ప్రభుత్వ డైరెక్షన్లోనే 'సేవ్ ఆంధ్రప్రదేశ్': బలరాం నాయక్
రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్లోనే ఏపీఎన్జీవోలు నిన్న నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ జరిగిందని కేంద్ర మంత్రి పి.బలరాం నాయక్ అభిప్రాయపడ్డారు. ఆదివారం వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్లో జరిగిన చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వికలాంగులకు ఆయన మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... సీమాంధ్రులతో కలిసి ఉండలేమని నిన్నటి సభతో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.
జై తెలంగాణ అంటేనే దాడులు చేస్తున్న మీతో ఎందుకు కలిసి ఉండాలని ఆయన సీమాంధ్రులను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత ప్రజలపై నిన్న దాడి జరిగిన టీ మంత్రులు ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మీరు అనుసరిస్తున్న వైఖరి వల్లనే గతంలో కూడా మద్రాస్ నుంచి వెళ్లగొట్టారని, ఆ సంగతిని గుర్తుంచుకోవాలని సీమాంధ్రులకు ఈసందర్బంగా పి.బలరాం నాయక్ హితవు పలికారు.