- గజల్ శ్రీనివాస్‌ను లోపలికి అనుమతించటంపై ఫిర్యాదు
- దర్యాప్తు బాధ్యతలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు
- నిందితుల గుర్తింపునకు వీడియో ఫుటేజ్‌ల పరిశీలన
సభపై 7 కేసులు నమోదు
Published Mon, Sep 9 2013 1:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీఓలు శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించినృ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంబంధించి స్థానిక సైఫాబాద్ పోలీస్‌స్టేషన్లో శని, ఆదివారాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. రెచ్చగొట్టేలా ప్రవర్తించటం, బెదిరించటం, తీవ్రంగా దాడి చేయటం, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద వీటిని నమోదు చేశారు. ఉద్యోగి కాని గజల్ శ్రీనివాస్‌ను సభకు అనుమతించటం, సభలో ఆయన ప్రసంగించడంపై అందిన ఫిర్యాదును జనరల్ డైరీలో నమోదు చేసిన పోలీసులు కేసు నమోదుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 7 కేసులను దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు బదిలీ చేశారు. సభలో పాల్గొనేందుకు బషీర్‌బాగ్ చౌరస్తా వైపు నుంచి నిజాం కాలేజీ హాస్టల్ మీదుగా స్టేడియం ‘జీ’ గేట్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి చేష్టలు వివాదాస్పదమయ్యాయి.
నినాదాలు చేస్తున్న హాస్టల్ విద్యార్థులను ఉద్దేశించి అతడు రెచ్చగొట్టే సంజ్ఞ చేయడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. ఆ తరవాత ఒక్కసారిగా హాస్టల్ లోపల నుంచి రాళ్ల వర్షం కురిపించడంతో సభకు వెళ్తున్న పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించి అందిన ఫిర్యాదుతో వివాదాస్పదంగా సంజ్ఞలు చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సభ ప్రారంభమైన తరవాత వేదిక సమీపంలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేసిన తమపై కొందరు దాడి చేశారంటూ ఏఆర్ కానిస్టేబుళ్లు కయ్యాడ శ్రీనివాస్, శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదులతో మరో రెండు కేసుల్ని నమోదు చేశారు. అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో ఆందోళన చేస్తున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్టు సందర్భంగా నిరసనకారులు ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అసెంబ్లీ ఎదురుగా తెలంగాణ న్యాయవాదుల్ని అరెస్టు చేస్తున్నప్పుడు నాలుగు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించి సైఫాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
తమపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇచ్చిన ఫిర్యాదుతోపాటు సభకు వచ్చిన కొందరు తనపై దాడి చేశారంటూ ఓయూ జేఏసీ నేత కన్వీనర్ బాలరాజు యాదవ్ ఫిర్యాదు మేరకు మరో రెండు కేసులు రిజిస్టర్ చేశారు. ఈ ఏడు కేసుల్లో నిందితుల్ని గుర్తించడం కోసం స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియో టేపులను పరిశీలిస్తున్నారు. వీటిని విశ్లేషించిన తరువాత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గజల్ శ్రీనివాస్ సభలోకి ప్రవేశించిన తీరును కూడా వీడియో ఫుటేజ్‌ల ద్వారా గుర్తించాలని నిర్ణయించారు. కాగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ఎల్బీస్టేడియంలో నిర్వహించిన ఏపీఏన్జీవో నాయకులపై తెలంగాణ విద్యార్థి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
సీమాంధ్రుల బస్సులపై దాడి ఘటనలో 13 మంది అరెస్ట్!
ఇదిలా ఉండగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరై హైదరాబాద్ నుంచి తిరిగి వెళుతున్న సీమాంధ్రుల బస్సులపై దాడి ఘటనలో 13 మంది అనుమానితుల్ని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement