ సంబంధిత ఆర్టికల్స్‌ను చదవొచ్చు. ⇔ లెర్న్ సెక్షన్‌లోని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన పలు వ్యాసాలను చదివి మనీ మేనేజ్మెంట్పై అవగాహన తెచ్చుకోవచ్చు. ⇔ ప్లాన్ అనే ఆప్షన్ ద్వారా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు పొందొచ్చో తెలుసుకోవచ్చు. ⇔ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్ సాయంతో రిటైర్మెంట్కు, పిల్లల చదువుకు ఎంత మొత్తం కావాలో అంచనాకు రావొచ్చు. ⇔ యాక్ట్ సెక్షన్లో ఆధార్, పాన్ నంబర్లను ఉపయోగించి మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, బాండ్స్ వంటి పలు ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.