వాణిజ్యపన్నులశాఖలో జలగలు
- ప్రతి పనికీ ఒక రేటు
- వాణిజ్యశాఖకు పన్నుల ఎగనామం
- ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
- లంచాల మత్తులో అధికారులు
నెల్లూరు (టౌన్): నెల్లూరు వాణిజ్యపన్నుల శాఖలో అవినీతి రాజ్యమేలుతుంది. అక్కడ ఏ పని కావాలన్నా అధికారులు అడిగినంత సమర్పించుకోవాల్సిందే. ప్రతి పనికి ఒక ధరను నిర్ణయించి అక్కడ కొంతమంది అధికారులు అమలు చేస్తున్నారు. లెసైన్సు దగ్గర నుంచి పన్ను చెల్లింపు వరకు అధికారులు లంచాల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం నెల్లూరులో పనిచేస్తున్న సీటీఓ(ఆడిట్) సూర్యప్రకాష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా కోట్లల్లో కూడబెట్టిన అక్రమ ఆస్తులు వెలుగులోకి రావడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.
లావాదేవీలు ఇలా..
జిల్లాలోని వాణిజ్యపన్నుల శాఖలో 5 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 3 సర్కిల్ కార్యాలయాలు, గూడూరు, కావలి ప్రాంతాల్లో ఒక్కో సర్కిల్ కార్యాలయం ఉంది. జిల్లాలో ఐదుగురు సీటీఓలు, 11మంది డీసీటీఓలు, 23 మంది ఏసీటీలు విధులు నిర్వహిస్తున్నారు. సర్కిల్ కార్యాలయంలో వాణిజ్యపన్నుల అధికారి ఉంటారు. ఆయనతో పాటు డీసీటీఓలు, ఏసీటీఓలు వ్యాపార లావాదేవీలను పర్యవేక్షిస్తుంటారు. వ్యాట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యాపారులు ఆయా వస్తువులును బట్టి 1శాతం, 1శాతం, 14.5శా తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 5నుంచి రూ. 40లక్షల లోపు వ్యాపారం చేసే ప్రతివారు 1 శాతం పన్నును చెల్లించాలి. వీరంతా టీఓటీ(టాట్) పరిధిలోకి వస్తారు. రాష్ట్రంలోనే వ్యాపార లావాదేవీలు నిర్వహించాల్సి ఉంది. రూ. 40 లక్షల పైబడి వ్యాపారం చేసేవారు వ్యాట్ పరిధిలోకి వస్తారు. వీరంతా ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహిస్తుంటారు. జిల్లాలో దాదాపు 10వేల మందికి పైగా వ్యాట్ డీలర్లు ఉన్నారు.
వ్యాట్‌కు తూట్లు...
జిల్లాలో కోట్లల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రసుత్తం ఏసీబీకి దొరికిన సీటీఓ గూడూరులో పనిచేస్తున్నడప్పుడు పలు ఆరోపణలు వచ్చాయి. బియ్యం, ఇనుము పరిశ్రమలతో పాటు సెజ్‌లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఎలాంటి పన్నులు వసూలు చేయకుండా భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించా యి. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కొంతమేర పరిశ్రమల నుంచి పన్నులు వసూలు చేశారు.
ఇదే రీతిలో పలు పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి పన్ను చెల్లించకుండా జిల్లా నుంచి పెద్దమొత్తంలో సరుకులను ఇతర రాష్ట్రాలకు తరలించి వాణిజ్యశాఖకు పన్ను ఎగనామం పెడుతున్నారు. జిల్లా నుంచి బియ్యం, చక్కెర, ధాన్యం, పప్పు లు భారీగా ఇతర రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నా యి. వీటిని ఎక్కువగా పార్శిల్ లారీల్లో ఇతర రాష్ట్రాలకు చేరవేస్తుంటారు. ఆయా శాఖల అధికారులకు భారీగా ముడుపులు చెల్లించి సరిహద్దును దాటించడంలో జాక్‌పాట్ లారీలు ప్రసిద్ధి. ఈ రీతిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అటు వ్యాపారులు, ఇటు అధికారులు లక్షల్లో ఆర్జిస్తున్నారు.