
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పనితీరును కాగ్ నివేదిక తూర్పారబట్టింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వాణిజ్య పన్నుల కార్యాలయాల్లో ఏదో ఒక తప్పును గుర్తించిన కాగ్.. మొత్తం రూ.1,100 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని పేర్కొంది. టర్నోవర్ లెక్కించడం నుంచి పన్ను వసూలు వరకు, పన్ను కట్టకపోతే జరిమానా విధింపు నుంచి, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మంజూరు వరకు, టర్నోవర్ తేడాల నుంచి కొనుగోలు టర్నోవర్ ఎక్కువ చూపించడం వరకు.. ఇలా 1,055 కేసుల్లో తప్పులు జరిగాయని నిర్ధారించింది.
పన్ను విధించక రూ.780 కోట్ల నష్టం
2016–17 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ ఫలితాలను పరిశీలిస్తే మొత్తం 7 కేటగిరీల్లో అవకతవకలు బయటపడ్డాయి. ముఖ్యంగా వస్తువులపై పన్ను విధించకుండా లేదా తక్కువ పన్ను వసూలు చేయడం ద్వారా రూ.780 కోట్ల అవకతవకలు జరిగాయని కాగ్ పేర్కొంది. వర్క్ కాంట్రాక్టులకు తక్కువ పన్ను విధించడం ద్వారా రూ.19.57 కోట్లు, వడ్డీ జరిమానా విధించకపోవడం, తక్కువ విధించడం వల్ల రూ.26.02 కోట్లు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మంజూరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రూ.25.43 కోట్లు, కేంద్ర అమ్మకం పన్నులను విధించకపోవడం లేదా తగ్గించడం వల్ల రూ.79.98 కోట్లు, అమ్మకపు పన్ను వాయిదా వల్ల రూ.10.22 కోట్లు, ఇతర అవకతవకల వల్ల రూ.158.16 కోట్ల నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. అయితే విలువ ఆధారిత పన్నును వసూలు చేయని లేదా తక్కువ వసూలు చేసిన 312 కేసుల్లోనే రూ.780.91 కోట్ల తేడా వచ్చిందని కాగ్ నివేదికలో వెల్లడించింది.
ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విషయానికొస్తే మొత్తం 359 కేసులకు రూ.42.06 కోట్ల మేర అవకతవకలు జరిగాయని కాగ్ నిర్ధారించింది. స్టాంపు డ్యూటీలు, ఫీజులు తక్కువగా విధించడం వల్ల రూ.36.99 కోట్లు, ఆస్తుల విలువ తక్కువ లెక్కించడం వల్ల రూ.4.29 కోట్లు, డాక్యుమెంట్లను తప్పుగా వర్గీకరించిన కారణంగా రూ.71 లక్షలు, ఇతర అవకతవకల వల్ల రూ.7 లక్షలు నష్టం జరిగిందని కాగ్ వెల్లడించింది. ఇందులో వ్యవసాయేతర భూముల (నాలా) రిజిస్ట్రేషన్‌కు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్, భీమ్‌గల్, భైంసా, దేవరకొండ, ఘన్‌పూర్, జడ్చర్ల, జోగిపేట, జనగామ, కూసుమంచి, మధిర, మహబూబాబాద్, నర్సంపేట, నిర్మల్, వర్ధన్నపేటల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యా లయాలను పరిశీలించగా, అందులో 29 దస్తావేజులను వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుని నాలా భూముల రిజిస్ట్రేషన్ చేశారని తేలిందని పేర్కొంది. ఇది రూ.2.04 కోట్ల తక్కువ డ్యూటీ, ఫీజు విధిం చడానికి కారణమైందని కాగ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment