వాణిజ్యపన్నుల ఉన్నతాధికారులపై సీఎం రేవంత్ సీరియస్
లొసుగులపై దృష్టిపెట్టాలని ఆదేశం
మూసీలో నిర్మాణాల తొలగింపునకు,రిజిస్ట్రేషన్లు తగ్గడానికి ఎలా ముడిపెడతారు?
ఆదాయ వనరులపై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన వాణిజ్యపన్నుల శాఖ నుంచి ఆదాయం తగ్గడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రావాల్సిన ఆదాయం కంటే గడిచిన ఆరేడు నెలల్లో ప్రతినెలా ఆదాయం రూ 650 కోట్ల మేరకు తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయం తగ్గడానికి కారణాలేంటి? ఎక్కడ లొసుగులున్నాయో దృష్టిపెట్టాలని ఆదేశించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులు, రవాణా, మైనింగ్, ఎక్సైజ్ తదితర శాఖల ఉన్నతాధికారులతో గురువారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సది్వనియోగం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యపన్నుల లక్ష్యం రూ.85,126 కోట్లుగా ఉంటే.. ఏప్రిల్‌నుంచి సెపె్టంబర్‌వరకు రూ.42,034 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. అయితే ఇందులో రూ.37,315 కోట్లు మాత్రమే వచి్చంది. రూ.4,719 కోట్లు తక్కువ రావడంపై సీఎం సీరియస్ అయినట్లు సమాచారం.
లక్ష్యాన్ని చేరుకోవాలి
ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరే విధంగా పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఆదాయ వసూళ్లపై నిక్కచి్చగా ఉండాలని, అవసరమైతే సంబంధిత విభాగాన్ని పునర్‌వ్యవస్థీకరించుకోవాలని, సంస్కరణలు చేసుకోవాలని సూచించారు. ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రతీశాఖ పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించరాదని హెచ్చరించారు.
అత్యధికంగా జీఎస్టీలో 4,086 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి రూ.654 కోట్లు తక్కువగా వచి్చనట్లు తేలింది. రాష్ట్రంలో జీఎస్టీలో ఎంట్రీ కాకుండా చాలామంది కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారని. అటువంటి వారిని కూడా గుర్తించాలని ఆదేశించారు. మద్యం విక్రయాల్లో ఆదాయం మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిసింది. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టాలన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్‌తో సానుకూల వాతావరణం
రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి ప్రాజెక్టులతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వీటితోపాటు ఫోర్త్‌సిటీ, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, కొత్త ఎయిర్‌పోర్టులు వంటివాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లలేదని, గందరగోళానికి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని చెప్పినట్లు తెలిసింది.
ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలనే హైడ్రా కూలి్చవేసిందని, అన్నీ సక్రమంగా ఉన్న భూముల విలువ పెరిగి.. రిజి్రస్టేషన్లు పెరగాల్సిన చోట.. ఆదాయం తగ్గడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మూసీలోని నిర్మాణాల తొలగింపునకు, రిజిస్ట్రేషన్లు తగ్గడానికి ఎలా ముడిపెడతారని సీఎం అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment