సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీఎన్జీఓలు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ, సంబంధిత పరిణామాలపై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు శనివారం పలు ఫిర్యాదులు అందాయి. సభా వేదిక సమీపంలో జై తెలంగాణ నినాదాలు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ కయ్యాడ శ్రీనివాస్‌గౌడ్ (పీసీ నం.2442)పై ఏఆర్ ఎస్సై మసూద్ పాషా ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా ప్రాకారానికి చెందిన శ్రీనివాస్ సిద్దిపేట ఏఆర్ సబ్ హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఇతడితో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో కానిస్టేబుల్ శ్రీశైలం (పీసీ నం- 2275) కూడా సభ బందోబస్తులో పాల్గొన్నారు. సభ కొనసాగుతుండగా ఉన్నట్టుండి శ్రీనివాస్ జై తెలంగాణ నినాదాలు చేయడంతో అతడిపై కొందరు పోలీసులు దాడి చేశారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన శ్రీశైలం కూడా గాయపడ్డారు. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లకు రవీంద్రభారతి చౌరస్తా వద్ద డ్యూటీ వేస్తే అక్కడికి కాకుండా ఎల్బీ స్టేడియంలో సభా ప్రాంగణం వద్దకు వెళ్ళారని, అక్కడ వారు విధుల్లోనే లేరని ఎస్సై పాషా ఫిర్యాదు చేశారు. జై తెలంగాణ అని నినాదాలు చేసినందుకు కానిస్టేబుల్‌పై దాడి చేశారంటూ టీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, జూపల్లి క్రిష్ణారావు, వినయ్‌భాస్కర్, సుధాకర్‌రెడ్డి, వివేక్, కేశవరావులు ఫిర్యాదు చేశారు.
సైఫాబాద్ ఏసీపీ జగన్నాథరెడ్డి ప్రోద్బలంతోనే ఏఆర్ ఎస్సై ఇద్దరు కానిస్టేబుళ్లపై ఫిర్యాదు చేశారని హరీష్‌రావు ఆరోపించారు. మరోపక్క విధి నిర్వహణలో ఉన్న తమపై సీమాంధ్ర ప్రాంతంవారు అకారణంగా దాడి చేశారని, వారిపై చట్ట ప్రకారం చ ర్యలు తీసుకోవాలని కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శ్రీశైలం వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చారు. ఇలావుండగా జాతీయగీతాన్ని తప్పుగా ఆలపించారని పేర్కొంటూ న్యాయవాది బద్దం నర్సింహారెడ్డి గజల్ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. ఐజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉద్యోగి కాని గజల్ శ్రీనివాస్‌ను సభా ప్రాంగణంలోకి స్వయంగా తీసుకువెళ్ళడం గమనిస్తే చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని స్పష్టమైందని హరీష్‌రావు అన్నారు.