Gazal Srinivas
-
జనవరి 6 నుంచి అంతర్జాతీయ తెలుగు సంబరాలు
సాక్షి, కాళ్ల: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ (భీమవరం) ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నట్టు పరిషత్ పాలకమండలి చైర్మన్ గజల్ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. పెదఅమిరంలోని వెస్ట్‌బెర్రీ హైస్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ముందుగా జనవరి 3న భీమవరంలో తెలుగు భాష వైభవ శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. జనవరి 6న ప్రాచీన కవులు, రాజవంశీయుల కుటుంబీకులకు ఆంధ్ర వాయ పూర్ణకుంభ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జనవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగింపు సభ, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి, రవాణా, భోజన సదుపాయం కల్పిస్తామని జిల్లా ఉత్సవ కమిటీ నేతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు రాయప్రోలు భగవాన్, కేశిరాజు రామ్‌ప్రసాద్, భట్టిప్రోలు శ్రీనివాస్, బి.రాంబాబు, లక్ష్మణ వర్మ, మంతెన రామ్‌కుమార్ రాజు, మేడికొండ శ్రీనివాస చౌదరి, జ్యోతి రాజ్, ఒడుపు గోపి, మహేష్ పాల్గొన్నారు. (చదవండి: 12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు) -
బెజవాడ విద్యార్థికి ‘గిన్నిస్’లో స్థానం
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన విద్యార్థి మల్లాది రాహత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 2018 జనవరి 6వ తేదీన గాంధీనగర్‌లోని హోటల్ ఐలాపురంలో దాదాపు 8 గంటలపాటు 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో మొత్తం 105 పాటలు పాడి రికార్డ్ సృష్టించాడు. (వివిధ భాషల్లో 76 పాటలు పాడిన గజల్ శ్రీనివాస్ పేరిట గత రికార్డు ఉండేది). అన్ని రకాలుగా పరిశీలించిన అనంతరం వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్›లో రాహత్ పేరు నమోదు చేసి ‘మోస్ట్ లాంగ్వేజెస్ సంగ్ ఇన్ కాన్సర్ట్’ బిరుదుకు ఎంపిక చేసినట్లు గురువారం సమాచారం అందించారు. రాహత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గతంలో సాక్షి దినపత్రిక నిర్వహించిన పోటీలో వండర్ కిడ్ అవార్డు అందుకున్నాడు. పలు సాంస్కృతిక సంస్థలు ఉగాది పురస్కారాలతో సత్కరించాయి. బాలల చిత్రం దాన వీర శూర కర్ణ చిత్రంలో శకునిగా నటించడంతోపాటు ఇతర పౌరాణిక నాటకాలలో శ్రీకృష్ణుడు, అనిరుద్ధుడు, నారదుడు, శ్రీ మహావిష్ణువు పాత్రలలో నటించి మెప్పించాడు. గతేడాది నంది నాటకోత్సవాల్లో పౌరాణిక నాటక విభాగంలో నంది అవార్డ్ గెలుచుకున్నాడు. రాహత్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం పట్ల నగరానికి చెందిన పలు కళా సంస్థలు, రాహత్ చదువుతున్న పాఠశాల అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. -
గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
-
లైంగిక వేధింపులు ; ‘గజల్’ శ్రీనివాస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : యువతిపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ ‘గజల్’ శ్రీనివాస్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కొంతకాలంగా శ్రీనివాస్ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు చర్యలకు ఉపక్రమించినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఆమె రేడియో జాకీ : లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలు.. ఆలయవాణి అనే వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తున్నారు. ఈ వెబ్ రేడియో గజల్ శ్రీనివాస్‌దే కావడం గమనార్హం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ప్రాధమిక దర్యాప్తు జరిపిన వెంటనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. వీడియో ఆధారాలు?: ఆథ్యాత్మికత, దేశభక్తి, మహిళల భద్రత తదితర అంశాలపై ఎన్నో కళారూపాలు చేసిన గజల్ శ్రీనివాస్ లైంగికవేధింపుల కేసులో అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేసుకు సంబంధించి వీడియోలు, ఆడియోలు వంటి పూర్తి ఆధారాలతోనే బాధితురాలు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. -
ఘాట్లు పర్యాటక క్షేత్రాలవ్వాలి
అప్పుడే వెచ్చించిన వ్యయానికి సార్థకత ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ చింతపల్లి (అచ్చంపేట): కోట్లాది రూపాయలతో నిర్మించిన పుష్కర ఘాట్లు, పుష్కరాలు అయిపోగానే అంతరించకూడదని, నవ్యాంధ్రలో పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని, అప్పుడే ప్రభుత్వం వెచ్చించిన వ్యయానికి సార్థకత వస్తుందని సుప్రసిద్ధ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన చింతపల్లి పుష్కర ఘాట్‌ను, ఘాట్ ఒడ్డునే నిర్మాణంలో ఉన్న శ్రీ విష్ణు పంచాయతన దివ్యమహాక్షేత్రాన్ని సందర్శించారు. దేవాలయాలను కుల్చివేస్తున్న ఈ తరుణంలో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాల పునరుద్ధరణకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గోమాత, గోపురం, దేవాలయం, గంగ (నదీజలం) ఎక్కడ పూజింపబడతాయో అక్కడ సంపదలు, మంచి ఆరోగ్యం, శాంతి ఉంటాయని ఆయన చెప్పారు. గుండె బాగుంటేనే దేహం బాగుంటుందని, గుడి బాగుంటేనే దేశాలు బాగుంటాయని అన్నారు. కృష్ణానది ఒడ్డున మంగళగిరి, కోటప్పకొండ, అమరావతి వంటి పుణ్య క్షేత్రాలు ఉండబట్టే వాటికి అంత ప్రాముఖ్యత వచ్చిందన్నారు. రానున్న కాలంలో చింతపల్లి ఒక మహాపుణ్య క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా రుపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. గొప్పగొప్ప రుషులు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసి దేవాలయాలను నిర్మించారని, వాటిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నదీ పరివాహక ప్రాంతాలలోని దేవాలయాలలో దేవతలు సంచరిస్తూ ఉంటారని, సంగీతం ఆలపిస్తుంటారని సనాతన ధర్మం చెబుతోందన్నారు. సీనీ గాయకుడు నాగూర్బాబుతో కలసి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన్మందిరంలో ప్రోగ్రాం ఇచ్చానని, అందులో వచ్చిన ఆదాయాన్ని ఈ ఆలయ అభివృద్ధికి కేటాయిస్తున్నానన్నారు. ఆలయ నిర్మాణానికి తనతో పాటు సహకరించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు మిట్టుపల్లి రమేష్, గుంటూరు మాస్టర్‌మైండ్స్, తాడిశెట్టి మురళి, యర్రంశెట్టి వేణుగోపాల్ తదితరులను ఆయన ఘనంగా సత్కరించారు. -
లెంపకాయలేస్తామంటే.. గంపెడు పూలు పంపిస్తాం
తాడేపల్లిగూడెం: లెంపకాయలేస్తామంటే.. గంపెడు పూలు పంపిస్తాం. తెలుగుతల్లి మొదలేదో తల్లి వేరునడుగు.. నీ సంస్కృతి వేరంటే బతుకమ్మనే పాడేస్తానంటూ గజల్స్ శ్రీనివాస్ చేసిన గీతాలాపన ఆకట్టుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం స్థానిక జేఏసీ, వైసీపీ రిలే దీక్షా శిబిరాలను ఆయన సందర్శించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు రాష్ట్రం కలిసి ఉండటానికి ఇంతగా ఉద్యమిస్తున్న రాజకీయ నాయకులకు బుద్ధి రాలేదని, వారు ఇలాగే ఉంటే బ్యాలెట్ బాక్సులలో పొలిటికల్ ఫాక్సులకు (నక్కలకు) బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా గాంధేయ మార్గంలో జరుగుతున్న ఉద్యమంగా సమైక్యాంధ్ర ఉద్యమం పేరొందిందన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదటానికి ఓయ్.. తెలుగువాడా గీతం జీవం పోయడం పూర్వజన్మసుకృతమన్నారు. వెంకటేశ్వరునిపై పాడిన గీతానికంటే ఓయ్ తెలుగువాడా ప్రాచుర్యం పొందిందన్నారు. ఉద్యమం ఇంకా వేడెక్కాలన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రైళ్లలో పాట యాత్ర ప్రారంభించనున్నట్టు శ్రీనివాస్ వెల్లడించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఈ రైలు పాట యాత్ర ఉంటుందన్నారు. సమైక్య ఉద్యమంలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. అపార్టుమెంటుల్లోని మహిళలు రిలే దీక్షలలో పాల్గొనడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. 108 గంటల పాటు నిర్విరామంగా సమైక్యాంధ్ర పాటలపోటీ గూడెంలో ఏర్పాటు చేస్తే బాగుంటు ందని, అన్ని విధాలుగా తాను సహకరిస్తానని చెప్పారు. నాన్‌పొలిటికల్ శిబిరంలో కూర్చున్న మహిళలను అభినందించారు. వైసీపీ శిబిరంలో దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. వైసీపీ సమన్వయకర్త తోట గోపి, జేఏసీ చైర్మన్ ఈతకోట తాతాజీ, పైలు శ్రీనివాసు తదితరులు ఉన్నారు. -
‘సమైక్యత’ చాటిన సాంస్కృతిక కార్యక్రమాలు
‘ఇప్పటి దాకా కలసి ఉన్నాం... ఇకపైనా కలిసేఉందాం...’ అంటూ సమైక్య వాదాన్ని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు తమ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వినిపించారు. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో శనివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభావేదికపై ఈ కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. కడప జిల్లా కళాకారులు ఉర్దూ గజల్స్‌తో ఆకట్టుకున్నారు. ఎల్బీ శ్రీరాంను అనుకరిస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ఓ కళాకారిణి చేసిన మిమిక్రీ ఆద్యంతం నవ్వులు పూయించింది. అలాగే చంద్రబాబు, బాలకృష్ణలకు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ చేసిన హాస్య కార్యక్రమంతో సభకు విచ్చేసినవారి ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరిశాయి. చేయెత్తి జైకొట్టు తెలుగోడా... అంటూ సచివాలయ ఉద్యోగిని సత్యసులోచన బృందం ఆలపించిన పాటలు ఉత్సాహపరిచాయి. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల బృందం వినిపించిన ‘వెయ్యి నినాదాల సహస్రోత్తరం’తో సభలో సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. ‘మాకొద్దు మాకొద్దు మీ నజరానా... హైదరాబాద్ అందరి ఖజానా’ అంటూ తమ గానంతో అనంతపురం ఉద్యోగుల జేఏసీ మహిళలు సమైక్యవాదాన్ని చాటారు. ప్రత్యేకంగా శ్రీనివాస్ గజల్స్ ప్రముఖ గాయకుడు శ్రీనివాస్ వినిపించిన గజల్స్‌తో సమైక్యవాదుల గుండెలు ఉప్పొంగాయి. విభజనతో నష్టాలు, కలసిఉంటే కలిగే సుఖసంతోషాలను మధ్యమధ్యలో ఆయన వివరించడం ఆకట్టుకుంది. ఇది ఆత్మీయ సదస్సు కాదు, తెలుగుతల్లి కోసం చేస్తున్న తపస్సు అని ఆయన పేర్కొన్నారు. సమైక్య ఉద్యమంపై శ్రీనివాస్ గజల్స్‌తో రూపొందించిన సీడీలను సభావేదికపై ఆవిష్కరించారు. సాంస్కృతిక వేదికపైకి రావాల్సిన ఉత్తరాంధ్ర కళాకారుడు ‘వంగపండు’ బృందాన్ని పోలీసులు సభలోకి అనుమతించకపోవడంతో ఉద్యోగులు కొంత నిరాశ చెందారు.