ఆర్థిక మంత్రిగారు హల్వా తయారు చేశారు. ఇది గంట పని. బడ్జెట్ కసరత్తు మాత్రం ఫిబ్రవరి 1 నాడు ఉదయం వరకు జరుగుతూనే ఉంటుంది. మార్పులు, చేర్పులు, కూర్పులు .. రాబోయే బడ్జెట్ ఎలా ఉండాలో అన్న విషయంపై ఎన్నో ఆశలు .. ఆలోచనలు .. ఏది ఎలా ఉన్నా .. కింద చెప్పిన ట్యాక్స్ ప్లానింగ్‌లో పదనిసలు మీకు ఎప్పుడు శ్రీరామరక్ష (సీతమ్మ వరాలతో నిమిత్తం లేకుండా).
►ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి మీ కుటుంబసభ్యులు మీకు అప్పుగా మొత్తం ఇవ్వొచ్చు. మీరు తీసుకోవచ్చు. వారికి సోర్స్ ఉండాలి. నిజంగా వ్యవహారం జరగాలి. వారు ట్యాక్సబుల్ బ్రాకెట్‌లో లేకపోతే మరీ మంచిది. ఉదా: స్త్రీ ధనం .. వారి సేవింగ్స్ లాంటివి.
►వైద్య ఖర్చులు బాగా పెరిగిపోతున్న రోజుల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకు మెడిక్లెయిం పాలసీ మంచిది.
►సీనియర్ సిటిజన్లకు ఎన్నో ఆకర్షణీయమైన, అనువైన ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి.
►చదువుల కోసం అప్పు తీసుకుంటే ఆ అప్పు మీద వడ్డీకి ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేవు. అలా అని అప్పులకు పోకండి. మీకు ఇబ్బంది లేనంతవరకు మాత్రమే వెళ్లండి.
►దగ్గర బంధువుల నుంచి వచ్చే గిఫ్ట్‌లకు పన్ను భారంలేదు. లేని పాత్రను సృష్టించకండి. మనిషి ఉండాలి. కెపాసిటీ ఉండాలి. సోర్స్ ఉండాలి. వ్యవహారం జరిగి
ఉండాలి.
►బంధువులు కాని వారి నుండి కేవలం రూ. 50,000 వరకు గిఫ్టులకు మినహాయింపు ఉంటుంది. రూ. 50,000 దాటితే పుచ్చుకున్న వ్యక్తికి అది ఆదాయం అవుతుంది.
►ఇవే రూల్సు స్థిరాస్తులకు కూడా వర్తిస్తాయి. రూ.50,000కు ఏ స్థిరాస్తీ రాదు. కానీ పల్లెటూళ్లలో బహుశా అంత తక్కువకు స్థిరాస్తివిలువ ఉంటే ప్రయత్నం చేయండి.
►ఇదే విధంగా షేర్లు, సెక్యూరిటీలు, బంగారం,ఆభరణాలు, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, కళాత్మకమైన వస్తువులు మొదలైన విషయాల్లోనూ పాటించండి. (6), (7), (8)ల్లో పేర్కొన్న వాటికి సంబంధించి.. దగ్గర బంధువులు అంటే .. ‘‘నిర్వచనం’’ప్రకారం ఉండాలి.
►వయస్సు పెద్దదవుతున్నప్పుడు‘‘వీలునామా’’రాస్తే మంచిది. వీలునామా ద్వారా ఆస్తులకు ఎటువంటి పన్నుభారం ఉండదు. వీలునామా మామూలు కాగితం మీద, స్పష్టంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా, అనుమానాలకు తావు ఇవ్వకుండా రాస్తే చాలు. వ్యవహారం సులువుగా జరిగిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment