business associates
-
ఆరంభ స్టార్టప్‌ల కోసం 130 మిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఫండమెంటల్ వీసీ’ ఆరంభ స్థాయిలోని స్టార్టప్‌ల కోసం 130 మిలియన్ డాలర్లతో (రూ.100 కోట్లు) నిధిని ప్రారంభించినట్టు ప్రకటించింది. కన్జ్యూమర్ ఇంటర్నెట్, ఆరోగ్య సంరక్షణ, బీమా, ఫైనాన్షియల్ సర్వీసెస్, సాస్, గేమింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్‌లకు పెట్టుబడులు అందిస్తామని తెలిపింది. ఈ ఏడాది మార్చిలోనే సెబీ నుంచి ఈ సంస్థకు అనుమతి లభించింది. ఒక్కో స్టార్టప్‌లో ఈ ఫండ్ 1.5 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెడుతుంది. వచ్చే రెండేళ్లలో 30 స్టార్టప్‌లకు మద్దతుగా నిలవాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. -
సెకెండ్ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదంట
ముంబై: కోవిడ్–19 ప్రతికూలతలతో తీవ్ర కష్టాల్లోకి వెళ్లిపోయి, రుణ పునర్ వ్యవస్థీకరణ తప్పదని భావించిన పలు కంపెనీలు ప్రస్తుతం తమ ధోరణిని మార్చుకుంటున్నాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంటున్నాయి.అదే సమయంలో మొదటి వేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం ఎకానమీలో రికవరీ జాడలు కనిపించడమే దీనికి కారణం. దీనితో ఆయా కంపెనీలపై వృద్ధి ధోరణిపై భరోసా ఏర్పడింది. దీనితో రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0కు కేవలం కొన్ని కంపెనీలే ముందుకు వస్తున్నాయి. తాను రేటింగ్ ఇచ్చిన 4,700 కంపెనీల్లో కేవలం ఒక శాతం అర్హత కలిగిన (రుణ పునర్వ్యవస్థీకరణకు) కంపెనీలు మాత్రమే రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0ను ఎంచుకున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ సుభోద్ రాయ్ నివేదికలో వివరించారు. మొదటి వేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. 2021 మే 5వ తేదీన ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వ్యక్తులు, చిన్న వ్యాపారులు, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల రుణ గ్రహీతలకు రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0ను ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ పరిమితిని రూ.25 కోట్లుగా నిర్ణయించింది. 2021 మార్చి 31న ప్రకటించిన తొలి ఫ్రేమ్‌వర్క్‌ను వినియోగించుకోని వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే జూన్ 4న రుణ పరిమితిని రూ.50 కోట్లకు పెంచింది. క్రిసిల్ రేటింగ్ ఇస్తున్న సంస్థల్లో 66 శాతం కంపెనీలు ఈ పరిధిలో ఉన్నాయి. అయితే అయితే కేవలం ఒకశాతం మాత్రమే పునర్వ్యవస్థీకరణను ఎంచుకుంటున్నల్లు క్రిసిల్ వివరించింది. వ్యాపార అవుట్‌లుక్ బాగుండడమే దీనికి కారణం. అయితే మూడవ వేవ్ వస్తే మాత్రం రుణ పునర్వ్యవస్థీకరణ 2.0ను ఎంచుకునే కంపెనీల సంఖ్య పెరుగుగుతుందని భావిస్తున్నట్లు క్రిసిల్ నివేదిక అభిప్రాయపడింది. చదవండి : జూలైలో జాబ్స్ పెరిగాయ్..రానున్న రోజుల్లో..! -
నష్టపోయిన పరిశ్రమలకు సీఎం రిలీఫ్ ఫండ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధిని నగరంలో నష్టపోయిన చిన్న పరిశ్రమలకు కూడా అందిస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీని హైదరాబాద్‌కి తీసుకొచ్చామని, హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆయన బుధవారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని మారియెట్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ‘హుషార్ హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కోవిడ్ ప్రభావం అన్ని రంగలమీద పడిందని, నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చదవండి: (హైదరాబాద్‌నూ అమ్మేస్తారు : కేటీఆర్) కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ పధకం కింద ఎంత మందిని ఆదుకుందో తెలియదని ఎద్దేవా చేశారు. డీమానిటైజేషన్ వల్ల చిరు వ్యాపారులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. గతంలో పవర్ లేక చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడేవారని, కరెంట్ కోసం ధర్నాలు కూడా చేశారని కానీ ఇప్పుడు పరిస్థితిని పూర్తిగా మార్చామన్నారు. తెలంగాణ వచ్చాక 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సిటీలో తన చిన్నతనంలో నెలకోసారి అల్లర్లు జరిగేవని, స్కూల్స్, పరిశ్రమలు బంద్ చేయించేవారన్నారు. దాని వల్ల విద్యార్థులతో పాటు వ్యాపారులు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. ఇప్పుడు సిటీలో అల్లర్లు చెలరేగకుండా చూస్తున్నామని, శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని చెప్పారు. హైదరాబాద్‌ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నామని, సిటీ శివారుల్లో కొత్తగా వస్తున్న టౌన్షిప్లకు రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీ ని హైదరాబాద్‌కి తీసుకొచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నగరంలో అందుతున్న వైద్యం, విద్య, ఉద్యోగోవకాశాలను జిల్లాల్లోనూ కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లోనూ ఇన్వెస్ట్ చెయ్యాలని వ్యాపారవేత్తలను కోరుతున్నామని, ఆగ్రో ప్రొస్సేసింగ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉందన్నారు. పాడీ పరిశ్రమల్లో మనం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, వరి, పప్పు ధాన్యాలు బాగా పండుతున్నాయన్నారు. వివిధ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను నెలకొల్పేలా చూస్తామని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సంపత్ కుమార్ గుప్తా, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. -
స్తంభించిన వాణిజ్య సేవలు!
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో 39 రోజులుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో వాణిజ్య సేవలు పూర్తి గా స్తంభించాయి. జూలై 30న కేంద్రప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నాటి నుంచి జిల్లాలోని ప్రతి ఉద్యోగి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగం గా జిల్లా వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు, సిబ్బంది సైతం కార్యాలయాలకు తాళాలు వేసి ప్రత్యక్ష అందోళనలో పాల్గొంటున్నారు. దీంతో వ్యాపార సంస్థల నూతన రిజిస్ట్రేషన్లు, నెలవారి పన్నుల వసూళ్లు నిలచిపోయాయి. దీనికితోడు జిల్లాలో అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సైతం మూసివేశారు. అక్రమరవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రతినెలా జిల్లా వాణిజ్యశాఖ ద్వారా కనీసం సుమారు రూ.20 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతుంది. ఉద్యోగుల సమ్మె ప్రభావంతో జిల్లాలోని నరహరిపేట, చిత్తూరులోని ఠాణా చెక్‌పోస్టు, నాగలాపురం, పలమనేరు, తడుకు పేట చెక్ పోస్టులు పూర్తిగా మూతపడ్డాయి. వీటితో పాటు అధికారులు జరిపే మహాచెక్లు ఆగిపోవటంతో ఈ శాఖకు రావలసిన ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడింది. దీంతో జిల్లా నుంచి ఎలాంటి తనిఖీలు లేకుండా గ్రానైట్, ఇతర నిత్యావసర వస్తువులు రాష్ట్ర సరిహద్దులు దాటి యథేచ్ఛగా వెళుతున్నాయి. నెలలో కేవలం ఉద్యోగుల తనిఖీలు లేకపోవడంతో గడచిన 35 రోజుల్లో ప్రభుత్వం సుమారు రూ.25 కోట్లు నష్టపోయింది. పట్టు వీడని ఉద్యోగులు జిల్లాలో సమ్మె చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, సిబ్బంది కేంద్రం దిగివచ్చి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని అంటున్నారు. రాష్ట్ర విభజన వల్ల తమ పిల్లల భవిష్యత్తు నష్టపోతుందంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ ప్రాణాలైనా అర్పిస్తాం, కాని సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను ఎటువంటిపరిస్థితుల్లోనూ వదులుకునేందుకు సిద్ధంగా లేమంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.