సమైక్య సందడి | Samikaya Sandadi | Sakshi
Sakshi News home page

సమైక్య సందడి

Published Sun, Sep 8 2013 4:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

సమైక్య సందడి - Sakshi

సమైక్య సందడి

సమైక్య నాదం మిన్నంటింది. ఏపీ ఎన్జీవోల సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. నగరవ్యాప్తంగా కూకట్‌పల్లి, లింగంపల్లి, చందానగర్, భరత్‌నగర్, మూసాపేట్, మాదాపూర్, జూబ్లీహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ముషీరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, నాగోలు, ఈసీఐఎల్, తార్నాక తదితర ప్రాంతాల్లో నివసించే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమతో పాటు కుటుంబ సభ్యులను సభాప్రాంగణానికి తీసుకువచ్చారు.

గుర్తింపు కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే పోలీసులు అనుమతించడంతో.. వేలాది మంది జనం ప్రాంగణం వెలుపలే ఉండిపోయారు. స్టేడియం బయట ఏర్పాటు చేసిన బిగ్‌స్క్రీన్‌ల ద్వారా వక్తల ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు. పోలీసులతో పాటు నగరవాసుల్నీ తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఏపీఎన్జీఓల సభ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. సిటీ మొత్తం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన నగర పోలీసులు ఎల్బీ స్టేడియం, ఓయూ పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా 366 మందిని అరెస్టు చేసి విడుదల చేశారు.     
 
 ఇవీ విశేషాలు...
 ఉదయం 6 గంటల నుంచే ఏపీ ఎన్జీవోస్ ఎల్‌బీ స్టేడియం వద్ద బారులు తీరారు.
 
  సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లకు వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులు సభాప్రాంగణానికి చేరుకునేందుకు బస్సులు లేక అవస్థలు పడ్డారు.
 
 సభ కోసం గన్‌ఫౌండ్రీ, సుజాతా స్కూల్, బషీర్‌బాగ్, అసెంబ్లీ ఎదురుగా నాంపల్లి ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో ప్రజలు పలు అవస్థలకు గురయ్యారు.
 
 సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో సుమారు 1500 మంది ఉద్యోగులు భారీ ర్యాలీగా సభకు హాజరయ్యారు.
 
 సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు సమైక్య నినాదాలు, నృత్యాలతో కదం తొక్కారు.
 
 శనివారం తెల్లవారుజామున ఉద్యోగులతో వస్తున్న ఏపీ 09 టీఏ 3969 నంబరు గల ప్రైవేటు బస్‌ను అనుసరిస్తూ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు చైతన్యపురి పుష్పాగార్డెన్ సమీపంలో రాళ్లు విసిరారు. దీంతో బస్ ముందు అద్దం పగిలింది. ఎవరికీ గాయాలు కాలేదు.
 
 బషీర్‌బాగ్ చౌరస్తా వైపు నుంచి నిజాం హాస్టల్ మీదుగా స్టేడియం ఁజీరూ. గేట్ వద్దకు వస్తున్న ఓ వ్యక్తి వివాదాస్పదంగా వ్యవహరించడంతో హాస్టల్ విద్యార్థులు భగ్గుమన్నారు.
 
 ఒక్కసారిగా హాస్టల్ నుంచి రాళ్ల వర్షం కురిపించడంతో సభకు వెళ్తున్న అనేకమంది గాయపడ్డారు.
 
 ఓ పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.
 
 రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్‌లో గాలించి టీఆర్‌ఎస్‌వీ నేత బాలుక సుమన్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.
 
 కేఎల్‌కే ఎస్టేట్ వైపు ఉన్న ఔటర్‌గేట్ వద్ద ఓయూ జేఏసీ నేత బాలరాజ్ యాదవ్‌తోపాటు మరో ముగ్గురు అక్కడ ఉన్న ఏపీఎన్జీఓల మధ్యకు వెళ్లి నల్లజెండాలు చూపుతూ జై తెలంగాణ నినాదాలు చేశారు.
 
 ఏపీఎన్జీఓలూ జై సమైక్యాంధ్ర నినాదాలు ప్రారంభించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బాలరాజ్‌తోపాటు మిగిలిన వారి పైనా దాడి చేశారు.
 
 నిజాం హాస్టల్‌లో ఉంటున్న కల్వకుర్తికి చెందిన శేఖర్ అనే విద్యార్థి భవనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడటంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స చేశారు.
 
 సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద ఉన్న కొందరు న్యాయవాదుల పైనా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
 
 అసెంబ్లీ మీదుగా వెళ్తున్న ప్రొటోకాల్ విభాగం కాన్వాయ్ వాహనంపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఓ స్కార్పియో అద్దాలు ధ్వంసం చేశారు.
 
 ఓ దశలో పీసీఆర్ చౌరస్తాలో ఏపీఎన్జీఓలు, తెలంగాణవాదులు ఎదురు కావడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు.
 
 ఐడీ కార్డు లేనందున గజల్ శ్రీనివాస్, వంగపండు ప్రసాద్‌లకు స్టేడియంలోకి అనుమతి నిరాకరించారు. దీంతో వంగపండు రోడ్డుపై భైటాయించి నిరసన వ్యక్తంచేశారు.
 
 మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో గజల్ శ్రీనివాస్‌ను స్టేడియంలోకి అనుమతించారు.
 
 ఎల్‌బీస్టేడియం బయట ప్రజాగాయకుడు వంగపండు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు భజనలు చేస్తూ పెద్ద ఎత్తున పాటలు పాడి అలరించారు.
 
 ఎంజీబీఎస్‌లో ఉదయం నుంచే బస్సులు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఎంజీబీఎస్‌కు వచ్చిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
 
 సాయంత్రం నిజాం హాస్టల్ ఎదురుగా ఓ పోలీసు వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
 
  స్టేడియంలోకి ప్రవేశించిన తెలంగాణవాది చంద్రశేఖర్, విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ జై తెలంగాణ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది.
 
  సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు తమపై దాడి చేశారంటూ తెలంగాణ జర్నలిస్టులు నిజాం హాస్టల్ వద్ద ధర్నా చేసి, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
 
 స్టేడియం లోపలకు అనుమతించక పోవడంతో అనేక మంది ఐడీ కార్డులు లేని ఏపీఎన్జీఓలు, ప్రైవేట్ ఉద్యోగులు గేట్ల వద్దే ఆగిపోయారు. వివిధ విడతల్లో ఆరుగురు వ్యక్తులు వీరి మధ్యకు వచ్చి జై తెలంగాణ నినాదాలు చేయడంతో పోలీసులు చెదరగొట్టారు.
 
 సభ ముగిసిన తరవాత సీమాంధ్ర వైపు తిరిగి వెళ్తున్న వాహనాలపై మలక్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి.
 
 నగరవాసుల ఆతిథ్యం


 సీమాంధ్ర జిల్లాల నుంచి తాము వస్తున్నట్లు ముందుగా సమాచారం ఇచ్చిన వారికి నగరవాసులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, మాదాపూర్.. తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాల్స్ బుక్‌చేసి ఆతిథ్యం ఇచ్చారు. దూరప్రాంతాల నుంచి నగరానికి అర్ధరాత్రి, వేకువ జామున బస్సుల్లో అలిసి వచ్చిన పలువురు ఉద్యోగులు సేదతీరారు. ఇదిలా ఉంటే.. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభా ప్రాంగణంలో కూడా సభికులకు అవసర మైన మేరకు మంచినీటి ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు, బిస్కట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వాలంటీర్ల ద్వారా మంచినీరు, అల్పాహారం స్టేడియంలోని వేలాది మందికీ చేరేలా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.
 
 366 మంది ముందస్తు అరెస్టు: అనురాగ్ శర్మ, కొత్వాల్


 ఏపీఎన్జీఓల సభ, బంద్ నేపథ్యంలో నగర వ్యాప్తంగా 366 మందిని ముందస్తు అరెస్టు చేసి విడిచిపెట్టినట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. వీరిలో మధ్య మండలంలో 147, తూర్పు మండలంలో 94, పశ్చిమ మండలంలో 39, ఉత్తర మండలంలో 86 మంది ఉన్నారన్నారు. మరోపక్క సిటీలో శనివారం ఎనిమిది ర్యాలీలు, 19 చోట్ల బలవంతంగా దుకాణాలు మూయించే ప్రయత్నాలు, ఆరు దిష్టిబొమ్మల ద హనాలు, నాలుగు ధర్నాలు, 12 నిరసన ప్రదర్శనలు, ఒకచోట రాస్తారోకో, మరోచోట రాళ్ల దాడి జరిగాయని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement