బందోమస్తు | The suspense in the city .. | Sakshi
Sakshi News home page

బందోమస్తు

Published Sat, Sep 7 2013 2:51 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

బందోమస్తు - Sakshi

బందోమస్తు

హైకోర్టులో శుక్రవారం ఉద్రిక్తత.. శనివారం ఇటు ఎల్‌బీ స్టేడియంలో సమైక్యాంధ్ర ఉద్యోగుల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’.. అటు అడ్డుకుంటామంటూ హెచ్చరికలు.. తెలంగాణ బంద్..  ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు. శివార్ల చుట్టూ చెక్‌పోస్టులు.. బందోబస్తు గుప్పిట నగరం నడిబొడ్డు ప్రాంతం.. అంతటా ఉత్కంఠ,  ఉద్విగ్నత నెలకొన్నాయి.
 
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో ఉత్కంఠ.. శుక్రవారం రాష్ట్ర హైకోర్టులో ఉద్రిక్తత.. శనివారం ఏపీఎన్జీఓల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’..అడ్డుకుంటామనే హెచ్చరికలు.. తెలంగాణ బంద్.. ఈ పరిణామాల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరమంతటా ఉత్కంఠ నెలకొంది. సభా వేదిక ఎల్బీ స్టేడియం ఉన్న మధ్య మండలంతో పాటు రాజధాని మొత్తాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. నగర పోలీసులు, రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి 13 వేల మందికి పైగా సిబ్బందిని శనివారం తెల్లవారుజాము నుంచే నగరవ్యాప్తంగా మోహరించనున్నారు.

స్టేడియం పరిసరాల్లోనే 3 వేల మంది ఉంటారు. లోపలకు దారితీసే కీలక మార్గాలతో పాటు స్టేడియం మొత్తాన్నీ కేంద్ర బలగాలకు అప్పగించారు. నగరంలోని ఒక్కో జోన్‌కు ఒక్కో సీనియర్ ఐపీఎస్ అధికారి ఇన్‌చార్జిగా ఉంటారు. మరోపక్క స్టేడియం చుట్టూ ఉన్న రహదారుల్లో ఒక్కో రూట్‌కు ఒకో ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా పకడ్బందీ నిఘా, పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

సభను అడ్డుకోవాలని, గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్న ఆందోళనకారుల కోసం లాడ్జిలతో పాటు అనేక ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టారు. స్టేడియం చుట్టపక్కల ఉన్న నాలుగు మార్గాలను పూర్తిగా మూసేశారు. 40 ప్రాంతాల్లో బారికేడ్లు, కంచె ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో నిఘా బృందాలు డేగకన్నేసి ఉంచుతాయి. కమిషనరేట్‌లోని సిబ్బంది అంతా కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశించారు.
 
 కూడళ్లపై నిఘాకు  ట్రాఫిక్ కెమెరాల వినియోగం

ట్రాఫిక్ స్థితిగతుల పరిశీలనకు నగరంలోని 95 ప్రాంతాల్లో ఉన్న సర్వైయ్‌లెన్స్ కెమెరాలను శనివారం నిఘా కోసమూ వినియోగిస్తారు. వీటన్నింటినీ బషీర్‌బాగ్ పోలీసు కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో అనుసంధానించారు. ఈ కెమెరాల ద్వారా ఇతర ప్రాంతాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలపై కన్నేసి ఉంచుతారు. కూడళ్లలో కదలికలను కనిపెడతారు. ఇందుకు సీసీసీలో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వీరు అటు ప్రధాన కంట్రోల్ రూమ్‌తో పాటు క్షేత్రస్థాయి సిబ్బందితో సంప్రదింపులు జరుపుతుంటారు. నగరంలోని ప్రతి చెక్‌పాయింట్ వద్దా వీడియో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో వినియోగానికి స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను, అనుమానితుల కదలికలను కనిపెట్టటానికి షాడో పార్టీలు ఏర్పాటు చేశారు.
 
మూడంచెల కార్డన్ ఏరియా...

 సరైన అనుమతులు లేకుండా, పోలీసుల కన్నుగప్పి ఎల్బీ స్టేడియం సమీపంలోకి దూసుకువెళ్లాలని ప్రయత్నించే వారిని కట్టడి చేయడానికి మూడంచెల కార్డన్ (నియంత్రణ) ఏరియాలు ఏర్పాటు చేశారు. స్టేడియానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించారు. 35 చెక్‌పోస్టుల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వీరిలో ట్రాఫిక్ విభాగం అధికారులూ ఉన్నారు. ముందజాగ్రత్తగా స్టేడియం చుట్టపక్కల పరిసరాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిషేధించారు.

ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాటిని మళ్లిస్తారు. ఎల్బీ స్టేడియానికి దారితీసే ఖైరతాబాద్, నారాయణగూడ, బషీర్‌బాగ్, తెలుగుతల్లి, మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్లపై రాకపోకల్నీ నిషేధించాలని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచే బారికేడ్లు, బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. నగరానికి రైళ్లు, బస్సుల ద్వారా వచ్చే ఏపీఎన్జీఓలకు ఇబ్బందులు లేకుండా నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్‌ల్లోని రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ తదితర బస్టాండ్లతో పాటు వీటి నుంచి స్టేడియం వరకు ఉన్న రూట్లపైనా నిఘా ఉంచి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement