చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో 39 రోజులుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో వాణిజ్య సేవలు పూర్తి గా స్తంభించాయి. జూలై 30న కేంద్రప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నాటి నుంచి జిల్లాలోని ప్రతి ఉద్యోగి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగం గా జిల్లా వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు, సిబ్బంది సైతం కార్యాలయాలకు తాళాలు వేసి ప్రత్యక్ష అందోళనలో పాల్గొంటున్నారు.
దీంతో వ్యాపార సంస్థల నూతన రిజిస్ట్రేషన్లు, నెలవారి పన్నుల వసూళ్లు నిలచిపోయాయి. దీనికితోడు జిల్లాలో అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సైతం మూసివేశారు. అక్రమరవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రతినెలా జిల్లా వాణిజ్యశాఖ ద్వారా కనీసం సుమారు రూ.20 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతుంది. ఉద్యోగుల సమ్మె ప్రభావంతో జిల్లాలోని నరహరిపేట, చిత్తూరులోని ఠాణా చెక్‌పోస్టు, నాగలాపురం, పలమనేరు, తడుకు పేట చెక్ పోస్టులు పూర్తిగా మూతపడ్డాయి.
వీటితో పాటు అధికారులు జరిపే మహాచెక్‌లు ఆగిపోవటంతో ఈ శాఖకు రావలసిన ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడింది. దీంతో జిల్లా నుంచి ఎలాంటి తనిఖీలు లేకుండా గ్రానైట్, ఇతర నిత్యావసర వస్తువులు రాష్ట్ర సరిహద్దులు దాటి యథేచ్ఛగా వెళుతున్నాయి. నెలలో కేవలం ఉద్యోగుల తనిఖీలు లేకపోవడంతో గడచిన 35 రోజుల్లో ప్రభుత్వం సుమారు రూ.25 కోట్లు నష్టపోయింది.
పట్టు వీడని ఉద్యోగులు
జిల్లాలో సమ్మె చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, సిబ్బంది కేంద్రం దిగివచ్చి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని అంటున్నారు. రాష్ట్ర విభజన వల్ల తమ పిల్లల భవిష్యత్తు నష్టపోతుందంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ ప్రాణాలైనా అర్పిస్తాం, కాని సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను ఎటువంటిపరిస్థితుల్లోనూ వదులుకునేందుకు సిద్ధంగా లేమంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.
స్తంభించిన వాణిజ్య సేవలు!
Published Mon, Sep 9 2013 3:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement