‘సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ’ విజయవంతం | Save andhra pradesh meet successful | Sakshi
Sakshi News home page

‘సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ’ విజయవంతం

Published Sun, Sep 8 2013 1:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

‘సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ’ విజయవంతం

‘సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ’ విజయవంతం

హైదరాబాద్‌లో కదం తొక్కిన ఉద్యోగులు
హైదరాబాద్:
రాష్ట్ర రాజధాని వేదికగా ఉద్యోగుల సమైక్య నినాదం మారుమోగింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ శనివారం హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ఏపీఎన్‌జీవోలు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహన సదస్సు’ అనూహ్య విజయం సాధించింది. సీమాంధ్రలోని పదమూడు జిల్లాలతో పాటు.. హైదరాబాద్ నగరం నుంచి కూడా సమైక్యవాదులు సభకు పోటెత్తారు. విభజన వద్దు.. సమైక్యమే ముద్దు.. అంటూ ఎలుగెత్తి నినదించారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, ఆర్‌టీసీ కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని.. అన్ని రంగాల్లోనూ దెబ్బతింటామని ఆందోళన వ్యక్తంచేశారు. విభజనపై వెనక్కితగ్గే వరకు ఉద్యోగుల సమ్మె కొనసాగుతుందని స్పష్టంచేశారు. విభజన ప్రక్రియపై ముందుకెళితే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఒకవైపు తెలంగాణ జేఏసీ పిలుపుతో తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలోనూ బంద్ పాటించటం.. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సమైక్య సభను అడ్డుకునేందుకు ర్యాలీగా వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు నిలువరించటంతో ఓయూలో ఉద్రిక్తత తలెత్తటం.. ఇంకోవైపు సభకు తరలివస్తున్న ఉద్యోగులతో నిజాం కాలేజీ వద్ద కొందరు విద్యార్థులు ఘర్షణకు దిగటం వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్, మునిసిపాలిటీ, రెవెన్యూ సిబ్బంది, ఆర్‌టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. శుక్రవారమే కొందరు ఉద్యోగులు నగరానికి చేరుకోగా.. శనివారం ఉదయానికి రైళ్లు, బస్సుల్లో పెద్ద సంఖ్యలో వచ్చారు. సభకు వస్తున్న ఉద్యోగులను ఉదయం ఎల్‌బీ నగర్ వద్ద ఆందోళనకారులు అడ్డుకోవటంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎల్‌బీ స్టేడియంలోని సభా ప్రాంగణానికి ఉదయం 9 గంటల నుంచే ఉద్యోగుల రాక ప్రారంభమైంది. పోలీసులు గుర్తింపుకార్డులను పరిశీలించిన తర్వాతే ఉద్యోగులను స్టేడియం లోపలికి అనుమతించారు. ఉద్యోగులతో ఎల్‌బీ స్టేడియం పూర్తిగా నిండిపోగా ఇంకా ఎంతో మంది స్టేడియం వెలుపలే నిలిచిపోయారు. సభ ప్రారంభానికి ముందు ‘ఇప్పటి దాకా కలసి ఉన్నాం... ఇకపైనా క లిసేఉందాం...’,  ‘మాకొద్దు మాకొద్దు మీ నజరానా... హైదరాబాద్ అందరి ఖజానా...’ అంటూ వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమైక్యవాదం వినిపించారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైంది. సభకు అంతరాయం కలిగించటానికి ఒక వ్యక్తి వేదికపైకి చెప్పు విసరటం, ఒక పోలీస్ కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు చేయటం మినహా.. స్టేడియంలో సభ ప్రశాంతంగా సాగింది.

ఓట్లేసి ఎన్నుకునేది విభజించటానికి కాదు...
రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే కష్టనష్టాలు, సమైక్యంగా కొనసాగటం వల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరిస్తూ వక్తల ప్రసంగాలు సాగాయి. విభజన జరిగితే విద్యార్థులు, ఆర్‌టీసీ కార్మికులు, ఉద్యోగులే ఎక్కువగా నష్టపోతారని.. వారి కోసమే ఈ సభను నిర్వహించాం తప్ప ఎవరికో వ్యతిరేకంగానో, రాజకీయ లబ్ధి కోసమో కాదని ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు స్పష్టంచేశారు. రాజకీయ పార్టీలను, నాయకులను ఓట్లేసి ఎన్నుకునేది ప్రజలను పాలించడానికి కానీ, విభజించడానికి కాదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆమోదం లేనిదే విభజనపై కేంద్రం వెనక్కు వెళ్లలేకపోయినా.. ముందుకు మాత్రం వెళ్లలేదని స్పష్టంచేశారు. విభజనపై ముందుకు వెళితే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఎప్పుడు ఆగిపోతుందో, ఎటు వెళుతుందనే దానిపై ఇప్పుడే చెప్పలేమని.. ఈ నెల 16 తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఐదున్నర వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆర్‌టీసీ.. రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణం మూతపడుతుందని, సీమాంధ్ర 13 జిల్లాల్లోని 70 వేలకు పైగా ఉద్యోగులు రోడ్డున పడుతారని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన దిశగా కేంద్రం ముందుకు వె ళ్తే విద్యుత్ విషయంలో రాష్ట్రం అంధకారమవుతుందని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి చేసి.. 54 శాతం విద్యుత్ తెలంగాణలో, 46 శాతం సీమాంధ్రలో వినియోగిస్తున్నారని, వ్యవసాయానికి 80 శాతం ఉచిత విద్యుత్ తెలంగాణలోనే ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందని డాక్టర్ మిత్ర పేర్కొన్నారు. ఊరు తగులబడుతుంటే ఎన్నికల్లో ఓట్ల కోసం చరిత్ర చెబుతూ బస్సు యాత్ర చేయడం ఏమిటని.. రాష్ట్ర విభజనకు పొరపాటుగా లేఖ ఇచ్చి ఉంటే ఆ లేఖను వెనక్కి తీసుకోవాలని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. మెడపై కత్తిపెట్టి జై తెలంగాణ అనాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, అనకపోతే విద్రోహులు అంటూ ముద్ర వేస్తున్నారని హిందూవాహిని నాయకురాలు సత్యవాణి ధ్వజమెత్తారు. సభ ఆఖరులో సమైక్య గీతాల సీడీని, సమైక్య శంఖారావం పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 3:20 గంటల పాటు సాగిన సభ.. సాయంత్రం 5:20 గంటలకు జాతీయ గీతాలాపనతో ముగిసింది. సాయంత్రం సభ ముగించుకుని తిరిగివెళ్తున్న ఉద్యోగుల బస్సులపై ఎల్‌బీనగర్, చింతల్‌కుంట, హస్తినాపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో పలు బస్సుల అద్దాలు పగలగా ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి.

‘కొమరం భీం’ ప్రవేశద్వారం
‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహన’ సభా ప్రాంగణానికి పొట్టి శ్రీరాములు పేరుపెట్టారు. విశాల వేదికకు రెండు పేర్లు పెట్టారు. ఒకవైపు గురజాడ అప్పారావు సాంస్కృతిక వేదిక అని, మరోవైపు బూర్గుల రామకృష్ణారావు వేదిక అని నామకరణం చేశారు. ఆ ఇద్దరి చిత్రాలతో కూడిన హోర్డింగ్‌ను వేదికకు నేపథ్యంగా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం ప్రవేశద్వారాలకు కొమరం భీం, బెజవాడ గోపాలరెడ్డి పేర్లు పెట్టారు. సభికులు కూర్చునే వేదికలకు శ్రీకృష్ణ దేవరాయలు, సురవరం ప్రతాపరెడ్డి, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు.

సీఎం పేరు ప్రస్తావనపై సభికుల్లో విస్మయం
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో కొందరు వక్తలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తావన తీసుకురావటంపై సభికుల్లో విస్మయం వ్యక్తమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినా కిమ్మనని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో అర్థంకావటం లేదని సభకు వచ్చిన వారు బహిరంగంగా మాట్లాడుకోవటం కనిపించింది. తెలంగాణ తీర్మానం చేసిననాడే పదవికి రాజీనామా చేయకుండా.. పదవిని పట్టుకుని వేలాడుతున్న వ్యక్తిని పొగిడేలా మాట్లాడటం చూస్తుంటే అనుమానం కలుగుతోందని వారు వ్యాఖ్యానించటం గమనార్హం. ఓ వైపు తెలంగాణ రాష్ట్రం కోసం కేబినెట్ నోట్ తయారవుతుందంటూ సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి షిండే స్పష్టం చేసినా నోరు మెదపని ముఖ్యమంత్రిని వెనకేసుకురావటం చూస్తే కచ్చితంగా ఏదో జరుగుతోందన్న అనుమానాన్ని వారు వ్యక్తంచేశారు.

వేదికపై ఎవరెవరున్నారంటే..
పి. అశోక్‌బాబు (ఏపీఎన్జీవో అధ్యక్షుడు), ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి (ప్రధాన కార్యదర్శి), సి.హెచ్.చంద్రశేఖర్‌రెడ్డి (ఆర్టీసీ, ఈయూ), పి.దామోదర్‌రావు (ఆర్టీసీ, ఈయూ), ఆర్.వి.వి.ఎస్.డి ప్రసాదరావు (ఆర్టీసీ, ఎన్‌ఎంయూ), పి.ఎన్. రమణారెడ్డి (ఆర్టీసీ, ఎన్‌ఎంయూ), కమలాకర్ (టీచర్స్ జేఏసీ), ప్రొఫెసర్ శ్రీకాంత్‌రెడ్డి (ఎస్వీ యూనివర్సిటీ), బి. వెంకటేశ్వరరావు (రెవెన్యూ), ఎ. వెంకటేశ్వరావు (పారిశ్రామికవేత్తల సంఘం), పి. మధుసూదన్‌రెడ్డి (సినీ నిర్మాత), మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి, కృష్ణయ్య (సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం), ఎం. వంశీకృష్ణ (జర్నలిస్టు), డాక్టర్. కె. రాజేంద్ర (డాక్టర్ల జేఏసీ), కె.శ్రీనివాసరెడ్డి (విశాలాంధ్ర మహాసభ), ఎం.జయకర్ (న్యాయవాది), ఎ.విజయ్‌కుమార్ (ఫ్యాప్సియా), కె. విజయ్‌కుమార్ (దళిత్ ఫోరం), కె. చిరంజీవిరెడ్డి (ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల సంఘం), పి.శ్రీనివాసరావు, ఎం. సత్యానందం (విద్యుత్ జేఏసీ), హరిప్రసాద్ (ఏపీజెన్‌కో), కుమార్‌చౌదరియాదవ్, ఎన్. శ్రీహరి (సమైక్య ఏపీ సంరక్షక పార్టీ), డేవిడ్ (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జేఏసీ), దినకర్ (సీఏ అసోసియేషన్), హేమలత (ఆలిండియా మహిళా సంఘం), కృష్ణయాదవ్ (విద్యార్థి జేఏసీ), కారెం శివాజీ (మాలమహానాడు), చలసాని శ్రీనివాసరావు (ఆంధ్ర మేధావుల సంఘం), కె.నాగరాజు (ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్), జంధ్యాల రవిశంకర్ (న్యాయవాది), సత్యవాణి (హిందూవాహిని), ప్రొఫెసర్ నర్సింహారావు (నాగార్జున యూనివర్సిటీ), ప్రొఫెసర్ శామ్యూల్ (పొలిటికల్ జేఏసీ), కృష్ణమోహన్ (మున్సిపల్ ఉద్యోగుల సంఘం), డాక్టర్ మిత్రా, పి.వి.వి. సత్యనారాయణ (ఏపీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు), గజల్ శ్రీనివాస్ (గాయకుడు), బాబూరావు (డిప్యూటీకలెక్టర్ల సంఘం), లక్ష్మణరెడ్డి (జనచైతన్య వేదిక), మణికుమార్ (గెజిటెడ్ అధికారుల సంఘం).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement