ఎపీఎన్జీవోల సభతో అపవిత్రమైంది
ఎపీఎన్జీవోల సభతో అపవిత్రమైంది
Published Mon, Sep 9 2013 1:42 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఫోరం మండిపడింది. ఏపీఎన్జీవోలు నిర్వహించిన సభ వల్ల ఎల్‌బీ స్టేడియం అపవిత్రంగా మారిందంటూ ఆదివారం స్టేడియంలో పాలాభిషేకం నిర్వహించి శుద్ధి కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, శ్రీరంగారావు మాట్లాడుతూ ఏపీఎన్జీవోలు నిర్వహించిన సభలో 10 శాతం మాత్రమే ఉద్యోగులు ఉన్నారని, మిగతా వారిని కిరాయికి తీసుకువచ్చి సభను విజయవంతం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, డీజీపీల అండదండలతోనే సీమాంధ్రులు తెలంగాణవాదులపై దాడులకు పాల్పడ్డారని, వీరికి తెలంగాణ ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారన్నారు. ఓయూ జేఏసీ నేత బాల్‌రాజ్‌యాదవ్‌పై జరిగిన దాడిని ఖండించిన జేఏసీ సభ్యులు.. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర, తిరుపతివర్మ, బ్రహ్మానందరెడ్డి, జి. మోహన్‌రావులతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement