కాంగ్రెస్ చేతగాని తనం వల్లే: మైసూరా
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు అమానుషమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హాజరై తిరిగి స్వస్థలానికి బస్సులో పయనమై హయత్నగర్ వద్ద అంగతకులు జరిపిన రాళ్ల దాడిలో గాయపడి ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం మైసూరా రెడ్డి ప్రసంగిస్తూ... దేశంలో ఎవరు ఎక్కడైనా సమావేశాలు నిర్వమించుకోవచ్చని ఆన్నారు.
ఏపీఎన్జీవో నేత సత్యనారాయణపై దాడిని ఆయన సందర్భంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని మైసూరారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆయనతోపాటు పలువురు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సత్యనారాయణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
సమైక్యాంధ్ర మద్దతుగా సెప్టెంబర్ 7న ఏపీఎన్జీవోలు హైదరాబాద్ నగరంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించారు. ఆ సభను సీమాంధ్ర ప్రాంతం నుంచి వేలాది మంది హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ సభ ముగిసిన తరువాత శనివారం రాత్రి ఏపీఎన్జీవోలు బస్సుల్లో స్వస్థలాలకు బయలుదేరారు. అయితే నగర శివారు ప్రాంతమైన హయత్ నగర్ వద్ద సీమాంధ్రులు ప్రయాణిస్తున్న బస్సులపై ఆగంతకులు రాళ్ల వర్షం కురింపించారు. ఆ ఘటనలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు వెంటనే ఆయన్ని హయత్ నగర్లోని సన్రైస్ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం సత్యనారాయణను నగరంలోని ఆపోలో ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. సత్యనారాయణ కాకినాడలోని వాణిజ్యపన్నుల శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు.