‘సమైక్యత’ చాటిన సాంస్కృతిక కార్యక్రమాలు
‘ఇప్పటి దాకా కలసి ఉన్నాం... ఇకపైనా కలిసేఉందాం...’ అంటూ సమైక్య వాదాన్ని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు తమ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వినిపించారు. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో శనివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభావేదికపై ఈ కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. కడప జిల్లా కళాకారులు ఉర్దూ గజల్స్‌తో ఆకట్టుకున్నారు. ఎల్బీ శ్రీరాంను అనుకరిస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ఓ కళాకారిణి చేసిన మిమిక్రీ ఆద్యంతం నవ్వులు పూయించింది. అలాగే చంద్రబాబు, బాలకృష్ణలకు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ చేసిన హాస్య కార్యక్రమంతో సభకు విచ్చేసినవారి ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరిశాయి. చేయెత్తి జైకొట్టు తెలుగోడా... అంటూ సచివాలయ ఉద్యోగిని సత్యసులోచన బృందం ఆలపించిన పాటలు ఉత్సాహపరిచాయి. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల బృందం వినిపించిన ‘వెయ్యి నినాదాల సహస్రోత్తరం’తో సభలో సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. ‘మాకొద్దు మాకొద్దు మీ నజరానా... హైదరాబాద్ అందరి ఖజానా’ అంటూ తమ గానంతో అనంతపురం ఉద్యోగుల జేఏసీ మహిళలు సమైక్యవాదాన్ని చాటారు.
ప్రత్యేకంగా శ్రీనివాస్ గజల్స్
ప్రముఖ గాయకుడు శ్రీనివాస్ వినిపించిన గజల్స్‌తో సమైక్యవాదుల గుండెలు ఉప్పొంగాయి. విభజనతో నష్టాలు, కలసిఉంటే కలిగే సుఖసంతోషాలను మధ్యమధ్యలో ఆయన వివరించడం ఆకట్టుకుంది. ఇది ఆత్మీయ సదస్సు కాదు, తెలుగుతల్లి కోసం చేస్తున్న తపస్సు అని ఆయన పేర్కొన్నారు. సమైక్య ఉద్యమంపై శ్రీనివాస్ గజల్స్‌తో రూపొందించిన సీడీలను సభావేదికపై ఆవిష్కరించారు. సాంస్కృతిక వేదికపైకి రావాల్సిన ఉత్తరాంధ్ర కళాకారుడు ‘వంగపండు’ బృందాన్ని పోలీసులు సభలోకి అనుమతించకపోవడంతో ఉద్యోగులు కొంత నిరాశ చెందారు.