=నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌పై మళ్లీ ఏసీబీ దాడులు
=48,150 రూపాయలు స్వాధీనం
=తీరు మార్చుకోని సిబ్బంది
=కఠిన చర్యలు లేకపోవడమే కారణం
సరిగ్గా ఈ నెల 21న అక్కడ ఏసీబీ దాడులు జరిగాయి. ఐదుగురు అధికారుల వద్ద భారీ మొత్తంలో అక్రమ సొమ్ము పట్టుబడింది. పది రోజులూ గడవక ముందే ఏసీబీ అధికారులు మళ్లీ దాడులు చేశారు. అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సొమ్ముతో పట్టుబడిన అధికారుల్లో ముగ్గురు ఈ నెల 21న నాటి దాడుల్లోనూ నిందితులు కావడం గమనార్హం. చర్యలు లేకపోవడంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గుడిపాల, న్యూస్‌లైన్: గుడిపాల మండలంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ఉంది. ఇక్కడ ఉప వాణిజ్యపన్నులశాఖ అధికారి, సహాయ వాణిజ్య పన్నులశాఖ అధికారి, మోటారు వాహనాల తనిఖీ అధికారి, సహాయ మోటారు వాహనాల తనిఖీ అధికారి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌శాఖకు సంబంధించి ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, అటవీశాఖ సిబ్బంది తదితరులు విధులు నిర్వహిస్తున్నారు. తమిళనాడు సరిహద్దులోని ఈ చెక్‌పోస్ట్ మీదుగా నిత్యం వేలాది వాహనాలు వెళుతుంటాయి.
ఇక్కడ అక్రమ వసూళ్లు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఈ నెల 21న దాడులు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏసీటీవోలు సురేష్, గోపాల్, పళణి, సివిల్ సప్లయిస్ డెప్యూటీ తహశీల్దార్ రహీముద్దీన్‌ఖాన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,02,690 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌పై ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయం లో మరోమారు దాడులు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏసీటీవోలు గణేష్, సురేష్, సివిల్ సప్లయిస్ డెప్యూటీ తహశీల్దార్ రహీముద్దీన్‌ఖాన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి రశీదులూ లేకుండా ఉన్న 48,150 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, కిషోర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళారులదే రాజ్యం
ఈ చెక్‌పోస్ట్‌లో దళారులదే ఇష్టారాజ్యంగా మారుతోంది. ఏడు శాఖలకు సంబంధించి 30 మంది వరకు దళారులు ఉన్నారు. వీరు అధికారుల్లా వ్యవహరిస్తున్నారు. లారీ డ్రైవర్లను దుర్భాషలాడుతూ అయిన కాడికి లాక్కుంటున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడే వారు వీరిని సంప్రదిస్తే చాలు అన్ని పనులూ అయిపోతున్నాయి.
దిష్టి తగిలిందట..
చెక్‌పోస్ట్‌లో దాడుల తర్వాత ఏసీబీ అధికారులు వెళ్లిపోయారు. అనంతరం సిబ్బంది ప్రయివేటు వ్యక్తులను పిలిపించి చెక్‌పోస్ట్‌లోని అన్ని గదులనూ శుభ్రం చేయించారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. తమపై ఏసీబీ అధికారుల చూపు పడకుండా ఉండాలని పూజలు చేయడం గమనార్హం. దీనిని బట్టి సిబ్బంది తీరు మార్చుకోవడం లేదని స్పష్టమవుతోంది. కఠిన చర్యలు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది.
హరిహరీ....
Published Mon, Dec 30 2013 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement
Advertisement